- పాలమూరులో భూసేకరణకు అవాంతరాలే కారణం
- ఆదిలాబాద్‌లో టీఎస్‌ఐఐసీస్థలాల అన్వేషణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏర్పాటు చేయనున్న భారీ సోలార్ పార్కుకు ప్రత్యామ్నాయ స్థలాల అన్వేషణ మొదలైంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని గట్టు మండలంలో తలపెట్టిన ఈ పార్కుకు భూసేకరణ అవరోధంగా మారడమే ఇందుకు కారణం. పార్కు నిర్మాణానికి కావాల్సిన భూములను తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) సేకరించి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఈసీఐ)కు బదిలీ చేయాల్సి ఉంటుంది.
కానీ దీనిపై టీఎస్‌ఐఐసీ ఇప్పటికీ దృష్టి సారించలేదు. పార్కు నిర్మాణానికి గట్టు మండలంలో సేకరించ తలపెట్టిన 5702 ఎకరాలు ఆలూరు, రాయిపల్లి, బుచ్చినెర్ల, కేటీ దొడ్డి గ్రామాల పరిధిలో ఉన్నా యి. వాటిలో 391 ఎకరాల అసైన్డ్, 415 ఎకరాల పట్టా భూములు కూడా ఉన్నాయి. టీఎస్‌ఐఐసీ మాత్రం ఈ విషయాన్ని కనీసం రాష్ట్ర ఇంధన శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లలేదు. కేంద్ర ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి, ప్లాంటు నిర్మాణానికి ముందుకొచ్చిన ఎన్‌టీపీసీ, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇటీవల అధికారులతో భేటీ అయినప్పుడు ఈ విషయం బయటపడింది.
పార్కుకు కావాల్సిన భూముల బదిలీ ఇంకా జరగలేదని తెలిసి ఇంధన శాఖ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఆ నాలుగు గ్రామాల పరిధిలోని అసైన్డ్, పట్టా భూముల సేకరణ జాప్యమయ్యేలా ఉండటంతో పార్కు నిర్మాణానికి మరోచోట స్థలాలను గుర్తించాలని టీఎస్‌ఐఐసీని ఆదేశించారు. దాంతో ఆదిలాబాద్ స్థలాల వేటలో పడ్డ టీఎస్‌ఐఐసీ, ఒకేచోట 5000 ఎకరాల ప్రభుత్వ భూమి లభ్యమయ్యే పరిస్థితి జిల్లాలో ఎక్కడా లేదని గుర్తించింది.
దాంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా సోలార్ పార్క్‌ను ఏర్పాటు చేసి, పలు ప్రాంతాల్లో ప్లాంట్లు నెలకొల్పేందుకు కంపెనీలను ఆహ్వానించాలని భావిస్తోంది. ఇంద్రవెల్లి, ఆదిలాబాద్, కాగజ్‌నగర్ మండలాల్లో దాదాపు వెయ్యి ఎకరాలు ఒకేచోట ఉన్న ప్రాంతాలను ఇందుకు ఎంచుకుంది. ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్‌కు ఐదెకరాలు అవసరం. ఈ లెక్కన ఇంద్రవెల్లి మండలంలోని వెయ్యెకరాల్లో మొదటగా ఎన్‌టీపీసీ సారథ్యంలో 200 మెగావాట్ల సోలార్ ప్లాం ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
సింగరేణి ప్లాంట్‌కు నేడు సీఎం
సింగరేణి విద్యుదుత్పత్తి కేంద్రాన్ని సందర్శించేం దుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇక్కడి జైపూర్ సమీపంలో 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్కేంద్రాన్ని సింగరేణి నిర్మిస్తోంది. వచ్చే ఏడాది నుంచి విద్యుదుత్పత్తి మొదలవుతుం ది. దీని సామర్థ్యాన్ని 1,800 మెగావాట్లకు పెంచాలని ఇటీవలి బోర్డు సమావేశంలో సింగరేణి సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆదిలాబాద్ జిల్లాలో సోలార్ పార్కుకు అనువైన స్థలాలను కూడా పర్యటన సందర్భంగా సీఎం పరిశీలించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.