సాక్షి, ఖమ్మం: చావు బతుకుల మధ్య ప్రభుత్వ ఆసుపత్రి మెట్లెక్కినా వైద్యం అందక గంట సేపు రక్తం మడుగులో నిస్సహాయ స్థితిలో ఉండాల్సిన హృదయ విదారక సంఘటన ఆదివారం రాత్రి మణుగూరులోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని శేషగిరినగర్‌కు చెందిన ఆనంద్ హోండా షోరూం ఎదురుగా ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు క్షతగాత్రుడిని దగ్గర్లోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రి ముందు మెట్ల మీద కూర్చోబెట్టి వైద్యం కోసం వారు ప్రయత్నించారు. ఆసుపత్రిలో ఎవరూ లేకపోవడం, సమయానికి 108 అందుబాలులో లేకపోవడంతో క్షతగాత్రుడు మెట్లపైనే గంట సేపు రక్తం మడుగులోనే నరకయాతన అనుభవించాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు 108లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆసుపత్రి ప్రజలకు అందుబాటులో లేకుండా నిరుపయోగంగా ఉండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టం కొద్ది బాధితుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడ్డాడు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి 100 పడకల ఆసుపత్రిలో వైద సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు రావాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment