
పరీక్ష రాయమంటే.. పెళ్లి చేసుకున్నారు
నారాయణఖేడ్ (మెదక్) : డిగ్రీ చదువుతున్న ఆ నలుగురు విద్యార్థులు ప్రేమించుకున్నారు. ప్రస్తుతం ఏప్రిల్లో ఫైనలియర్ పరీక్షలు రాస్తున్న వారంతా చివరి పరీక్షను సైతం ఎగ్గొట్టి హైదరాబాద్ వెళ్లిపోయి పెళ్లిళ్లు చేసుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని వెతికి పట్టుకున్నారు. వివరాలు.. కంగ్టి మండలం తుర్కవడ్‌గాంకు చెందిన ప్రభులింగం(22), జనాబాయి(21) ప్రేమించుకున్నారు. అలాగే తుర్కవడ్‌గాంకు చెందిన లావణ్య(19) నారాయణఖేడ్ మండలం లింగాపూర్ గ్రామంలోని తన సోదరి వద్ద ఉంటూ చదువుకునేది. ఆమె కంగ్టి గ్రామానికి చెందిన మనోజ్‌గౌడ్(22)ను ప్రేమించింది. వీరంతా పెద్దలకు తెలియకుండా పెళ్లిళ్లు చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు.
ఫైనల్ పరీక్షలు జరుగుతుండగా కూడబలుక్కుని చివరి రోజు పరీక్షకు సైతం డుమ్మాకొట్టి ఏప్రిల్ 7వ తేదీన హైదరాబాద్‌కు చెక్కేశారు. కాచిగూడలోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కాగా వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారు హైదరాబాద్ వెళ్లినట్లు గుర్తించి శనివారం వెతికి తీసుకొచ్చారు. అయితే తాము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నట్లు అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. నలుగురూ మేజర్లు కావటం, పెద్దలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవటంతో కథ సుఖాంతం అయింది.