మిర్యాలగూడ :ఆధార్ కార్డుల అనుసంధానం పేరుతో ప్రజలు భేజార్ అవుతున్నారు. ప్రతి విషయానికి ఆధార్ కార్డులను లింకు పెడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను కుదించే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రజా పంపిణీ వ్యవస్థకు ఆధార్ కార్డుల లింకు పెట్టి సెప్టెంబర్ మాసం రేషన్ కట్ చేశారు. జిల్లాలో పూర్తిస్థాయిలో ఆధార్ కార్డులకు ఫోటోలు దిగని వారు కొంత మంది ఉండగా, కార్డులు ఉన్నా అనుసంధానం చేయకపోవడంతో మరికొందరు పరేషాన్ అవతున్నారు. రేషన్ కార్డులతో ఆధార్ కార్డుల అనుసంధానం కాలేదనే సాకుతో సెప్టెంబర్ మాసం రేషన్ సరుకులు నిలిపివేశారు.
బోగస్ కార్డులు తొలగించిన తర్వాత జిల్లా వ్యాప్తంగా తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు మొత్తం 9,30, 856 ఉన్నాయి.మొత్తం కార్డులలో 32,53,983 యూనిట్లకు గాను ఇప్పటి వరకు 25,12,442 యూనిట్లు మాత్రమే ఆధార్ కార్డులతో అనుసంధానం చేశారు. కాగా ఇంకా ఆధార్ కార్డులు ఇచ్చినా అనుసంధానం కానివి 4,64,720 యూనిట్లు అధికారుల వద్దనే ఉన్నాయి. 2,76,821 మం ది ఆధార్ కార్డులు అధికారులకు అందించాల్సి ఉంది. కానీ అధికారుల వద్దకు చేరినవాటితో పాటు అనుసంధానం కాని వారికి కూడా సెప్టెంబర్ కోటా రేషన్ కట్ చేశారు.
ఆధార్ అనుసంధానం తప్పనిసరి
రేషన్ కార్డులకు ఆధార్ కార్డుల అనుసంధానం తప్పనిసరిగా చేయాలి. ఆధార్ కార్డులు స్థానిక రేష న్ డీలర్లకు ఇవ్వని వారు ఇవ్వాలి. రచ్చబండలో మంజూరు చేసిన రేషన్ కార్డులకు సెప్టెంబర్ నెల కోటా విడుదల చేయలేదు. టెంపరరీ కార్డులకు ఫొటోలు ఇవ్వకపోవడం వల్ల రేషన్ నిలిపి వేశారు. వారు కూడా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఫొటో లు, ఆధార్ కార్డులు ఇవ్వాల్సి ఉంది.
- నాగేశ్వర్‌రావు, డీఎస్‌ఓ, నల్లగొండ.
రచ్చబండ కార్డులకు రేషన్ నిలిపివేత
గత ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమంలో టెంపరరీ రేషన్ కార్డులు మంజూరు చేశారు. కాగా లబ్ధిదారులకు ఫొటోలు లేకుండా టెం పరరీ కార్డుతో పాటు కూపన్లు అందజేశారు. కాగా ఇప్పటి వరకు కూపన్ల ద్వారా రేషన్ సరుకులు తెచ్చుకునే రచ్చబండలో మంజూ రైన రేషన్ కార్డు దారులు సెప్టెం బర్‌లో సరుకులు ఇవ్వడం లేదు. ఈ నెల కూపన్ ఉన్నా సరుకులు ఇవ్వడం లేదు. జిల్లా వ్యాప్తంగా 31వేల టెంపరరీ రేషన్ కార్డులకు సెప్టెంబర్ నెల రేషన్ నిలిపి వేశారు. కార్డులపై ఫొటోలు లేవనే సాకుతో పాటు ఆధార్ కార్డుల అనుసంధానం కాలేదని రేషన్ నిలిపివేశారు.
పండగకు పస్తులే
అక్టోబర్ మొదటి వారంలో దసరా పండగ వస్తున్నప్పటికీ సెప్టెంబర్ మాసం రేషన్ సరుకులు ఇవ్వక పోవడంతో పేదలు పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. ఆధార్ కార్డుల అనుసంధానం పేరుతో కొంత మందికి, టెంపరరీ కార్డుల పేరుతో మరికొంత మందికి రేషన్ సరుకులు నిలిపివేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 14 వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యానికి సెప్టెంబర్ మాసంలో 900 మెట్రిక్ టన్నులకు కుదించారు.
ఆధార్.. బేజార్
Published Tue, Sep 16 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM
Advertisement