► స్టీఫెన్‌కు రేవంత్ ఇవ్వజూపిన 50 లక్షలు సమకూర్చిందెవరు?
► నేడు బట్టబయలు చేయనున్న అవినీతి నిరోధక శాఖ
► కాల్ డేటా ఆధారంగా అనేక వివరాలు రాబట్టిన ఏసీబీ
► చంద్రబాబును విచారించే ముందే మరికొందరి అరెస్టు!
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎక్కడివన్నది నేడు బట్టబయలు కానుంది. ఈ డబ్బును ఎవరు సమకూర్చారనే విషయాన్ని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కనిపెట్టింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం వెల్లడించవచ్చని అత్యంత విశ్వసనీయ వర్గాలు వివరించాయి. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ సమీపంలోని ఓ బ్యాంకు నుంచి ఈ డబ్బును డ్రా చేసినట్లు తెలిసింది. ఓటుకు నోటు కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాల్ డేటాను విశ్లేషించిన ఏసీబీ, డబ్బు సమకూర్చిన వారి వివరాలను రాబట్టింది. డబ్బు విషయం తనకు తెలియదని రేవంత్ ఆదివారం నాటి విచారణలో చెప్పినప్పటికీ... స్వయంగా ఆయనే ఆ డబ్బును స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు తీసుకెళ్లినట్లు స్పష్టమైన ఆధారాలు ఏసీబీకి లభించాయి. అయితే, ఈ డబ్బు ఎవరు సమకూర్చారన్న విషయాన్ని ఏసీబీ అత్యంత గోప్యంగా వుంచుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా డబ్బు ఖర్చు చేయాలని నిర్ణయించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కొందరు పారిశ్రామికవేత్తల నుంచి భారీగా వసూళ్లు చేసినట్లు సమాచారం. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా, ఏపీలో స్థానిక సంస్థల కోటాల్లో ఎమ్మెల్సీలను గెలిపించుకునేందుకు ఈ డబ్బు ఖర్చు చేయాలని ఆయన భావించారు. అందుకు అనుగుణంగానే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే ఎమ్మెల్యేలకు అడ్వాన్స్‌గా కొంత ముట్టజెప్పేందుకు తెచ్చిన ఈ డబ్బు ఎవరిదనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది.
కాల్‌డేటా ఆధారంగా కూపీ
రేవంత్ తెచ్చిన డబ్బును ఎవరు సమకూర్చారన్న విషయాన్ని తేల్చేందుకు కాల్‌డేటాను ఏసీబీ ఆధారంగా చేసుకుంది. రేవంత్‌కు ఫోన్ చేసిన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టు సంస్థల అధినేతల ఫోన్ నంబర్లను గుర్తించింది. వీరి ఫోన్‌లకు టీడీపీకి చెందిన ఓ రాజ్యసభ సభ్యుడు పదేపదే ఫోన్ చేసినట్లు తేల్చింది. రేవంత్‌తో మాట్లాడిన పారిశ్రామికవేత్తలకు వచ్చిన కాల్స్‌ను నిశితంగా పరిశీలిస్తోంది. ఏసీబీ అనుమానిస్తున్న ఒక కాంట్రాక్టు సంస్థ అధినేత ఫోన్ నుంచి ఏపీకి చెందిన ఓ మంత్రికి అనేకసార్లు కాల్స్ వెళ్లాయి. రేవంత్ పట్టుబడటానికి గంట ముందు కూడా ఆ కాంట్రాక్టు సంస్థ అధినేతతో ఫోన్‌లో మాట్లాడారు.
50 లక్షల గుట్టు.. నేడు రట్టు
Published Mon, Jun 8 2015 2:28 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement