- కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్.ఎస్. బ్రహ్మ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు వీలుగా మార్చి 1 నుంచి ఆగస్టు 15 నాటికి దేశవ్యాప్తంగా ఆధార్‌కార్డులను ఓటరు గుర్తింపు కార్డులతో అనుసంధానం చేసే కార్యక్రమం నిర్వహిస్తామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ వెల్లడించారు. తద్వారా ఓటర్ల వద్ద ఒకటికన్నా ఎక్కువ కార్డులుంటే వాటిని తొలగిస్తామన్నారు. బోగస్ ఓటర్ కార్డుల ఏరివేత లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
శనివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల విభాగంలో ఓటరు కార్డు, ఆధార్ అనుసంధానం ప్రక్రియను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో దక్షిణాది రాష్ట్రాల సీఈవోలు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కలెక్టర్లతో సమీక్షించిన అనంతరం బ్రహ్మ మీడియాతో మాట్లాడారు. దేశంలో 84 కోట్ల మంది ఓటర్లుండగా వారిలో 74 కోట్ల మందికి ఆధార్ కార్డులున్నాయన్నారు. ఆర్టికల్ 324 ప్రకారం నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలని... అందులో భాగంగానే అనుసంధాన ప్రక్రియ చేపట్టామన్నారు. ఈ ప్రక్రియలో కాస్త ఆలస్యం జరిగినా ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ నాటికి దేశంలోని 676 జిల్లాల్లో అనుసంధానం పూర్తిచేస్తామన్నారు. మొత్తం అనుసంధానం పూర్తయితే స్థానిక, పంచాయతీ ఎన్నికల్లోనూ ఈ కార్డులను ఉపయోగించుకోవచ్చన్నారు.
గత నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నేషనల్ సర్వీసు ఓటరు పోర్టల్‌ను ప్రారంభించిన విషయాన్ని బ్రహ్మ గుర్తుచేశారు. ఈ పోర్టల్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారి పేరు, చిరునామా, పోలింగ్ కేంద్రం తదితర వివరాలతోపాటు వారి పేరిట ఎన్ని ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. ఓటరు జాబితాలో తప్పొప్పులనూ సవరించు కోవచ్చ న్నారు. నెట్ లేకున్నా మొబైల్ అప్లికేషన్‌తో ఈ పోర్టల్ సేవలను ఉపయోగించుకోవచ్చన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వంద శాతం ఆధార్ పూర్తయిందన్నారు. ఓటరు కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరి కాదన్నారు. ఈ ప్రక్రియలో మీడియా ఓటర్లను చైతన్యవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రం పరిధిలో నియోజక వర్గాల పెంపు
నియోజకవర్గాల పెంపుపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని బ్రహ్మ స్పష్టంచేశారు. పోల వరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న ముంపు మండలాలు కొన్ని ఏపీలోని పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో కలిసినందున ఖమ్మం జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ శాసనసభలో ప్రాతి ని ధ్యం వహించాలన్న అంశంపై వెంటనే నిర్ణ యం తీసుకోవాలని కేంద్రాన్ని కోరామని బ్రహ్మ తెలిపారు. ఆ ఎమ్మెల్యేలు రెండు రాష్ట్రాల్లోనూ ప్రాతినిధ్యం కోరుతున్నా అది సాధ్యం కాదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
ఆన్‌లైన్‌లో ఓటు వేయడానికి రాజ్యాంగ సవరణ అవసరమన్నారు. అయితే దేశంలో 40 శాతం మంది నిరక్ష్యరాస్యులు ఉన్నందున అది సాధ్యంకాదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలను అమలు చేయ ని పార్టీలపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రశ్నించ గా అటువంటి పార్టీలను ఏం చేయాలో ఓటర్లే నిర్ణయిస్తారన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల కమిషనర్ నసీం జైదీ, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్‌సిన్హా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ పాల్గొన్నారు.