రిచ్ సంస్థ డైరెక్టర్ జనరల్, ఐఎస్‌బీ మాజీ డీన్ డాక్టర్ అజిత్ రంగ్నేకర్
సాక్షి, హైదరాబాద్ : వర్టికల్ ఫార్మింగ్.. ఆక్వాపానిక్స్.. హైడ్రోపానిక్స్.. వ్యవసాయ రంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక టెక్నాలజీల్లో మచ్చుకు కొన్ని పేర్లు ఇవీ. అతితక్కువ వనరులతో అత్యధిక దిగుబడులు సాధించేందుకు ఉపకరిస్తాయి. మరి.. అక్షరం ముక్క రాని లేదా అరకొరగా చదువుకున్న సామాన్య రైతులు ఈ ఆధునిక టెక్నాలజీలతో ప్రయోజనం పొందేదెలా? దీనికి సమాధానం ‘అగ్రిటెక్’పార్క్ అంటోంది రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్. క్లుప్తంగా ‘రిచ్’అని పిలిచే ఈ సంస్థ ఏడాది క్రితం తెలంగాణ ప్రభుత్వం చొరవతో ఏర్పాటైంది. తొలి వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ జనరల్, ఐఎస్‌బీ మాజీ డీన్ డాక్టర్ అజిత్ రంగ్నేకర్ ఈ అగ్రిటెక్ పార్క్ ఏర్పాటును ప్రకటించారు.
దాదాపు 70 నుంచి 75 ఎకరాల విస్తీర్ణంలో వచ్చే ఏడాది ఏర్పాటు కానున్న ఈ పార్క్‌లో రైతులు అత్యాధునిక టెక్నాలజీలను అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చని అజిత్ తెలిపారు. పార్క్ ఏర్పాటుకు అవసరమైన రూ.20 కోట్ల నుంచి రూ. 25 కోట్ల నిధులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని, అవసరమైన భూమిని తెలంగాణ ప్రభుత్వం నుంచి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిసరాల్లో ఈ పార్క్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, ఆ దిశగా చర్చలు జరుపుతున్నామని చెప్పారు.
చిన్న కమతాలున్న రైతులు తమ పొలాల్లో కొత్త టెక్నాలజీలతో ప్రయోగాలు చేయడ మంటే జీవనోపాధి పోతుందన్న భయంతో ఇష్టపడకపోవచ్చని.. ఆ టెక్నాలజీలు ఎలా పనిచేస్తాయో అగ్రిటెక్ పార్కులో స్వయంగా తెలుసుకుంటే తర్వాత వారు వాటిని వాడటం ద్వారా లబ్ధి పొందవచ్చని వివరించారు. రైతులతోపాటు రైతు సహకార సంస్థలు ఈ పార్క్‌లో పనిచేయవచ్చని చెప్పారు. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వంటి 25 పరిశోధన సంస్థలతో రిచ్ పనిచేస్తోందని అజిత్ రంగ్నేకర్ తెలిపారు. వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, ఏరోస్పేస్, జీవశాస్త్ర సంబంధిత రంగాల్లో స్టార్టప్‌లను ప్రోత్సహించడం తమ కార్యకలాపాల్లో కొన్ని మాత్రమేనని చెప్పారు. గత ఏడాది 25 వినూత్నమైన స్టార్టప్‌లకు సహకారం అందించామని వివరించారు.
అన్నివిధాలా సహకరిస్తాం: కేటీఆర్
కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంపై అనేక సందేహాలు వస్తున్న తరుణంలో తాను అజిత్ రంగ్నేకర్‌ను సంప్రదించానని, రాష్ట్రం అభివృద్ధికి వినూత్నమైన ఆలోచనలతో సహకరించాల్సిందిగా చేసిన విజ్ఞప్తికి ప్రతిరూపమే ‘రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్’అని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏడాదిలోపు ఈ సంస్థ సాధించిన విజయాలు స్ఫూర్తిదాయకమని.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భవిష్యత్తులోనూ ఈ సంస్థకు అన్ని విధాలా సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment