
నేను జైలుకెళ్తే.. మీరెలా బతుకుతారు?
తాండూరు రూరల్: ‘నేను జైలుకెళ్తే.. మీరెలా బతుకుతారు? చస్తే అందరం చద్దాం..’ అని ఓ యువకుడు నిద్రిస్తున్న తల్లి, చెల్లి, తమ్ముడిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భయంతో తమ్ముడు పరుగులు తీయడంతో బతికిపోయాడు. తల్లి,చెల్లి సజీవ దహనమవగా ఆస్పత్రికి తరలిస్తుండగా సదరు యువకుడూ మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం జినుగుర్తిలో గురువారం వెలుగు చూసింది. తాండూరు రూరల్ సీఐ సైదిరెడ్డి వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా సెడం తాలుకా ముదెళ్లి గ్రామానికి చెందిన చిప్ప పరశురాం, లక్ష్మీబాయి(75) దంపతులు 30 ఏళ్ల క్రితం జినుగుర్తికి వలస వచ్చారు. వీరికి సత్య విజయ్‌కుమార్ అలియాస్ రాజు(31), భీమజ్యోతి (28), చంద్రప్రకాశ్ సంతానం. పరశురాం తొమ్మిదేళ్ల క్రితం మృతిచెందాడు. సత్య విజయ్‌కుమార్ తాండూరులో ఓ మిఠాయి దుకాణంలో పని చేస్తూ అక్కడే ఉంటున్నాడు. తరచూ జినుగుర్తికి వచ్చి వెళ్తుండేవాడు. అతడు మేనమామ కూతురు మంజులను వివాహం చేసుకున్నాడు. వీరికి కొడుకు నాని ఉన్నాడు. కుటుంబ కలహా లతో మూడేళ్ల క్రితం మంజుల పుట్టింటికి వెళ్లిపోయింది. సత్య విజయ్‌కుమార్ సోదరి భీమజ్యోతికి వివాహం అయినా భర్త వదిలేయడంతో ఆమె పుట్టింట్లోనే ఉంటోంది.
రోజంతా దేవుడికి పూజలు..
బుధవారం ఇంట్లోనే ఉన్న సత్య విజయ్‌కుమార్ రోజంతా దేవుడికి పూజలు చేశాడు. ‘నేను జైలుకు వెళితే మీరెలా బతుకుతారు..? అందరం చనిపోదాం’ అంటూ కుటుంబీకులతో గొడవపడి వారిని బెదిరించాడు. డబ్బులు సమకూరుస్తాం పడుకో కొడుకా.. అంటూ విజయ్‌కుమార్‌ను తల్లి ఓదార్చింది.
ఇలా దహనం చేశాడు..
బుధవారం రాత్రి ఇంటి ఆవరణలో సత్య విజయ్‌కుమార్ తల్లి, చెల్లి, తమ్ముడితో కలసి నిద్రించాడు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను తీసుకొచ్చి నిద్రిస్తున్న కుటుంబీకులపై పోసి తాను కూడా పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే తేరుకున్న చంద్రప్రకాష్ భయంతో పరుగులు తీయడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతను కేకలు వేయడంతో స్థానికులు వచ్చేలోపే లక్ష్మీభాయి, భీమజ్యోతి సజీవదహనమయ్యారు. కొనఊపిరితో ఉన్న విజ య్‌కుమార్‌ను తాండూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. విజయ్‌కుమార్ రాసిన సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
కాగా, ఘటనపై ఎస్పీ రమా రాజేశ్వరి వివరాలు సేకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సత్య విజయ్‌కుమార్ సూసైడ్‌నోట్‌లో కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, భార్య వదిలిపెట్టి వెళ్లడంతో పాటు కోర్టు వారెంట్‌కు సంబంధించిన వివరాలు రాశాడన్నారు. వారెంట్ రీకాల్ కోసం రూ.2 వేలు సమకూరకపోవడంతో తాను ఎలాగైనా జైలుకెళ్తాననే భయపడి ఉంటాడని తెలిపారు.
అసలేం జరిగిందంటే..
సత్య విజయ్‌కుమార్ పాత తాండూరులో ఓ గుప్త నిధుల తవ్వకాల కేసులో నింది తుడు. ఈ క్రమంలో అతడు జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈనెల 21న కోర్టులో కేసు ఉన్నా విజయ్‌కుమార్ హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. దీంతో అతడు మనస్తాపం చెందాడు. వారెంట్‌ను రీకాల్ చేసేందుకు రూ. రెండు వేలు అవసరం పడడంతో అవి సర్దుబాటు కాలేదు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, భార్య వది లేసి వెళ్లడం, కోర్టు నుంచి వారెంట్ రావ డం తదితరాలతో విజయ్‌కుమార్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.