
రాష్ట్ర అధికారులతో సీట్లు సాధించిన విద్యార్థులు (ఫైల్)
హైదరాబాద్: ఇప్పటి వరకు ఢిల్లీని మ్యాప్‌లో చూడడమే గానీ.. ఎప్పుడూ వెళ్లని నిరుపేద విద్యార్థులు వారు. అలాంటిది అక్కడే ఉన్నత విద్య చదువుకునే అవకాశం రావడంతో వారి ఆనందానికి హద్దుల్లేవు. వీరంతా మారుమూల గ్రామాలు, తండాల్లో నివాసముండేవారే. వీరిలో చాలా మంది తల్లిదండ్రులు రోజు కూలీలే. 2018–19 విద్యా సంవత్సరానికి గాను ప్రఖ్యాత ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ చదివేందుకు రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాలకు చెందిన 94 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
గత ఏడాది కేవలం 12 మందే సీట్లు సాధించగా ఈసారి 94 మందికి అవకాశం రావడం విశేషం. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల నుంచి ఎంపికైన 62 మందిలో 30 మంది బాలికలు కాగా, 32 మంది బాలురు ఉన్నారు. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలల నుంచి 32 మంది ఎంపిక కాగా అందులో 17 మంది బాలురు, 15 మంది బాలికలు ఉన్నారు. వీరంతా ఢిల్లీ వర్సిటీ అనుబంధ కళాశాలలైన హన్స్‌రాజ్, హిందూ, రామ్‌జాస్, మిరండా హౌజ్, కేశవ మెమోరియల్, కాలేజ్ ఆఫ్ ఒకేషనల్, ఎస్‌ఆర్‌సీసీ, శ్రీవెంకటేశ్వర, దౌలత్‌రామ్ వంటి ప్రఖ్యాత కళాశాల్లో సీట్లు పొందడం విశేషం.
మాకెంతో గర్వంగా ఉంది..
రాష్ట్ర ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ గురుకులాల పుణ్యమా అని, ప్రవీణ్‌సార్ చలవతో మా పాప మానసకు ఢిల్లీలోని హిందూ కళాశాలలో చదువుకునే అవకాశం వచ్చింది. మాది ఖమ్మం జిల్లా టి.పాలెం మండలంలోని పిండిపోలు గ్రామం. రోజువారీ కూలీ చేసే మాకు ఇది ఎంతో గర్వంగా ఉంది.
– ఉపేందర్
ఐఏఎస్ కావాలన్నదే లక్ష్యం
బాగా చదివి ఐఏఎస్ కావాలన్నదే నా లక్ష్యం. రామ్‌జాస్ కళాశాలలో బీఎస్సీ హానర్స్ మ్యాథ్స్‌లో సీటు సాధించా. నేను బాగా చదివి పెద్ద ఉద్యోగం చేయాలన్నది నా తల్లిదండ్రుల కల. దాన్ని నెరవేరుస్తా.
– సురేశ్‌నాయక్
చాలా సంతోషంగా ఉంది..
ఐఏఎస్ అధికారినై పేదలకు సేవ చేయాలన్నదే లక్ష్యం. మాది సూర్యా పేట జిల్లా కపూరియాతండాకు చెందిన నిరుపేద కుటుంబం. మిరండా హౌజ్‌లో బీఎస్సీ హానర్స్ బాటనీ కోర్సులో సీటు సాధించా. చాలా సంతోషంగా ఉంది. ఇదంతా గురుకులాల చలవే.
– స్వాతి
Comments
Please login to add a commentAdd a comment