
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖలో భారీ అక్రమం బయటపడింది. ఈవెంట్ పర్మిట్ లైసెన్సులపై మద్యం కొనుగోలులో అధికారుల చేతివాటం సర్కారు ఖజానాకు రూ.100 కోట్ల కుపైగా గండిపెట్టింది. సొమ్ము దండుకునేం దుకు అధికారులు ఏకంగా తప్పుడు నిబంధన లనే సృష్టించారు. నకిలీ పర్మిట్లనూ జారీ చేశారు.ఈవెంట్ల కోసం ప్రివిలేజ్ ఫీజు చెల్లించి డిపోల నుంచి మద్యం కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఆ సమీపంలోని దుకాణాల్లోనే కొను గోలు చేయాలంటూ ‘సొంత’ నిబంధనలను అమలు చేశారు. ఆ మద్యం దుకాణాల నిర్వా హకుల నుంచి కమీషన్లు దండుకున్నారు. మూడేళ్లుగా సాగుతున్న ఈ తతంగం ఇటీవలే అకౌంటెంట్ జనరల్ పరిశీలనలో వెల్లడైంది.
పెద్ద సంఖ్యలో ఈవెంట్లు జరుగుతున్నా..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15 వేలకు వరకు ఫంక్షన్ హాళ్లు, 200 వరకు క్లబ్బులు, 500కు పైగా పెద్ద హోటళ్లు, బాంకెట్ హాళ్లు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ రికార్డుల ప్రకారం వాటిలో ఏటా 1.5 లక్షల వరకు పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు జరుగుతుంటాయి. చాలా ఫంక్ష న్లలో మద్యం కూడా వినియోగిస్తుంటారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఇలాంటి ఫంక్షన్ల లో మద్యం వినియోగించాలంటే ఈవెంట్ పర్మిట్ లైసెన్సు తీసుకోవాలి. ఆ మద్యాన్ని కూ డా కచ్చితంగా బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌బీసీఎల్) డిపో నుంచే కొనుగోలు చేయాలి.
అలాకాకుండా మద్యం దుకాణాల్లో, ఇతర మార్గాల ద్వారా మద్యం కొనుగోలు చేస్తే... ఆ ఈవెంట్ పర్మిట్‌ను రద్దు చేసి, వారిపై కేసులు నమోదు చేయాలి. కానీ గ్రేటర్ హైదరా బాద్ పరిధిలో ఎక్కడా ఇది అమలు కావడం లేదని, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోందని ఎకౌంటెంట్ జనరల్ (ఏజీ) గుర్తించారు. ఈ మేరకు 2014–15, 2015–16 సంవత్సరాల్లో ఎన్ని ఈవెంట్ పర్మిట్‌లకు లైసెన్సులు ఇచ్చారు? లైసెన్స్ తీసుకున్నవారు డిపోల నుంచి ఎంత మద్యం కొనుగోలు చేశా రు, దాని ద్వారా ఎంత సొమ్ము ప్రివిలేజ్ ఫీజు గా వసూలైందనే వివరాలను పంపాలని ఎక్సైజ్ కమినర్‌కు ఫిబ్రవరిలోనే లేఖ రాశారు. కానీ ఈ లేఖను కమిషనర్ కార్యాలయం దాచిపెట్టింది. లేఖ వచ్చి 7 నెలలైనా ఇప్పటివరకు కమిషనర్ చంద్రవదన్‌కు తెలియకపోవటం గమనార్హం.
నిబంధనలు తుంగలో తొక్కి..
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో కలిపి ఏటా 10 వేల ఈవెంట్ పర్మిట్లు జారీ అవుతున్నాయి. ఈ పర్మిట్ తీసుకున్నవారు కొనుగోలు చేసే మద్యం ధర మీద 15% ప్రివిలేజ్ ఫీజు వసూలు చేస్తారు. పర్మిట్లు తీసుకుంటున్న వారిలో దాదాపు 90 % మంది ప్రీమియం మద్యం వినియోగిస్తున్నట్లు ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. మరో 10 శాతం మీడియం బ్రాండ్ల మద్యం వినియోగిస్తున్నారు.
సగటున ప్రతి ఫంక్షన్‌లో 50 ఫుల్ బాటిళ్లు వినియోగిస్తున్నట్లు అంచనా. ఒక్కో బాటిల్ ధర సగటున రూ.1,000గా లెక్కించినా.. ప్రతి బాటిల్‌పై రూ.150 చొప్పున మొత్తంగా రూ.75 కోట్లు æప్రివిలేజ్ ఫీజు ప్రభుత్వ ఖజానాకు చేరాలి. కానీ పర్మిట్ తీసు కున్నవారు మద్యం దుకాణాల్లో కొనుగోలు చేసేలా ఎక్సైజ్ అధికారులు వ్యూహం పన్నుతున్నారు. అసలు డిపోల నుంచి మద్యం కొనాలనే నిబంధన పర్మిట్‌దారులకు తెలియ కుండా చేస్తున్నారు. ఆ ఫంక్షన్‌హాల్ ఉన్న ప్రాంతం పరిధిలోని మద్యం దుకాణంలోనే కొనాలంటూ లేని నిబంధన పెడుతున్నారు. ఇలా పర్మిట్‌దారులతో కొనుగోలు చేయించి.. సదరు మద్యం దుకాణం నుంచి 5% కమీషన్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఏజీ వివరాలు అడిగినట్టు తెలియదు
‘‘ఈవెంట్ పర్మిట్ లైసెన్స్ మీద డిపోల్లో మద్యం తీసుకున్న వారి వివరాలు కావాలని ఎకౌంటెంట్ జనరల్ లేఖ రాసిన విషయం నాకు తెలియదు. దాని మీద నాకు పెద్దగా అవగాహన కూడా లేదు. ఇక టీఎస్‌బీసీఎల్‌కు కూడా లేఖ ఏమైనా రాసిందేమో తెలుసుకోవాలి..’’
– చంద్రవదన్, ఎక్సైజ్ కమిషనర్
నకిలీ లైసెన్సులతోనూ..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సరూర్‌నగర్ ప్రాంతాల్లో భారీగా ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో సగం వాటిలో మద్యం వినియోగిస్తుంటారు. అయితే ఈ ప్రాంతాల్లో పలువురు ఎక్సైజ్ అధికారులు.. నకిలీ ఈవెంట్ పర్మిట్లు జారీ చేస్తున్నారు. పాత లైసెన్సులను స్కాన్ చేసి ఈఎస్ సంతకం ఫోర్జరీ చేసి కొత్తగా జారీ చేస్తున్నట్లు ఇటీవల గుర్తించారు కూడా. ప్రతి ఈవెంట్ పర్మిట్‌కు ప్రభుత్వం రూ.9,000 ఫీజు వసూలు చేస్తుంది. ఈ లెక్కన ఈవెంట్ పర్మిట్ ఫీజుతోపాటు వారు కొనుగోలు చేసే మద్యంపై ప్రివిలేజ్ ఫీజునూ ప్రభుత్వం కోల్పోతోంది. ఈ మొత్తం విలువ రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా.