ఎంసెట్ చిచ్చు!
30న నోటిఫికేషన్, 7 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
ప్రవేశాల కమిటీ తో ఉన్నత విద్యా మండలి భేటీలో నిర్ణయం
ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఏపీ సర్కారు ఒత్తిడితోనే నిర్ణయం తీసుకున్నారని మండిపాటు
సుప్రీం పరిధిలో ఉన్న అంశాన్ని ఎలా పరిశీలిస్తారని ప్రశ్న
‘ఫాస్ట్’ పథకం అమలుకు గడువు కావాలన్నా వినుపించుకోరా?
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆంధ్రా సర్కారు వైఖరేంటి?
ఏదీ తేల్చకుండానే కౌన్సెలింగ్ చేపట్టడం తగదని వ్యాఖ్య
రాష్ట్రాన్ని ఇరకాటంలో పెట్టే చర్యగా భావిస్తున్న ప్రభుత్వ పెద్దలు
4న సుప్రీం తీర్పును బట్టే తుది నిర్ణయం: ఉన్నత విద్యామండలి
సాక్షి, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మరో వివాదం రాజుకుంది. ఇప్పటికే విద్యుత్, నీటి వాటాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య మంటలు రేగగా.. తాజాగా ఎంసెట్ ప్రవేశాల అంశం తోడై అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఎంసెట్ కౌన్సెలింగ్ విషయం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండగానే.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ప్రవేశాల కమిటీ సిద్ధమవడం తెలంగాణ సర్కారుకు తీవ్ర ఆగ్రహం తెప్పిం చింది. సోమవారం వివిధ సెట్‌ల ప్రవేశాల కమిటీలతో సమావేశమైన ఉన్నత విద్యా మండలి అధికారులు.. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 30న నోటిఫికేషన్ జారీ చేయాలని, వచ్చే నెల 7వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని నిర్ణయించారు.
దీంతో టీ-సర్కారు పెద్దలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే ‘ఫాస్ట్’ పథకానికి సంబంధించిన నిబంధనల రూపకల్పనకు కొంత గడువు అవసరమని చెప్పినప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కేవలం రాష్ర్ట ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేం దుకేనని వారు మండిపడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు ఉద్దేశపూర్వకంగానే అడ్మిషన్ల కమిటీ అధికారులపై ఒత్తిడి చేసి ఈ నిర్ణ యం తీసుకునేలా చేశాయని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సుప్రీంకోర్టు పరిశీల నలో ఉన్న అంశంపై నిర్ణయం తీసుకోవడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని లేఖ రాసినా.. అడ్మిషన్ల కమిటీ దాన్ని పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఎంసెట్ కౌన్సెలింగ్ అంశం వచ్చే నెల 4న సుప్రీంకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో ఇన్నాళ్లు లేని అడ్మిషన్ల తొందర ఇప్పుడే ఎందుకు వచ్చిందని రాష్ర్ట అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకే వివిధ ‘సెట్స్’ కమిటీల సమావేశం ఏర్పాటు చేసి, నిర్ణయాలు తీసుకున్నారని ఆ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొనసాగిస్తున్నట్లా? లేదా? అన్నది తేల్చకుండానే ఆ రాష్ర్ట ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగిందని విమర్శిస్తున్నాయి. ఒకవేళ పథకాన్ని కొనసాగిస్తే పాత ఉత్తర్వులను అన్వయించుకుంటూ తాజా ఉత్తర్వులు ఎందుకు జారీ చేయడం లేదని ప్రశ్నిస్తున్నాయి. ఫీజు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోగా, తమ ప్రభుత్వాన్ని విమర్శలపాలు చేసేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి జగదీశ్‌రెడ్డి గతంలోనే ఆరోపించారు. తాము ఫాస్ట్ అమలు కోసం చర్యలు చేపట్టామని, ఏపీ ప్రభుత్వం ఏమీ చేయకుండానే పరిస్థితిని సమస్యాత్మకం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన మండిపడుతున్నారు.
తెలంగాణ సర్కారు రుసరుస!
ఈ విషయంపై తెలంగాణ సర్కారు తన అసంతృప్తిని వ్యక్తీకరిస్తూ ఉన్నత విద్యా మండలికిఓ లేఖ రాసింది. విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ రాసిన ఈ లేఖలో.. ‘‘వివిధ కారణాలతో కౌన్సెలింగ్ నిర్వహణకు గడువు పెంచాలని సుప్రీంకోర్టును కోరాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంది. పైగా వాటిని కౌన్సెలింగ్ కంటే ముందుగానే జారీ చేయాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అధికారుల కొరత ఉన్నందున అర్హులైన విద్యార్థుల గుర్తింపునకు వీలుగా మార్గదర్శకాల రూపకల్పనకు కొంత సమయం పడుతుంది. దీనిపై సుప్రీంకోర్టు జూలై 21న విచారిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అఖిల భారత సాంకేతిక విద్యామండలికి తెలియజేసింది. అనుబంధ అఫిడవిట్లు దాఖలు చేయాలంటూ విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణలో తగిన ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలోకి వస్తుంది.
ఈ విషయాలన్నీ మీకు తెలిసినా.. కౌన్సెలింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారు. మీరు ముందుకు వెళ్తున్న ఈ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95కి విరుద్ధం. ఆ సెక్షన్ ప్రకారం రెండు రాష్ట్రాలు పరస్పరం సంప్రదించుకుని కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. దీన్ని పక్కనబెట్టండి’’ అని పేర్కొన్నారు. ఇదే అంశాలతో సాంకేతిక విద్యా కమిషనర్ శైలజా రామయ్యార్ కూడా లేఖ రాసినట్లు తెలిసింది.