మంచాల, న్యూస్‌లైన్: అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై మంచాల డిప్యూటీ తహసీల్దార్ బాలరాజు నివాసం, కార్యాలయంపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. నగరంలోని అంబర్‌పేట్‌లో ఉన్న ఆయన నివాసంతోపాటు స్నేహితులు, బంధువులు ఇళ్లపై ఏక కాలంలో ఎనిమిది బృందాలుగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం గమనార్హం. ఈ దాడుల్లో భాగంగా ఆయన విధులు నిర్వహిస్తున్న మంచాల తహసీల్దార్ కార్యాలయంలో కూడా తనిఖీలు కొనసాగాయి. ఆయనకు సంబంధించిన ప్రతి రికార్డును అధికారులు క్షుణ్నంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఆయనకు సంబంధించిన బీరువాలకు తాళం ఉండడంతో వాటిని పగులగొట్టి మరీ రికార్డులు పరిశీలించి, కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు.
మధ్యాహ్నం12 గంటల నుంచి 2 గంటల వరకు కొనసాగిన ఈ సోదాల్లో బీఎల్‌ఓటు(బూత్‌లెవల్ అధికారులు)కు సంబంధించిన డబ్బులు, ఓ పట్టా పాసు పుస్తకంతో పాటు పి.ఆలివేలు పేరు మీద ఉన్న ఖాళీ చెక్కును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీటిలో జాపాల, రంగాపూర్ వీఆర్‌ఏల వేతనాలు కూడా ఉన్నట్లు తెలిసింది. మంచాలలో నిర్వహించిన దాడుల్లో ఏసీబీ ఎస్సై సుదర్శన్‌రెడ్డి, కానిస్టేబుల్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ దాడులకు సంబంధించిన వివరాలను అధికారులు గోప్యంగా ఉంచడంతో మిగిలిన వివరాలు బయటకు రాలేదు. దాడులు కొనసాగిన ఎనిమిది చోట్ల స్వాధీనం చేసుకున్న రికార్డులను క్రోడీకరించి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
మిగిలిన అధికారుల్లో గుబులు
మంచాల డీఫ్యూటీ తహసీల్దార్ బాలరాజు పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతోనే ఏసీబీ అధికారులు దాడులు చేసినట్లు తెలిసింది. ఈ దాడులు హైదరాబాద్ ఏసీబీ రేంజ్ డీఎస్పీ ప్రభాకర్, సిటీ రేంజ్ ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ నేతృత్వంలో కొనసాగాయి. మంచాల తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలతో స్థానికంగా పనిచేస్తున్న ఇతర ప్రభుత్వ కార్యాలయాల అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. ఇబ్రీహ ంపట్నం, యాచారం, హయత్‌నగర్ మండలాల అధికారులు మంచాలలో తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడుల గురించి చర్చించుకున్నారు.
మంచాల డిప్యూటీ తహసీల్దార్‌పై ఏసీబీ కన్ను
Published Thu, Apr 3 2014 11:32 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement