
అహ్మదాబాద్ టు ముషీరాబాద్
ఇదీ డాక్టర్ అనీఫ్ ప్రస్థానం
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముషీరాబాద్‌కు చెందిన డాక్టర్ అనీఫ్ మృతి చెందాడన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసి ముగ్గురు పోలీసులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాది వికారుద్దీన్‌కు ఆశ్రయం కల్పించాడనే అభియోగంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధముందని 2010 ఫిబ్రవరిలో అనీఫ్‌ను పోలీసులు అరెస్టుచేశారు. అప్పటినుంచి విడుదల కాకుండా జైల్లోనే మగ్గుతున్నాడు. అనీఫ్‌కు భార్య ఇర్షాద్ అలియాస్ బీబీ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
క్లినిక్ ముసుగులో ఉగ్రకార్యకలాపాలు..!
అనీఫ్‌ది గుజరాత్‌లోని అహ్మదాబాద్. బీఏఎంఎస్ చదివిన అనీఫ్ 2007లో హైదరాబాద్‌కు వచ్చి వారాసిగూడలో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ముషీరాబాద్‌లోని జంజం మసీదు సమీపంలో అతని పేరుతో ప్రైవేట్ క్లినిక్ ఏర్పాటుచేశాడు. అయితే అందులో గుట్టుచప్పుడు కాకుండా ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతుండేవాడని ఆరోపణలు వచ్చాయి. అప్పటికే హైదరాబాద్‌లో ముగ్గురు పోలీసులను చంపి మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న వికారుద్దీన్‌కు వారాసిగూడలోని తన ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న పోలీసులు వారాసిగూడాలో ఇంటిపై దాడి చేసి వికారుద్దీన్‌ను అరెస్టు చేశారు. తర్వాత ఆశ్రయం కల్పించినందుకు అనీఫ్‌ను కూడా అరెస్ట్ చేశారు.
అప్పటి నుంచి అనీఫ్ భార్య ముషీరాబాద్‌లోని తన తల్లిగారింట్లోనే ఉంటోంది. అప్పుడప్పుడూ జైలుకు వెళ్లి అనీఫ్‌ను కలిసి వస్తుండేది. అనీఫ్ మరణ వార్త తెలియగానే ఎంబీటీ నాయకులు ముషీరాబాద్‌లోని అతని అత్తగారింటికి వచ్చి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఇదిలా ఉండగా అనీఫ్ మృతదేహాన్ని తీసుకురావడానికి కుటుంబసభ్యులెవరూ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అతని మృతదేహాన్ని ముషీరాబాద్‌కు తీసుకొస్తారా.. లేక గుజరాత్ తీసుకెళ్తారా? అనే విషయంపై ఇంకా సందిగ్ధత నెలకొంది.