- నగదు సరఫరాలో సూత్రధారి
- నిర్ధారించిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు
హైదరాబాద్: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్ల కేసులో నిందితుల సంఖ్య ఆరుకు చేరింది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేసిన ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాది ఎజాజ్ షేక్ పాత్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నిర్ధారించింది. పేలుళ్లకు అవసరమైన ఆర్థిక సాయం ఇతడే చేశాడనే ఆరోపణలపై హైదరాబాద్ తరలించేందుకు నాంపల్లి కోర్టు నుంచి అనుమతి తీసుకుంది. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎజాజ్‌ను ఆదివారం లోపు నగరానికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. పుణేకు చెందిన ఎజాజ్ షేక్ ఐఎంలో కీలక వ్యక్తి. సాంకేతికంగా దర్యాప్తు చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు ఎజాజ్ పాత్రను గుర్తించాయి.
గత ఏడాది సెప్టెంబర్ 6న ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతమైన సహరంగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు. హైదరాబాద్‌ను 2007లో మాదిరిగానే మరోసారి టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్న రియాజ్ భత్కల్ 2012 సెప్టెంబర్‌లో అసదుల్లా అక్తర్ (ఆజామ్‌ఘడ్), వఖాస్ (పాకిస్థాన్)లను మంగుళూరుకు పంపాడు. వీరికి అవసరమైన నిధుల్ని పంపే బాధ్యతలు పుణేలో ఉంటున్న ఎజాజ్‌కు అప్పగించాడు. దీంతో ఎజాజ్ మంగుళూరులోని హంపన్‌కట్టలో ఉన్న వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్‌ఫర్ సంస్థ ఔట్‌లెట్ సుపమ ఫోరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మార్కెట్ రోడ్డులో హవాలా వ్యాపారం చేసే డింగ్ డాంగ్ దుకాణం యజమాని ద్వారా 2013 ఫిబ్రవరిలో రూ.6.8 లక్షలు పంపాడు. ఉగ్రవాదులు ఆ నగదును వినియోగించే దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ-1 మిర్చ్ సెంటర్స్‌లో పేలుళ్లకు పాల్పడి 18 మందిని పొట్టన పెట్టుకున్నారు.