పాత బాలీవుడ్ సినిమాల్లో ఇదో రొటీన్ సీను.. హీరో ఓ పోలీసు.. విలన్ ఏదో అంటాడు.. అప్పుడు మన హీరో.. ‘కానూన్ కా హాత్ బహుత్ లంబే హోతేహై’అంటూ స్టైల్‌గా ఓ డైలాగు విసురుతాడు. అంటే దానర్థం చట్టం చేతులు చాలా పొడవైనవి.. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరని.. ఇక్కడ చట్టం చేతులే కాదు.. మనిషి కూడా చాలా పొడవే!! జగ్దీప్ సింగ్.. పంజాబ్ పోలీసు విభాగంలో ట్రాఫిక్ పోలీసు. ఇతని ఎత్తు 7 అడుగుల 6 అంగుళాలు. బరువు 190 కిలోలు. ప్రపంచంలోనే అతి పొడవైన పోలీసు అని పేరు. త్వరలోనే గిన్నిస్ బుక్ వారు కూడా ఈ రికార్డును గుర్తించనున్నారని జగ్దీప్ చెబుతున్నాడు. ఇతడి షూ సైజు 19. మన దేశంలో దొరకదు. దీంతో విదేశాల నుంచి తెప్పించుకుంటాడు.
షోరూంలో బట్టలు దొరకవు. ప్రత్యేకంగా కుట్టించుకోవాల్సిందే. ఇక బైకు, కారు ప్రయాణాల సంగతి చెప్పనక్కర్లేదు. చిన్నకార్లలో అయితే.. మనోడు పట్టడు. బైకులయితే.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం టైపులో ఇతడి ముందు వెలవెలబోతుంటాయి. మొన్నమొన్నటి వరకూ ఇతడికి పిల్లనిచ్చేవారు కూడా కరువయ్యారు. ఇంత ఎత్తు అంటే ఏదో ఆరోగ్య సమస్య ఉంటుందన్న కారణంతో.. అయితే.. మనోడి అదృష్టం కొద్ది.. అమ్మాయి దొరికింది. జగ్దీప్ అంత హైటు కాకున్నా.. ఇతడి సతీమణి ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు. జగ్దీప్ పర్సనాలిటీ చూసి.. సోషల్ మీడియాలో ఇతడిని రాక్షసుడు అన్నవారూ ఉన్నారు. అదే సమయంలో సెల్ఫీల కోసం ఎగబడినవాళ్లూ ఉన్నారు. అలా మనోడి జీవితం కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం టైపులో బాగానే నడిచిపోతోందట.
– సాక్షి, తెలంగాణ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment