![Aasara Pentions Scheme Only One Person in Couples Warangal - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/8/charminar.jpg.webp?itok=IoMbN20G)
వరంగల్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ల వడబోత ప్రారంభించింది. దంపతులిద్దరికి వృద్ధాప్య పింఛన్లు ఉంటే సర్కారు కత్తెర పెడుతోంది. ఈ మేరకు గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా 368 మంది లబ్ధిదారులకు మే నెల పింఛన్ సొమ్ము జమ చేయలేదు. దీంతో వీరికి ఇక పింఛన్ లేనట్లేనని బల్దియా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరి«ధిలో ఆసరా పథకం కింద ప్రభుత్వం 68,889 మంది పింఛన్ పొందుతున్నారు. అందులో వికలాంగులు 8,720, బీడీ కార్మికులు 5,909, ఒంటరి మహిళలు 1,786, వృద్ధులు 20,044, గీత కార్మికులు 639, చేనేత కార్మికులు 1,833, వితంతువులు 29,958మంది ఉన్నారు. వీరందరికీ ప్రతి నెలా సామాజిక పింఛన్లను ప్రభుత్వం అమలుచేస్తోంది.
గత ఏడాది నుంచి ప్రభుత్వం పింఛన్ సొమ్ము రెట్టింపు చేసిన విషయం తెలిసిందే. ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, ఆహార భద్రత కార్డు, సదరన్ సర్టిఫికెట్, మరణ ధ్రువీకరణ తదితర పత్రాల ద్వారా అర్హులను ఎంపిక చేయడం జరుగుతోంది. సామాజిక పింఛన్లలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఏరివేతపై దృష్టిసారించింది. ఒకే కుటుంబంలో ఇద్దరు వృద్ధాప్య పింఛన్ పొందుతున్నవారు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మందికిపైగా ఉన్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో చేపట్టిన ఏరివేత కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా 368 మంది పింఛన్ సొమ్ము బ్యాంక్ ఖాతాలో జమ చేయలేదు. అంతేకాకుండా దంపతుల్లో భార్య లేదా భర్తలో ఒకరికి మాత్రమే పింఛన్ పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. ఈ మేరకు వారం రోజులుగా బల్దియా పన్నుల విభాగం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో విచారణ చేపడుతున్నారు. అయితే ప్రజాప్రతినిధుల పైరవీలు, బల్దియా సిబ్బంది చేతివాటం కారణంగా ఇంత కాలం పింఛన్ పొందిన వారికి చెక్ పడినట్లైంది.
Comments
Please login to add a commentAdd a comment