చెట్ల మధ్య నుంచి నడుచుకుంటూ నివాసాలకు వెళ్తున్న ప్రజలు
సాక్షి, పాల్వంచరూరల్: గుట్టపైన వారు ఆరు ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. వారికి మౌలిక సదుపాయాలు ఏమాత్రం లేవు. నిత్యం సమస్యలతో సావాసం చేస్తుంటారు. విషసర్పాలు, తేళ్లు, జెర్రులు, క్రిమికీటకాల దాడుల నుంచి తప్పించుకుంటూ జీవనం సాగిస్తుంటారు. సరైన రహదారి మార్గం లేదు. వర్షాకాలంలో చెరువునీటిలో నుంచి ప్రాణాలకు తెగించి రాకపోకలు సాగిస్తుంటారు. ఎక్కడైనా నివాసం ఉండేందుకు స్థలం ఇప్పిస్తే గుట్టదిగి వెళ్తామని ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకుంటున్నా ఎవరూ కనికరించడం లేదని వాపోతున్నారు.
ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా తమ జీవనంలో పురోగతిలేదని చెబుతున్నారు. పాల్వంచ మండలం బీసీయం జాతీయ రహదారి పక్కన గల జగన్నాథపురం గ్రామ పంచాయతీ రంగాపురం శివారులోని గుట్టపైన 24 ఏళ్లుగా ఆరు కుటుబాలకు చెందిన 20 మంది.. తడకలు, బుట్టలు, తట్టలు అల్లుకుంటూ తద్వారా వచ్చిన ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. గుట్ట మీద చెట్లు, పుట్టలు, ఉండటంతో అధికంగా విషసర్పాలు, తేళ్లు, కీటకాల మధ్య నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకులు కావాలంటే నిత్యం రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన నడిచి వెళ్లాల్సిందే. గుట్ట మీద నుంచి తమ నివాసాలను మార్చేలా చూడాలని అనేక సార్లు ఎమ్మెల్యేను కలిసి ప్రాధేయపడ్డామని, పలుమార్లు ప్రజావాణిలో అధికారులకు విన్నవించుకున్నామని, అయినా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదని వాపోతున్నారు.
గుట్ట మీదకు రహదారి సౌకర్యం లేదు. వర్షాకాలంలో చెరువు నిండితే అందులో నుంచి రాకపోకలు సాగించాలి. రోగం వచ్చినా, పురిటి నొప్పులు వచ్చినా ఆస్పత్రికి సకాలంలో చేరుకోలేక అవస్థలు పడుతున్నారు. రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు కూడా ఉన్నాయి. తాగడానికి ఒక చేతిపంపు ఉంది. అది వేసవిలో పనిచేయదు. పిల్లలను చదువుకు పంపించలేక ఇంటి వద్ద ఉంచుకుంటున్నాం. కాగా, గుట్ట పక్కన శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు నిర్మించాలని రంగాపురం పంచాయతీ సర్పంచ్ చూస్తున్నారు. శ్మశానవాటిక నిర్మిస్తే అక్కడ ఎలా జీవనం సాగించాలని గుట్టవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గుట్ట పక్కన శ్మశానవాటికను గానీ, డంపింగ్‌యార్డును కానీ నిర్మించకుండా మరో ప్రదేశంలో నిర్మించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా మైదాన ప్రాంతంలో ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతున్నారు.
గుట్టమీద ఉండలేకపోతున్నాం
గుట్టమీద నివాసం ఉండాలంటే క్షణక్షణం భయంగా ఉంది. ఎటువైపు నుంచి ఏపాము, ఏపురుగు వచ్చి కాటేస్తుందో అని. ఇంటి స్థలాలు ఇస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోతాం. గ్రీవెన్స్‌డేలో అనేక సార్లు అధికారులకు విన్నవించుకున్నాం. ఇంతవ రకు ఎవరూ పట్టించుకోలేదు. కూరాకుల లలిత
రహదారిలేక అవస్థలు పడుతున్నాం
గుట్టమీద బతకడం ప్రమాదకరంగా ఉంది. ఇంటి స్థలాలు ఇప్పించాలని అనేక సార్లు అధికారులు, నాయకులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేడు. గుట్టమీద ఉన్న నివాసాలకు రాకపోకలు సాగించేందుకు సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతున్నాం. వర్షాకాలం చెరువు నిండితే రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. అంగడి సూరమ్మ
పట్టించుకునే దిక్కులేదు
గుట్టమీద అడవిలో బతుకున్న మాకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇళ్లు ఇస్తే కట్టుకున్నాం. విద్యుత్ సౌకర్యం కూడా కల్పించారు. కానీ వీధిలైట్లు వేయడం లేదు. దీంతో రాత్రి సమయంలో ఏ విషపురుగులకు బలికావాల్సి వస్తుందో అని భయపడుతున్నాం. అనేక సార్లు అధికారులకు మా గోడును విన్నవించుకున్నా పట్టించుకునే దిక్కు లేదు. వెలుగు ఉప్పలమ్మ
శ్మశానవాటికను నిర్మించొద్దు
గుట్ట మీద జీవనం సాగిస్తున్న మాకు మౌలిక సౌకర్యాలు లేక సతమతమవుతున్నాం. గుట్ట పక్కన శ్మశానవాటిక, డంపింగ్‌యార్డును నిర్మించాలని చూస్తున్నారు. వాటిని గుట్ట పక్కన కాకుండా మరో ప్రదేశంలో నిర్మించుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకొని న్యాయం చేయాలి. రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్తేనే పని దొరుకుతుంది.
వెలుగు ఉపేంద్ర
Comments
Please login to add a commentAdd a comment