హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు ప్రధాన కార్యాలయం(ఫైల్ ఫొటో)
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కూలీ పని చేసే నారాయణ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆరోగ్యశ్రీ కార్డు ఉందన్న ధీమాతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిర్వాహకులు ఆస్పత్రిలో చేర్చుకున్నా సాధారణ చికిత్స చేసి.. వైద్యం మాత్రం మొదలుపెట్టలేదు. ఒక రోజు గడిచాక ఇదేమిటని నిలదీస్తే.. స్పెషలిస్ట్ డాక్టర్ రావాలని, మెల్లగా నయం చేస్తామని, కావాలంటే మరో ఆస్పత్రికి వెళ్లిపోవచ్చని సలహా ఇచ్చారు. ఓ కార్పొరేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు.
గోదావరిఖనికి చెందిన రాజేందర్ చిరు వ్యాపారి. కిడ్నీల సమస్యతో బాధపడుతున్నాడు. ఇటీవల అనారో గ్యానికి గురికావడంతో కరీంనగర్‌లో ఆరోగ్యశ్రీ సదుపాయమున్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. వారం రోజులైనా నిపుణులు రావడం లేదు. వైద్యం మొదలుకాలేదు. ఇదేమిటని నిలదీస్తే తగిన సదుపాయాలు లేవంటూ హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ చికిత్సల పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు రోగు ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పేరుకు పెద్దసంఖ్యలో ఆస్పత్రులు ఆరోగ్య శ్రీలో ఉన్నా.. చాలా వాటిలో సరైన వైద్య సౌకర్యాలుగానీ, వైద్య నిపుణులుగానీ ఉం డడం లేదు. వాటిల్లో చేరిన రోగులకు తగిన వైద్యం అందడం లేదు. సదుపాయాలు, నిపుణులు లేకున్నా.. ఈ ఆస్పత్రులు ఆరో గ్యశ్రీలో రిజిస్టర్ చేసుకుంటున్నాయి. రోగు లను చేర్చుకుని, కొంత కాలయాపన చేసి.. చివరికి కేస్ షీట్లతో సహా కార్పొరేట్ ఆస్ప త్రులకు రిఫర్ చేస్తున్నాయి. తద్వారా కార్పొ రేట్ ఆస్పత్రుల నుంచి కమీషన్లు పొందు తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల తీరు వల్ల కొన్నిసార్లు రోగుల పరిస్థితి విషమిస్తోంది.
కచ్చితమైన ఆదాయం మరి!
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ కింద ఏటా సగటున రూ.650 కోట్లు ఖర్చు చేస్తోంది. దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యాధులు సహా మొత్తం 949 రకాల చికిత్సలను ఉచితంగా అంది స్తున్నారు. రాష్ట్రంలో 85 లక్షల పేద కుటుంబాల్లోని 2.75 కోట్ల మంది ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నారు. వారికి వైద్యం అందించిన ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుపుతోంది. అయితే చాలా ఆస్పత్రులకు వచ్చే రోగుల కంటే ఆరోగ్యశ్రీ కింద చేరే వారి సంఖ్యే ఎక్కువ.
పూర్తిస్థాయి వైద్యం అందించేవి తక్కువే
తమ వద్ద ఆ రోగి చికిత్సకు అవసరమైన సదు పాయాలు లేవంటూ తమతో ఒప్పంద మున్న కార్పొరేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నాయి. అత్యవసర కేసులు వచ్చినా చేర్చుకుని.. కొంత సేపటి తర్వాత కార్పొరేట్ ఆస్పత్రులకు పంపు తున్నాయి. చికిత్స అనంతరం ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి వచ్చే సొమ్ము లోంచి పది, 15 శాతం కమీషన్‌గా తీసుకుని... మిగతా సొమ్మును చికిత్స చేసిన ఆస్పత్రికి అందజేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద ఎంత ఎక్కువ మంది రోగులను రిఫర్ చేస్తే కమీషన్ అంత ఎక్కువగా ఉంటుంది.
అన్నీ ఒప్పందాల కిందే..
తఇటీవల అన్ని కార్పొరేట్ ఆస్పత్రులు సాదా సీదా సౌకర్యాలతో ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ విభాగాలు నెలకొల్పి చికిత్స అందిస్తు న్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి నేరుగా రోగులు రావడం కష్టమని భావించి.. అదే పనిగా ఆరోగ్యశ్రీ కోసం ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు ఆస్పత్రులతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. రోగులను ఆకర్షించి కార్పొరేట్‌లకు తరలిస్తున్నాయి.
పేదలను ఆదుకునే బృహత్తర లక్ష్యం..
పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న లక్ష్యంతో 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. మొదట ఉమ్మడి ఏపీ పరిధిలోని మహబూబ్‌నగర్, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి... 2008 ఏప్రిల్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించారు. మొదట్లో 163 రకాల చికిత్సలు అందించేవారు. తర్వాత పెంచు కుంటూ వెళ్లారు. ప్రస్తుతం 949 రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు.
తూతూమంత్రంగా తనిఖీలు
ఆరోగ్యశ్రీ సేవల జాబితాలో ఆస్పత్రులను చేర్చేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రత్యేకంగా నిబంధనలను రూపొందించింది. కానీ అవన్నీ కాగి తాలకే పరిమితమవుతున్నాయి. ఆస్పత్రులకు ప్రధానంగా అవసరమైన ప్రత్యేక వైద్యులు, పరీక్ష కేంద్రాలు, కనీస పారిశుధ్యం వంటివి లేకున్నా అధికారులు ఆరోగ్యశ్రీలో చోటు కల్పిస్తున్నారు. పరిమితికి మంచి పడకల సంఖ్య ఉన్నా, వీల్‌చైర్ తీసుకెళ్లే దారి లేకున్నా, అగ్నిప్రమాద నివారణ వ్యవస్థ ఏర్పాటు చేయకున్నా అనుమతులు ఇస్తుండడం గమ నార్హం. అంతేకాదు రోగుల నుంచి ఫిర్యాదులు వచ్చిన సందర్భాల్లోనూ తూతూమంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారు.
ఆరోగ్యశ్రీ ట్రస్టే అక్రమాల పుట్ట!
ఆరోగ్యశ్రీ పథకంలో అక్రమాలు, అర్హతలేని ప్రైవేటు ఆస్పత్రులను ఆరోగ్యశ్రీలో చేర్చడంలో అధికారుల పాత్ర కీలకంగా ఉంది. కొందరు అధికారులు సొంత లాభమే చూసుకుని.. కనీస వసతులు, ప్రమాణాలు కూడా దిక్కులేని ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీలో చేరేందుకు సహకరిస్తున్నారు. మొత్తంగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల జాబితా పెరుగుతున్నా.. వాసి మాత్రం ఉండడం లేదు.
దీంతో అలాంటి ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్న పేదలు తగిన వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. దీనిపై ఇటీవల ఫిర్యాదులు కూడా పెరిగాయి. పేద రోగులకు వైద్యం అందడంలో కీలకమైన ఆరోగ్యశ్రీ ట్రస్టు వ్యవహారం ఇలా ఉన్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అసలు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు రెగ్యులర్ పర్యవేక్షణాధికారి లేకపోవడం గమనార్హం. నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్‌గా పనిచేసే అధికారికే ట్రస్టు బాధ్యతలను అదనంగా అప్పగించారు. దీంతో ఆరోగ్యశ్రీ ట్రస్టు నిర్వహణ అధ్వానంగా తయారైంది.
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు..
ఏడాది కేసులు ఖర్చు (రూ.)
2014–15 1,96,866 519,40,87,639
2015–16 2,60,543 684,67,77,428
2016–17 2,77,199 714,57,77,428
2017–18 1,83,108 459,67,79,239
(2017 అక్టోబర్ 31 వరకు)
Comments
Please login to add a commentAdd a comment