కొత్త వాహన చట్టంతో అంతా అలర్ట్‌ | After Introducing New Motor Vehicle Act People Scramble For Driving Licence | Sakshi
Sakshi News home page

లెర్నింగ్‌ లైసెన్స్‌లకు భారీగా దరఖాస్తులు

Published Sat, Sep 14 2019 10:17 AM | Last Updated on Sat, Sep 14 2019 10:24 AM

After Introducing New Motor Vehicle Act People Scramble For Driving Licence - Sakshi

సాక్షి, మిర్యాలగూడ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వాహన చట్టంతో వాహనదారులు అంతా అలర్ట్‌ అవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడే అమలు లేకపోయినప్పటికీ అక్కడక్కడా జరిమానాలు విధించడం వల్ల ముందస్తు జాగ్రత్తలు పడుతున్నారు. ఈ నెల 1వ తేదీన నుంచి కొత్త వాహనం చట్టం అమలులోకి వచ్చినా అంతకుముందునుంచే జిల్లాలోని ప్రధాన పట్ట ణాలైన నల్లగొండ, మిర్యాలగూడ ప్రాంతాలలో ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు విధించారు. దీంతో వాహనదారులు ముందస్తుగా వాహనానికి రిజిస్ట్రేషన్‌తో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్, ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారు. కొత్తగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. గతంలో జిల్లాలో రోజుకు వంద మంది దరఖాస్తులు చేసుకునే వారు.. కానీ నెల నుంచి రోజుకు రెండు వందల మంది దరఖాస్తు చేసుకొని డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకుంటున్నారు. 

లెర్నింగ్‌ లైసెన్స్‌లకు భారీగా దరఖాస్తులు

మిర్యాలగూడ ఎంవీఐ కార్యాలయంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ల కోసం కూర్చున్న దరఖాస్తు దారులు 

ఇన్ని రోజులు వాహనం నడుపుతున్నా డైవ్రింగ్‌ లైసెన్స్‌ ఎందుకులే అనుకున్నారు.  కొత్త వాహన చట్టం రావడం వల్ల అలాంటివారందరూ లెర్నింగ్‌ లైసెన్స్‌ కోసం భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడలలో మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లో కొత్త డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం రోజుకు వందల మంది వెళ్తున్నారు. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ ఎంవీఐ కార్యాలయాల్లో ఈ ఏడాది జూలై మాసంలో 2,645 మంది కొత్తగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోగా, ఆగస్టు మాసంలో 2,507 మంది తీసుకున్నారు. ఈ నెలలో ఏడు పని దినాల్లోనే ఇప్పటివరకు 1,418 మంది దరఖాస్తులు చేసుకొని లెర్నింగ్‌ లైసెన్స్‌లు పొందారు. 

స్లాట్‌ బుకింగ్‌కు వారం రోజుల గడువు
కొత్తగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకునేవారు, పర్మనెంట్‌ లైసెన్స్‌ తీసుకునే వారు ముందుగా మీ సేవా కేంద్రంలో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంది. స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్నాక గతంలో ఒక్క రోజులోనే ఎంవీఐ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ దరఖాస్తులు పెరగడం వల్ల వారం రోజులు ఆగాల్సి వస్తుంది. కొత్తగా లెర్నింగ్‌ లైసెన్స్‌ కోసం ద్విచక్ర వాహనానికి 300 రూపాయలు, ద్విచక్రవాహనాలతోపాటు నాలుగు చక్రాల వాహనానికి 450 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా పర్మనెంట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ద్విచక్ర వాహనానికి 1,035 రూపాయలు, ద్విచక్ర వాహనంతో పాటు నాలుగు చక్రాల వాహనానికి 1,335 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 

దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి
గతంలో కంటే ప్రస్తుతం ఎక్కువమంది డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తీసుకుంటున్నారు. కొత్త వాహన చట్టం రావడం వల్ల డ్రైవింగ్‌ వచ్చిన వారంతా లైసెన్స్‌ తీసుకుంటున్నారు. గతంలో రోజుకు 40 నుంచి 45 మంది కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు. కానీ ప్రస్తుతం 90నుంచి వంద మంది దరఖాస్తు చేసుకొని డ్రైవింగ్‌ లైసెన్స్‌లు పొందుతున్నారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవాలి. దీనితోపాటు వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్‌ కూడా తప్పనిసరిగా ఉండాలి.  
 –  శ్రీనివాస్‌రెడ్డి, ఎంవీఐ, మిర్యాలగూడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement