వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ ట్రస్టు రూపొందించిన యాప్‌తో వైద్య సేవలు అరచేతిలో ఉన్న మొబైల్‌లోకి వచ్చి చేరుతాయని వెద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గురువారం ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో ‘ఆరోగ్యశ్రీ’ యాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా వైద్య సేవలను సరళతరం చేస్తామన్నారు. ఇలాంటి యాప్‌ను తయారుచేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ యాప్ ద్వారా 77.19 లక్షల మంది పేద కుటుంబాలు, 11.45 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పింఛన్‌దారులు, వారి కుటుంబ సభ్యులు, 23 వేల మంది వర్కింగ్, రిటైర్డ్ జర్నలిస్టులు ప్రయోజనం పొందుతారని ఆయన వెల్లడించారు.
ఈ యాప్ ద్వారా సమీపంలో 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల వివరాలు జీపీఎస్ ద్వారా ప్రత్యక్షమవుతాయన్నారు. జాతీయ రహదారుల్లో ప్రమాదాలు, గుండెపోట్లు, ఇతరత్రా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఇది ఎంతో ఉపకరిస్తుందన్నారు. రోగి నుంచి ఆసుపత్రి వారు డబ్బులు వసూలు చేసినా... సరిగా వైద్యం అందించకపోయినా, వైద్యం నిరాకరించినా దీనిద్వారా ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. గురువారం నుంచే గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో డాక్టర్ ఎం.చంద్రశేఖర్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
‘ఆరోగ్యశ్రీ’ యాప్‌తో అరచేతిలో వైద్య సేవలు
Published Fri, Apr 8 2016 3:48 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement