దేవుడా.. దర్శనమేదీ? | Acquired services bandh Ten days | Sakshi
Sakshi News home page

దేవుడా.. దర్శనమేదీ?

Published Fri, Sep 4 2015 12:06 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM

దేవుడా.. దర్శనమేదీ?

దేవుడా.. దర్శనమేదీ?

అభిషేకాలు.. అర్చనలు, నోములు.. వ్రతాలు.. బోనాలు.. ఒడిబియ్యాలు, ధూపదీపాలు.. నిత్యపూజలతో కళకళలాడే దేవాలయాలు కళతప్పాయి. పవిత్రమైన శ్రావణమాసంలో పొంగిపొర్లెభ క్తిభావం.. అర్చక ఉద్యోగుల సమ్మెతో మూగబోయింది. తమ ఇష్ట దైవాలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుని, మానసిక ప్రశాంతతను పొందడానికి తరలివచ్చిన భక్తజనం.. ఆలయాల్లో పూజలు చేసేవారు లేక తీవ్ర నిరాశకు గురవుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెను ప్రారంభించి 10 రోజులవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో అర్చక ఉద్యోగ సంఘాలు తమపట్టును వీడటంలేదు. దీంతో అనునిత్యం వేలాది మంది భక్తులు నానా అవస్థలు పడుతుండగా, దేవాదాయ శాఖకు రూ.లక్షల్లో ఆదాయం గండి పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 370మంది అర్చక ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు.  
 శ్రావణమాసానికి ‘సమ్మె’ట
- కళతప్పిన ఆలయాలు
- హారతి లేదు.. తీర్థం లేదు
- పది రోజులుగా ఆర్జిత సేవలు బంద్
- దేవాదాయ శాఖకు రూ. లక్షల్లో గండి
- సత్రాలకు సైతం తాళాలు, భక్తులకు ఇక్కట్లు
మెదక్/వర్గల్/శివ్వంపేట/జహీరాబాద్:
ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు మెతుకుసీమ నిలయం. ఏడుపాయలలో దుర్గాభవాని, ఝరాసంగంలోని కేతకి సంగమేశ్వర ఆలయం, నాచారం లక్ష్మీనర్సింహస్వామి, బొంతపల్లి వీరభద్రస్వామి, రుద్రారం గణేష్ టెంపుల్, బీరంగూడంలోని శివాలయం, సిద్దిపేటలోని వెంకటేశ్వర, కోటి లింగాల ఆలయాలను అనునిత్యం సుమారు 50 వేలకుపైగా భక్తులు దర్శించుకుంటారు. శ్రావణమాసం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
 
అయితే జిల్లాలోని అర్చక ఉద్యోగులంతా తమ డిమాండ్ల సాధన కోసం ఈయేడు ఆగస్టు 25 నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. ప్రతిరోజూ అర్చకులు దేవతా విగ్రహాలకు అభిషేకాలు, నివేదన గావించి సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి ఎంతో ఆశతో తరలివచ్చే వేలాది మంది భక్తులు పూజలు చేయించుకోలేక, మొక్కులు చెల్లించుకోలేక, మొక్కుబడి దర్శననానికే పరిమితమవుతున్నారు. ఏడుపాయల్లో మంగళ, బుధ, శుక్ర, ఆదివారాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే కేతకీ సంగమేశ్వరాలయాల్లో ఆది, సోమవారాల్లో ఇసుకేస్తే రాలనంత భక్తజనం ఉంటుంది. అర్చక ఉద్యోగులంతా సమ్మెలో ఉండటంతో కనీస పూజలకు అవకాశం లేక పోగా, దేవుడి ప్రసాదం కూడా పొందలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది భక్తులు దేవాలయాలకు రావడం లేదు.
 
లక్షల్లో ఆదాయం గండి
అర్చక ఉద్యోగుల సమ్మె ప్రభావంతో దేవాలయాల ఆదాయానికి గండి పడుతోంది. కేతకి సంగమేశ్వరాలయంలో ఆది, సోమవారాల్లోనే ఎంతలేదన్న రూ.5లక్షల ఆదాయం వస్తుంది. ఏడుపాయల్లో సోమ, మంగళ, బుధ, శుక్ర , ఆదివారాల్లో కలిసి సుమారు రూ.1.50లక్షల ఆదాయం వస్తుంది. అలాగే జిల్లా అంతటా దేవాలయాల్లో రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. అర్చకుల సమ్మెపోటుతో ఆదాయం గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది.
 
ట్రెజరీ వేతనాలే ప్రధాన డిమాండ్ :
అర్చక ఉద్యోగులందరికీ 010 పద్దుకింద జీతాలు చెల్లించాలని ప్రధాన డిమాండ్. ధూప, దీప, నైవేద్యం కింద అర్చకులకు రూ.6వేల గౌరవ వేతనం ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఎన్‌ఎంఆర్(నాన్‌మస్టర్ రోల్) ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరుతున్నారు. పదో పీఆర్సీని 370 దేవాలయాల్లో పనిచేస్తున్న 2,375మంది అర్చక ఉద్యోగులకు  వర్తింపజేయాలని కోరుతున్నారు.
 
రూ. 8 లక్షల ఆదాయం నష్టం

కేతకీ ఆలయానికి వచ్చే భక్తుల నుంచి అభిషేకాలు, హారతి, అన్న పూజ, వాహనాల పూజ, ఆకుల పూజ, గండ జ్యోతి, కంట్లం పూజ, ప్రసాదాలు, గదుల అద్దె ద్వారా ఆలయానికి ఆదాయం వచ్చేది. అర్చకులు, ఆలయ సిబ్బంది సమ్మెలో ఉండడంతో కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి దాదాపు రూ.8 లక్షల మేరకు నష్టం వాటిల్లింది.
 
నాచగిరిలో మౌన దీక్ష
వర్గల్:
సమ్మెలో భాగంగా నాచగిరి ఆలయ అర్చకులు, సిబ్బంది నోటికి గుడ్డలు కట్టుకుని గర్భగుడి ముందు మౌన దీక్ష కొనసాగించారు. సంఘ నేతలు రంగాచారి, గోపాలకృష్ణ శర్మ, సుధాకర్‌గౌడ్‌ల నేతృత్వంలో నిరసన కొనసాగింది.
 
మోకాళ్లపై నిరసన
శివ్వంపేట:
చాకరిమెట్ల ఆంజనేయస్వామి, సికింద్లాపూర్ నర్సింహస్వామి, హత్నూర మండలం పలుగుమీది పోచమ్మ దేవాలయాల అర్చక  సిబ్బంది దేవాదత్తశర్మ, ధనుంజయ్యశర్మ, విద్యాకర్‌చారి, శ్రీకాంత్, నర్సింహారెడ్డి, శ్రీనివాస్, రామకృష్ణ, పోచయ్య, తదితరులు నిరసన వ్యక్తం చేశారు. మోకాళ్ళపై నిల్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు.
 
50యేళ్ల తరువాత వచ్చాను
50యేళ్ల తరువాత దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చాను. పదేళ్ల వయస్సులో మా అమ్మవెంట వచ్చి అప్పట్లో దుర్గమ్మను దర్శించుకున్నా. మళ్లీ ఇన్నేళ్లకు ఇక్కడకు వస్తే కనీసం పూజ చేయించుకునే అవకాశం లేకుండా పోయింది.
- జోగమ్మ, ముండ్రాయి
 
30యేళ్లలో ఇలాంటి సమ్మె చూడలేదు
ఏడుపాయల దుర్గమ్మ వద్ద 30యేళ్లుగా పూజలు చేస్తున్నా అప్పుడప్పుడు సమ్మెలు చేశాం. కాని పదిరోజులపాటు చేసిన దాఖలాలు లేవు. భక్తులకు ఇబ్బందులు కలగడం బాధగానే ఉంది. కనీసం మా డిమాండ్లు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
- నర్సింహాచారి, పూజారి, ఏడుపాయల
 
ప్రభుత్వం స్పందించాలి

అర్చకులు సమ్మె చేపట్టడంతో భక్తులకు ఇబ్బందిగా మారింది. దీంతో ఆలయానికి వచ్చే వారు ఒకింత నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి అర్చకులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.
- రాధాకృష్ణా రాగోజి, భక్తుడు, గుల్బర్గా
 
శ్రావణ మాసంలో ఇదేం చోద్యం

వేలూరు-నాచారం క్షేత్రం అంటే మాకు ఎంతో భక్తి, విశ్వాసం. లక్ష్మీ నరసింహస్వామి వారిని, లక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని హారతి, తీర్థంతోపాటు ఫలమో, పుష్పమో తీసుకుంటే మనసు నిండా సంతృప్తి ఉంటుంది. శ్రావణ మాసం దేవున్ని నిండుగా చూసుకునే అవకాశం కూడా దక్కడం లేదు. హారతి లేదు, తీర్థం పెట్టడం లేదు. గ్రిల్స్ నుంచి దేవున్ని చూసి అదే పదివేలు అనుకోవాల్సి వస్తున్నది.  
- పీ సునీత, భక్తురాలు, సికింద్రాబాద్
 
ఎంతో ఆశతో వచ్చాం
కేతకీ సంగమేశ్వర స్వామి దైవ దర్శనం, అభిషేకం కోసం వందల కిలో మీటర్ల దూరం నుంచి వచ్చాం. ఆలయంలో అభిషేకాలు జరగక పోవడంతో నిరాశకు గురయ్యాం. మాలాగే చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
- శంకర్ భక్తుడు, అత్నూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement