వ్యవసాయంలో దూర విద్య కోర్సు
- దేశంలోనే తొలిసారిగా...
- యువరైతులను ప్రోత్సహించడమే లక్ష్యం
- వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడి
రాజేంద్రనగర్ : చదువుకున్న యువరైతులకు వ్యవసాయరంగంలో వస్తోన్న ఆధునిక విధానాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలలో స్వల్పకాలిక దూరవిద్య కోర్సులను ప్రారంభిస్తున్నామని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు.
శనివారం రాజేంద్రనగర్ ఈఈఐ కాన్ఫరెన్స్ హాల్‌లో కోర్సు పాఠ్యాంశాల రూపకల్పనపై 9 జిల్లాల యువరైతులతో ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి మూడు నెలలపాటు ఉండే మొదటిబ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని దూరవిద్య పద్ధతితో నిర్వహించనున్నామన్నారు. శిక్షణ కార్యక్రమంలో చేర్చాల్సిన అంశాలకు సంబంధించి ఆమె యువరైతుల నుంచి సూచనలను స్వీకరించారు.
ప్రధానంగా వ్యవసాయ యాంత్రీకరణ, విత్తనోత్పత్తి, ఉద్యాన పంటలు, పూలతోటలసాగు, వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగువిధానాలలో మార్పులు, భూసార పరీక్షల ప్రాధాన్యత, తుపంర, బిందుసేద్యం నిర్వహణ, నీటియాజమాన్యం, పురుగుమందులు, ఎరువుల యాజమాన్యం, చేపలపెంపకం, పశుపోషణలో అనుసరించాల్సిన ఆధునిక పద్ధతులు తదితర అంశాలపై శిక్షణ అవసరమని యువరైతులు ఆమెకు వివరించారు.
వ్యవసాయరంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మొబైల్ అప్లికేషన్లు, సమాచార, ప్రసారమాధ్యమాల ద్వారా రైతులకు అందివ్వాలని వారు కోరారు. కాగా సర్టిఫికెట్ కోర్సును పూర్తిచేసినవారికి ఎలాంటి ఉద్యోగావకాశాలు లభించవని ఆమె స్పష్టం చేశారు. మూడు నెలల శిక్షణ కార్యక్రమానికి సంబంధించి పాఠ్యాంశాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ర్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందిస్తుందన్నారు.
రానున్న రోజుల్లో యంగ్‌ఫార్మర్స్ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించే చేస్తున్నామన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి డాక్టర్ వి. ప్రవీణ్‌రావు మాట్లాడుతూ... వ్యవసాయ సాగుపద్ధతులపై రైతులకు నైపుణ్యం పెంపొందించడానికి ఈ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. కోర్సు రూపకల్పనకు సంబంధించిన అంశాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ డి.రాజిరెడ్డి వివరించారు. అంతకుముందు తొమ్మిది జిల్లాల నుంచి వచ్చన 77 మంది యువరైతులను 5 గ్రూపులుగా విభజించి పాఠ్యాంశాలపై వారినుంచి సలహాలను స్వీకరించారు.