637 కోట్లు
ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన నిధులు
- అసెంబ్లీ అంచనాల కమిటీకి నివేదిక పంపిన అధికారులు
- కొత్త ప్రాజెక్టుల సర్వేలకు నిధులివ్వాలని వినతి
- ప్రాజెక్టులనుంచి పూర్తిస్థాయి నీటి విడుదలే లక్ష్యం
గద్వాల : జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే 637కోట్ల రూపాయలు అవసరమవుతాయని జిల్లా అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు నివేదికను అసెంబ్లీ అంచనాల కమిటీకి నివేదిక సమర్పించారు. గత ఫిబ్రవరిలో జరిగిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టులకు అరకొర నిధులు కెటాయించింది. అందులోని కేటాయింపు మేరకు నిధులను ఖర్చు చేసే పరిస్థితులు రాలేదు. ఒకేసారి స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, ఎంపీల ఎన్నికలు రావడంతో ఆశించిన విధంగా పనులు జరగలేదు. నిధులు విడుదల కాలేదు. దీంతో జిల్లాలోని ప్రాజెక్టుల ప్రస్తుత ఖరీఫ్ లక్ష్యం కుదించబడింది.
ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు అంచనాలను కొరింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు వారిగా నివేదికలు సిద్ధం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగే బడ్జెట్ అంచనాల కమిటీ సమావేశంలోఈ నివేదికల అధారంగా నిధుల కేటాయింపుల అవసరాన్ని ప్రభుత్వం ముందుంచనున్నారు. అయితే, అధికారులు ప్రతిపాదించిన విధంగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారా... లేక ప్రతిసారి జరిగినట్టుగానే ఈ సారీ జరగనుందా అనే విషయం బడ్జెట్ సమావేశాల్లో తేలనుంది. రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్‌లోనైనా ప్రాజెక్టుకు సరిపడా నిధులు కేటాయించి వాటిని విడుదల చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.