ప్రేమజంటను అడ్డుకున్న పెద్దలు
వర్ధన్నపేట టౌన్ : ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు. ఆసమయంలోనే ఒకరికొకరు ప్రేమించుకున్నారు. కలకాలం కలిసి ఉండేందుకు రెండు నెలల క్రితం ఇంట్లోంచి పారిపోయారు. అబ్బాయి తల్లిదండ్రులు ఆచూకీ తెలుసుకుని ఇంటికి తీసుకెళ్తుండగా అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు అడ్డుకున్నారు. వివరాలు ఇవీ.. మండలంలోని డీసీ తండా గ్రామపంచాయతీ పరిధి గుబ్బెడతండాకు చెందిన బానోతు అరుణదేవి(21) వరంగల్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీ-ఫార్మసీ చదువుతోంది. రాయపర్తి మండలం బోడికింది తండాకు చెందిన గుగులోతు బాలాజీ(23) మరో కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించనే ఉద్దేశంతో రెండు నెలల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్ పారిపోయారు. దీంతో అరుణదేవి తండ్రి మహబూబ్ తన కూతరు ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం బాలాజీ తల్లిదండ్రులు, బంధువులు గాలిస్తూ హైదరాబాద్‌లో ఉన్న బాలాజీ, అరుణదేవిని గుర్తించారు. వారిని స్వగ్రామానికి తీసుకొస్తుండగా, తమను ఏదైనా చేస్తారేమోననే భయంతో మహబూబ్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మహబూబ్.. తన బంధు, మిత్రులతో కలిసి వర్ధన్నపేట పాత బస్టాండ్ వద్ద బస్సు ఆపారు.
ప్రేమజంటను కిందికి దించారు. ఈ క్రమంలో యువతి, యువకుడి తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫలితంగా రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలు స్తంభించారుు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇరు కుటుంబాలను సముదాయించి ప్రేమజంటను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రేమికులు మేజర్‌లు కావడంతో వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేస్తున్నారు.