సాక్షి ప్రతినిధి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే -2014 కార్యక్రమాన్ని సంపూర్ణం గావించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారంనాటి సర్వేతో జిల్లాలోని 8.59 లక్షల కుటుంబాలలో 95 శాతం మేర వివరాలు సేకరించినట్టు అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు.
జిల్లాలో దాదాపు 40 వేల కుటుంబాల వివ రాలు ఇంకా రాలేదని అధికారుల అంచనా. మొత్తం కుటుంబాల సంఖ్యలో ఇది కేవలం 5 శాతమే అయినా.. ఆ వివరాలను కూడా సేకరించాల్సిందేనని కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి భావిస్తున్నారు. వదిలివేసిన ఇళ్లపై ప్రత్యేక చొరవ తీసుకుని మాపప్ సర్వే నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన ఇళ్లంటినీ మళ్లీ ఒకేరోజు సర్వే చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, మాపప్ సర్వే పరిమితంగా నిర్వహించనున్నట్టు సమాచారం.
కేవలం స్టిక్కర్లు వేసి.. సర్వే చేయని ఇళ్లకు మాత్రమే మళ్లీ ఎన్యూమరేటర్లు వెళ్లి వివరాలు సేకరిస్తారని చెపుతున్నారు. మరోవైపు సర్వేలో భాగంగా సేకరించిన వివరాలను నిక్షిప్తం చేసే ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 20 కేంద్రాలను ఏర్పాటు చేసి ఆన్‌లైన్ ఫార్మాట్‌లో డేటా ఎంట్రీ చేయనున్నారు. ఇందుకోసం కళాశాలల విద్యార్థులు, కొందరు ప్రభుత్వ సిబ్బంది, అధికారులను కూడా వినియోగించుకోనున్నారు.
కొనసాగిన ఆందోళనలు..
సర్వేలో భాగంగా తమ కుటుంబ వివరాలు సేకరించలేదని, స్టిక్కర్లు ఇచ్చి కూడా సర్వేకు రాలేదని వేలాది మంది ఆందోళన రెండో రోజు కూడా కొనసాగింది. బుధవారం ఉదయం కొందరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అయితే, వారి వద్దకు వచ్చిన కలెక్టర్ సావధానంగా వారి మాటలు విని, స్టిక్కర్లు వేసిన ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని చెప్పారు.
ఈ ఫిర్యాదులు పరంపర సాయంత్రం వరకూ కొనసాగింది. తహశీల్దార్ నుంచి కలెక్టర్ వరకు ప్రజలు వ్యక్తిగతంగా కలిసి ఫిర్యాదు చేశారు. కాగా, అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించిన జిల్లా యంత్రాంగం జిల్లాలో ఇంకా 5 శాతం కుటుంబాల వారిని సర్వే చేయకుండా మిగిలిపోయినట్టు గుర్తించింది. వీరందరికీ ప్రత్యేకంగా ఒక రోజు సర్వే చేస్తామని, సర్వే సమాచారాన్ని వారి మొబైల్‌ఫోన్లకు పంపుతామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని జిల్లా యంత్రాంగం చెపుతోంది.
ఆ ఐదు శాతాన్నీ వదలం
Published Thu, Aug 21 2014 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM
Advertisement
Advertisement