ఏసీబీ వలలో సర్వేయర్‌.. | ACB Traps Surveyor | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో సర్వేయర్‌..

Published Thu, Jul 26 2018 12:26 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB Traps Surveyor - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్, పక్కన సీఐలు 

ఒక్క రోజు కాదు.. రెండ్రోజులు కాదు.. సుమారు మూడు నెలలు... ‘నా భూమికి కొలత వేయండి సారూ...’ అని, ఆ సర్వేయర్‌ను అనిల్‌కుమార్‌ కోరుతున్నాడు. ఆ అధికారి.. ‘ఇదిగో–అదిగో’ అంటాడేగానీ కొలత వేయడం లేదు. అనిల్‌కుమార్‌కు ఆ అధికారి ‘అంతరంగం’ అర్థమైంది. ఆ అధికారి కూడా నేరుగా అసలు ‘విషయం’లోకి వచ్చాడు. పని జరగాలంటే 50వేల రూపాయలు లంచంగా ఇవ్వాలన్నాడు. బేరసారాలు సాగాయి. చివరికి 30వేల రూపాయలకు ఒప్పందం కుదిరింది. ఆ తర్వాతేం జరిగింది...? ఎవరీ అనిల్‌కుమార్‌...? ఆ సర్వేయర్‌ ఎవరు.? 

ఖమ్మంసహకారనగర్‌ : విజయవాడలోని సూర్యా రావుపేటకు చెందిన ఎం.హన్మంతరావుకు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రాజుపాలెం గ్రామంలో 29 ఎకరాల భూమి ఉంది.  ఆ భూమిని కొలత వేసేందుకుగాను ఆయన కుమారుడు అనిల్‌కుమార్, మే 3వ తేదీన ‘మీ సేవ’ కేంద్రంలో దరఖాస్తు చేశాడు. ఆ తరువాత, ఎర్రుపాలెం మండలసర్వేయర్‌ రాజును కలిశాడు.  రోజులు గడుస్తున్నాయి. సర్వేయర్‌ ఎంతకీ పని చేయడం లేదు.

ఆయన (కార్యాలయం) చుట్టూ అనిల్‌కుమార్‌ తిరుగుతున్నాడు. తిరిగీ.. తిరిగీ విసుగెత్తాడు.  ఆ అధికారి లంచం అడిగాడు. వేయి కాదు.. రెండువేలు కాదు.. 50వేల రూపాయలు ఇవ్వాలన్నాడు. అనిల్‌కుమార్‌కు చిర్రెత్తుకొచ్చింది. తమాయించుకున్నాడు. అంత ఇచ్చుకోలేనన్నాడు. బేరసారాలు సాగాయి. చివరకు, 30వేల రూపాయల వద్ద ‘బేరం’ కుదిరింది. ‘నన్ను మూడు నెలలపాటు తిప్పించుకుని, 30వేల రూపాయలు లంచం అడుగుతాడా..?’ అనుకున్నాడు అనిల్‌కుమార్‌.

ఇలాంటి అవినీతి జలగను వదిలేస్తే... తనలాంటి ఇంకెంతోమంది రైతులు బలవుతారని భయపడ్డాడు. ఈ ‘జలగ’ను తేలిగ్గా వదలకూడదనుకున్నాడు.  ఏసీబీ అధికారులను అనిల్‌కుమార్‌ సంప్రదించాడు. విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆ అధికారులు స్కెచ్‌ గీశారు. బుధవారం రోజున ఆ సర్వేయర్‌కు అనిల్‌కుమార్‌ ఫోన్‌ చేశాడు. ‘ఆ డబ్బు ఎక్కడ ఇవ్వాలి? ఎక్కడ కలుస్తారు?’ అని అడిగాడు. తాను కలెక్టరేట్‌లో సమావేశానికి వచ్చానని, అక్కడకు రావాలని సర్వేయర్‌ రాజు చెప్పాడు. 

కలెక్టరేట్‌కు అనిల్‌కుమార్‌ చేరుకున్నాడు. ఆయనకు దగ్గరలోనే ఎవరికీ కనిపించకుండా, ఎవ్వరూ గుర్తించకుండా.. ఏసీబీ అధికారులు మాటు వేశారు.  కలెక్టరేట్‌ లోపలి నుంచి ఆవరణలోకి సర్వేయర్‌ రాజు వచ్చాడు. అక్కడే ఒక మూలకు అనిల్‌కుమార్, సర్వేయర్‌ రాజు వెళ్లారు. సర్వేయర్‌ రాజుకు అనిల్‌కుమార్‌ నగదు ఇస్తున్నాడు. సరిగ్గా అప్పుడే.. ఆ క్షణంలోనే ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్,  ఖమ్మం, వరంగల్‌ సీఐలు రమణమూర్తి, పి.వెంకట్, క్రాంతికుమార్‌ దూసుకొచ్చారు. రాజును పట్టేసుకున్నారు. అతని చేతిలోని నగదును స్వాధీనపర్చుకున్నారు. 

అప్పటికే కలెక్టరేట్‌ ఆవరణలో అధికారులు, అనధికారులు, ప్రజలు.. ఇలా అనేకమంది అటూఇటూ తిరుగాడుతున్నారు. అక్కడేదో హడావుడి జరుగుతుండడంతో అందరూ గుమిగూడారు. ‘ఏసీబీ అధికారులొచ్చారు. సర్వేయర్‌ను పట్టుకున్నారు’ అనే వార్త.. క్షణాల్లోనే వ్యాపించింది. ‘కలెక్టరేట్‌లోనే లంచావతారమా..?!’ అనుకుంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇది అక్కడ పెద్ద చర్చనీయాంశమైంది.  ఆ అవినీతి జలగ... సారీ.. సర్వేయర్‌ రాజును ఏసీబీ కోర్టుకు అప్పగించేందుకని తమ (ఏసీబీ) కార్యాలయానికి డీఎస్పీ, సీఐలు తీసుకెళ్లారు. 

కలెక్టరేట్‌లో ఇది రెండోసారి..  

ఖమ్మం కలెక్టరేట్‌లో అవినీతి జలగను ఏసీబీ అధికారులు పట్టుకోవడం ఇది రెండోసారి. సుమారు మూడేళ్ల క్రితం, లంచం డిమాండ్‌ చేసిన సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కార్యాలయ ఉద్యోగి ఒకరిని కలెక్టరేట్‌లోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇప్పుడు ఈ సర్వేయర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement