సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ కాంట్రాక్ట్ మ్యారేజ్ అడ్డాలపై సౌత్ జోన్ పోలీసులు సోమవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. నగరంలోని పాతబస్తీ, ఫలక్‌నుమ, చంద్రాయణగుట్ట, తలాబ్‌కట్టా ప్రాంతాల్లోని ఖాజీల ఇళ్లు, కార్యాలయాలపై పోలీసులు ఏకకాలంలో తనిఖీలు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఖాజీ అలీ అబ్దుల్లా రఫైతో పాటు పలువురు అరబ్‌షేక్‌లు, బ్రోకర్లు ఉన్నారని డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు. రఫైపై పీడీ యాక్ట్ ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు.
అమాయకులైన యువతులను, బాలికలను అరబ్‌షేక్‌లకు ఇచ్చి బలవంతంగా వివాహాలు చేయడం, విదేశాలకు తీసుకెళ్లి వారికి నరకం చూపిస్తుంటారన్న విషయం తెలిసిందే. బ్రోకర్ల సాయంతో యువతుల కుటుంబాలకు డబ్బు ఆశచూపి పెళ్లిచేసుకుని విదేశాలకు తీసుకెళ్తారు అరబ్‌షేక్‌లు. ఇటీవల నమోదైన కొన్ని కేసులతో ఈ అంతర్జాతీయ మ్యారేజ్ కాంట్రాక్ట్ అడ్డాలపై పోలీసులు దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే నిఘా ఉంచిన కొన్ని మ్యారేజ్ అడ్డాలపై దాడులు నిర్వహించి పలువురు అరబ్‌షేక్‌లు, బ్రోకర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.