బోయినపల్లి : మధ్యమానేరు జలాశయం నిర్మాణ పనులకు తొమ్మిదేళ్ల తర్వాత కదలిక వచ్చింది. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా నిర్మించాల్సిన మట్టికట్ట పనులను బుధవారం మండలంలోని మాన్వాడ గ్రామంలో ఈఈ గోవిందరావు, ఎస్డీసీ శంకర్‌కుమార్ ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర రిజర్వాయర్ మట్టికట్ట, 555 మీటర్ల మేర స్పిల్‌వే నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు.
2006లో మండలంలోని మాన్వాడ వద్ద 25.873 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. రూ.406.48 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలువగా, రూ. 339.39 కోట్ల వ్యయంతో పనులు పూర్తి చేస్తామని జెడ్‌వీఎస్-రత్న-సుశి సంస్థలు జాయింట్ వెంచర్‌గా ఏర్పడి పనులు చేపట్టాయి. ఈ సంస్థలు ప్రారంభంలో కేవలం కట్ట పనులు మాత్రమే చేసి ఇక పనులు చేయలేమని చేతులెత్తేశాయి. చేసిన పనులకు ఆ సంస్థలకు రూ.77 కోట్లు చెల్లించారు. మళ్లీ 2010లో రూ.454 కోట్ల అంచనాలతో ప్రభుత్వం మరోసారి టెండర్లు పిలిచింది. 20 శాతం లెస్‌తో రూ.360.90 కోట్లకు ఎంఎస్ ఎస్‌ఏపీఎల్ అండ్ ఎంబీఎల్, ఐవీఆర్సీఎల్ అనే సంస్థలు జాయింట్ వెంచర్‌గా ఏర్పడి మిడ్‌మానేర్ రిజర్వాయర్ పనులను దక్కించుకున్నాయి.
మట్టికట్ట 10 కిలోమీటర్లు..
స్పిల్‌వే 555 మీటర్లు..
మండలంలోని వెంకట్రావ్‌పల్లి రూసో కళాశాల ప్రాంతంలో రిజర్వాయర్ 0 పాయింట్ తీసుకుని అక్కడి నుంచి మట్టికట్ట పనులు ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం కొదురుపాక పరిసరాల నుంచి మాన్వాడ మీదుగా ఐదు కిలోమీటర్ల మేర మట్టికట్ట నిర్మించనున్నారు. మాన్వాడ నుంచి ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల కాకులబోర్ వరకు ఐదు కిలోమీటర్లు మట్టికట్ట నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
మొత్తం 10 కిలోమీటర్ల మట్టికట్ట నిర్మాణానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మండలంలోని మాన్వాడ గ్రామంలోని మానేరు నదిలో 555 మీటర్ల మేర స్పిల్‌వే నిర్మాణం పనులు గత కొద్ది సంవత్సరాలుగా నడుస్తున్నాయి. స్పిల్‌వే నిర్మాణంలో 25 గేట్లు, క్రాస్ రెగ్యులేటర్లు, తూముల నిర్మాణం పనులు చేస్తున్నారు.
నిర్మాణ కాలం 16 నెలలు
మట్టికట్ట పనులు, స్పిల్‌వే నిర్మాణం పనులు 16 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం కంట్రాక్టర్లకు గడువు విధించింది. 2016 ఖరీఫ్ సీజన్ వరకు జలాశయంలో మూడు టీఎంసీల నీరు నిలువ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రిజర్వాయర్‌లో నిలువ చేసిన నీటిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్ పథకానికి ఇవ్వాలని నిర్ణయించింది. అందుకే ప్రభుత్వం మిడ్‌మానేర్ పనులు యుద్ధప్రాతిపదికన చేసేందుకు యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది.
తొమ్మిదేళ్ల తర్వాత కదలిక
Published Sat, Mar 7 2015 2:38 AM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM
Advertisement
Advertisement