కోస్గి ప్రభుత్వ జూనియర్ కళాశాల
కోస్గి (కొడంగల్) : ప్రభుత్వం విద్యారంగంలో విద్యార్థుల పేరుతో చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసి.. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఆన్‌లైన్ విధానాన్ని అమలుచేస్తుంది. రాష్ట్ర ప్రభు త్వ నిర్ణయంతో ఇప్పటికే ప్రమాణాలు పాటించని ఎన్నో ప్రైవేట్ కళాశాలలు మూతపడ్డాయి. ఇప్పటికే డిగ్రీలో ఆన్‌లైన్‌లో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఇంటర్‌లోనూ విద్యార్థుల ఆధార్ లింకు చేస్తూ ఆన్‌లైన్ విధానంలోనే అడ్మిషన్లు చేపట్టాలని ఆదేశాలు జా రీచేసింది.
ఇంటర్ విద్యకు ప్రభుత్వం ఆధార్‌ను లింకు చేయడంతో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో బోగస్ విద్యార్థులకు చెక్ పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌లో అడ్మిషన్ కావాలంటే ఆధా ర్‌ను తప్పనిసరిగా విద్యార్థి సమర్పించాలని ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఈ విద్యా సంవత్స రం నుంచే అమలు చేయాలని కళాశాలలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇకపై జూనియర్ కళాశాల ల్లో నేరుగా ప్రవేశాలు కల్పించే పద్ధతికి స్వస్తి చెప్పి ఆన్‌లైన్ విధానాన్ని ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టింది.
పక్కాగా విద్యార్థుల లెక్క
ప్రభుత్వ ఆన్‌లైన్ విధానంతో ఇక నుంచి విద్యార్థుల లెక్క పక్కాగా ఉండబోతోంది. కోస్గి మండల కేంద్రంలో రెండు ప్రైవేట్, ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలలతోపాటు ఒక పారామెడికల్ ఒకేషనల్ కళాశాల, ప్రైవేట్ ఐటీఐతోపాటు గుండుమాల్‌లో మోడల్ పాఠశాలలో ఇంటర్ విద్య కొనసాగుతుంది. మండలంలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో నాలుగు వేలకుపైగా విద్యార్థులు ఇంటర్, ఐటీఐ, పారామెడికల్ కోర్సుల్లో చదువుతున్నారు.
వీరందరికీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్‌లు అందిస్తుంది. ఆధార్ అనుసంధానంతో ఏ కళాశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. దీంతో ఒక కళాశాలలో చేరిన విద్యార్థి పేరు మరో కళాశాలలో నమోదు చేయలేరు. దీంతో ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్ నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడనుంది.
నిరాకరిస్తున్న ప్రైవేట్ కళాశాలలు
ఇంటర్‌లో ఈ ఏడాది నుంచి అమలు చేయనున్న ఆన్‌లైన్ విధానాన్ని ప్రైవేట్ కళాశాలు నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వం అందించిన ఉత్తర్వులను అమలు చేయకుండా ప్రైవేట్ కళాశాలల యూనియన్ ఆధ్వర్యంలో ఉమ్మడిగా ఉత్తర్వులను రద్దు చేయించాలని నిర్ణయించినట్లు ఓ ప్రైవేట్ కళాశాల నిర్వాహకుడు తెలిపారు.
ఇప్పటికే గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించే కళాశాలల యాజమాన్యాలు ఈ ఏడాది ఆన్‌లైన్ విధానం ఉత్తర్వులు అందడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మాత్రమే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పారదర్శకత పెరుగుతుంది
ఇంటర్‌లో సైతం ఆన్‌లైన్ విధానం అమలు చేసి ఆధార్‌ను లింకు చేస్తే విద్యారంగంలో పారదర్శకత మరింత పెరుగుతుం ది. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల అక్రమాలకు అడ్డుకట్ట పడి ప్రభుత్వం అందించే నిధులు అర్హులైన పేద విద్యార్థులకు అందుతాయి. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులు కల్పించి, సరిపడా బోధనా సిబ్బందిని నియమిస్తే ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు అడ్డుకట్ట వేయవచ్చు. – బద్రినాథ్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కోస్గి
Comments
Please login to add a commentAdd a comment