
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూత న ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. సర్వ శ్రేయో నిధి (కామన్ గుడ్ ఫండ్)పై శనివారం సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 615 కొత్త ఆలయాల నిర్మాణానికి రూ.159 కోట్లు, బలహీన వర్గాల కాలనీల్లో నిర్మించే 239 ఆలయాలకు రూ.23 కోట్ల తో చేపట్టబోయే పనులకు కామన్ గుడ్ ఫండ్ కమిటీ ఆమోదం తెలిపింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ (37ఆలయాలు), ఉమ్మడి నల్లగొండ (3) జిల్లాల్లోని చెంచుగూడే ల్లో అసంపూర్తిగా ఉన్న ఆలయ నిర్మాణ పనులను ఐటీడీఏ సహకారంతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే కామన్ గుడ్ ఫండ్‌కు వివిధ ఆలయాలు బకాయిపడ్డ నిధుల వసూలుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. వేద పాఠశాల నిర్వహణకు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు.