
పొట్టకూటి కోసం వచ్చి..
తాండూరు రూరల్: పొట్టకూటి కోసం వచ్చిన ఓ యువకుడిని టిప్పర్ రూపంలో ఉన్న మృత్యువు కబళించింది. సంఘటన తాండూరు మండలంలోని మల్కాపూర్ గనుల్లో శనివారం చోటు చేసుకుంది. గని కార్మికులు, కరన్‌కోట్ ఎస్‌ఐ ప్రకాష్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పల్లమర్రి గ్రామానికి చెందిన రాము(18) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. దీంతో హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో ఉంటున్న తన మేనమామ వెంకటన్న వద్ద ఉండి 9వ తరగతి వరకు చదువుకున్నాడు.
ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో చదువు మానేసి స్థానికంగా కూలీపనులు చేస్తుండేవాడు. ఇదిలా ఉండగా రాము మూడు వారాల క్రితం తాండూరు మండలం మల్కాపూర్ గనుల్లో పని చేస్తున్న తన పెద్ద నాన్న కొడుకు నాగేష్ వద్దకు వచ్చాడు. ఇక్కడే టిప్పర్(కేఏ 01 పీ 3501) వాహనంపైన క్లీనర్‌గా పనికి కుదిరాడు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో నాపరాతి గనిలో రాతిముక్కలను టిప్పర్‌లోకి లోడ్ చేశారు. టిప్పర్ ర్యాంప్ ఎక్కుతుండగా రాము వెనుకాల ఉండి డ్రైవర్‌కు సైడ్ చూపిస్తున్నాడు. టిప్పర్ ప్రమాదవశాత్తు ఒక్కసారిగా వెనక్కి దూసుకొచ్చింది.
రాము వాహనం కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గని కార్మికులు గమనించి వెంటనే తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రాము అర్ధరాత్రి తర్వాత మృతిచెందాడు. పోలీసులు శనివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతుడి అక్క అంజమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.