చివరి మీటింగ్‌ | Adilabad ZPTC Last Meeting | Sakshi
Sakshi News home page

చివరి మీటింగ్‌

Published Fri, Jun 14 2019 9:41 AM | Last Updated on Fri, Jun 14 2019 9:41 AM

Adilabad ZPTC Last Meeting - Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: అరవై సంవత్సరాల చరిత్ర ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ సమావేశాలు జరగడం ఇదే చివరి సారి. ఇక నుంచి ఏ జిల్లాలో ఆ జిల్లా పరిషత్‌ సమావేశాలు జరగనున్నాయి. పునర్విభజనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ నాలుగు జిల్లాలుగా ఏర్పడి ఆయా జిల్లాలోనే పరిషత్‌ ఎన్నికలు జరిగాయి. నూతనంగా ఎన్నికైన కొత్త సభ్యులు వారి వారి జిల్లాలో జరిగే జెడ్పీ సమావేశాలకు, సభలకు హాజరవుతుంటారు. దీంతో ఉమ్మడి జెడ్పీ సభ్యుల కలయికకు ఇవే చివరి సమావేశాలు అనడంలో సందేహం లేదు. అయితే శుక్రవారం ఉదయం 10:30 గంటలకు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు జరగనున్నాయి. శనివారం ఉదయం 10:30 గంటలకు  –
జెడ్పీ సర్వసభ్య సమావేశం జరగనుంది. స్థాయీ సంఘ సమావేశాలకు తక్కువ మోతాదులో సభ్యులు హాజరైనా.. తెల్లారే ఉమ్మడి జెడ్పీ చివరి సర్వసభ్య సమావేశం ఉండడంతో నాలుగు జిల్లాల సభ్యులు, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, అధికారులు హాజరయ్యే ఆస్కారం ఉంది. అయితే చివరి సమావేశంలో పదవీకాలం జూలై 4తో ఐదేళ్లు పూర్తి చేసుకోనున్న సభ్యులకు సన్మానాలు, సత్కరాలు ఉంటాయని జెడ్పీ సీఈవో కె.నరేందర్‌ తెలిపారు.

ఎమ్మెల్యేలకు మొదటివి.. సభ్యులకు చివరివి.. 
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరు తెలుసుకునే ఆయా ప్రభుత్వ శాఖలు సాధించిన ప్రగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులు జెడ్పీ స్థాయీ సంఘ, సర్వసభ్య సమావేశాల్లో చర్చిస్తుంటారు. అయితే ఈ రెండు రోజుల్లో జరిగే సమావేశాల్లో విచిత్ర పరిణామం ఎదురుకానుంది. అదేటంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారికి ఈ సమావేశాలు మొదటివి కాగా, జూలైలో పదవీకాలం పూర్తి చేసుకోమనున్న జెడ్పీ సభ్యులకు మాత్రం ఇవే చివరి సమావేశాలు కానున్నాయి. మరీ ముఖ్యంగా జెడ్పీకి కొత్త పాలకవర్గం (చైర్మన్‌తో సహా సభ్యులు) ఎన్నికైన పాత పాలకవర్గం సమావేశాలు నిర్వహించడం కూడా విశేషమే. ఇదిలా ఉండగా, ఈ ఏడాదిలో వరుసగా వచ్చిన ఎన్నికల దృష్ట్యా సభ్యులు రాకపోవడంతో సమావేశాలు రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా స్థాయీ సంఘాలు కొనసాగుతాయా? లేదా అన్న సందేహం లేకపోలేదు. ఇక తెల్లావారే సర్వసభ్య సమావేశం ఉండడంతో సభ్యులతోపాటు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు హాజరయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. సమావేశాలకు అందరు హాజరైతే గత ఆరు నెలలుగా చర్చించాల్సిన ప్రగతి అంశాలపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే సమావేశాలకు సభ్యులు రావడం పెద్ద సమస్యగా మారితే ఇప్పుడు నిర్వహించే సమావేశం చివరిది కావడంతో ఆ సమస్య ఉండదని సభ్యులతోపాటు అధికారులు భావిస్తున్నారు.

ప్రాధాన్యత అంశాలపై చర్చ.. 
జెడ్పీ స్థాయీ సంఘాలు, సర్వసభ్య సమావేశాలు సాఫీగా కొనసాగితే ప్రాధాన్యత అంశాలపై చర్చ జరగనుంది. ప్రధానంగా వ్యవసాయం, పాఠశాలల పునఃప్రారంభం, హరితహారం కార్యక్రమం, వర్షాకాలం దృష్ట్యా సీజనల్‌ వ్యాధులకు వైద్య సదుపాయాలు, ఆస్పత్రుల తీరు, సంక్షేమ పథకాలైన పింఛన్ల పెంపు, రేషన్‌ కార్డులు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, తదితర అంశాలపై చర్చించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. తరగతుల నిర్వహణ, పాఠశాలల్లో కనీస సౌకర్యాలు, బడిబయట పిల్లలను బడికి తీసుకురావడం, బాల కార్మిక నిర్మూలన, ఉపాధ్యాయులు, ఎంఈవోల కొరత, విద్యావాలంటీర్ల కొనసాగింపు తదితర అంశాలపై చర్చకు రావచ్చు. ఈ సారి పదో తరగతి ఫలితాల్లో జిల్లా మంచి పేరును సాధించింది. దీంతో వచ్చే ఏడాది మరింత మెరుగుపర్చుకునేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యార్థులకు కనీస అవసరాలపై చర్చించే ఆస్కారం ఉంది. వసతిగృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెనూ పాటించడం, హాస్టళ్లలో సౌకర్యాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల పనితీరు, కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు తదితర అంశాలు చర్చకు రావచ్చు.

ఇక ఖరీఫ్‌ (వానాకాలం) ప్రారంభం ఇప్పటికే వారం గడిచిపోయింది. సుమారు 40 నుంచి 50 శాతం మంది పొలాల్లో విత్తనాలు నాటారు. ఇంకా కొంత మంది రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 15 తర్వాత కురిసే వర్షాలపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. జిల్లా రైతులకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచడం, పంటలపై మందు పిచికారీ, ఏఏ రకాల ఎరువులు వాడాలనే దానిపై రైతులకు అవగాహన తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సమయంలో రైతులకు ప్రభుత్వం అందజేసే పెట్టుబడి సాయం (రైతుబంధు), బ్యాంకుల ద్వారా అందజేసే పంట రుణాలు, తదితర అంశాలు చర్చకు రావచ్చు. జిల్లాలో ఇప్పటికే సుమారు 40 శాతం మందికి రైతుబంధు రాగా, మిగతా 60 శాతం మందికి రైతుబంధు రావాలంటే మరో పక్షం రోజుల వరకు పడుతుంది.

ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ తదితర అంశాలు చర్చించవచ్చు. ఈ అంశాలతోపాటు త్వరలో చేపట్టే హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకం, నర్సరీల్లో ఉన్న మొక్కలు, ఈ ఏడాది లక్ష్యానికి అనుగుణంగా మొక్కల పెంపకం తదితర అంశాలు చర్చకు రావచ్చు. రానున్న వర్షాకాలం దృష్ట్యా సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పీహెచ్‌సీ, సీహెచ్‌సీల పనితీరుతోపాటు జిల్లా ఆసుపత్రులు తీరుపై చర్చించనున్నారు. అయితే ఆసుపత్రుల్లో సరిపడా డాక్టర్లు, సౌకర్యాలు, మందులు, ఇతరాత్ర అంశాలు చర్చించనున్నారు. వీటితో పాటు ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ అయినా 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్‌కు సంబంధిత మార్గదర్శకాలు, విధివిధానాలు, కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ, దళిత బస్తీ పథకం కింద భూ పంపిణీ, భూములు అమ్మిన వారికి డబ్బు చెల్లింపులు, ఈ ఏడాదిలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకొని కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ చెక్కుల పంపిణీ, తదితర అంశాలు చర్చించే అవకాశాలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement