సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో సీట్లు అధిక సంఖ్యలో మిగిలిపోయాయి. రాష్ట్రంలో పాత గురుకులాలతో పాటు ఈసారి కొత్తగా ఏర్పాటు చేసిన గురుకులాలు కలుపుకొని మొత్తంగా 52 ప్రభుత్వ గురుకుల డిగ్రీ కాలేజీలు ఉండగా వాటిల్లో 15,360 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో 8,101 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మరో 7,259 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. 52 కాలేజీల్లో కొత్తగా ఏర్పాటు చేసినవే 40కి పైగా కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో విద్యా బోధన పట్ల విద్యార్థులకు పెద్దగా అవగాహన లేని కారణంగా సీట్లన్నీ భర్తీ కాలేదని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రంలోని 1,186 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 4,48,457 సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 2,23,427 సీట్లు భర్తీ కాగా, మరో 2,25,030 సీట్లు ఖాళీగానే ఉండిపోయాయి.
ప్రభుత్వ కాలేజీల్లోనూ మిగులు: వివిధ ప్రైవేటు కాలేజీలతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ సీట్లు మిగిలిపోయాయి. ప్రభుత్వ కాలేజీల్లో 60 వేల వరకు సీట్లు అందుబాటులో ఉండగా, 29 వేల వరకు సీట్లు మిగిలిపోయాయి. ఇక ప్రైవేటు కాలేజీల్లో 3.22 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 1.70 లక్షల సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఈసారే కాదు ఏటా మిగిలిపోతున్న నేపథ్యంలో అవసరం లేని సీట్లకు కోత పెట్టాలని ఉన్నత విద్యా మండలి ఇదివరకే నిర్ణయించింది. వచ్చే ఏడాది లక్ష సీట్లను తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. ఈసారి 30 శాతం సీట్లు కూడా భర్తీ కాని కాలేజీల్లో ప్రవేశాలను రద్దు చేసి, ఆ విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి పంపించాలని ఇదివరకే వర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది.
Published Mon, Sep 25 2017 1:40 AM | Last Updated on Mon, Sep 25 2017 1:40 AM
Advertisement