
ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మద్యం అమ్మకాలు ‘ఫుల్’గా సాగుతున్నాయి. మూడు ఫుల్ బాటిళ్లు.. ఆరు బీర్లు అన్న చందంగా అమ్మకాలు కిక్కు ఎక్కిస్తున్నాయి. ఒకప్పుడు రెవెన్యూ విభాగంలో ఓ భాగంగా ఉన్న అబ్కారీ శాఖ.. ఇప్పుడు రెవెన్యూ పరంగా ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015–16 సంవత్సరంలో నూతన మద్యం పాలసీ అమల్లోకి తీసుకొచ్చింది. రెండేళ్ల కాల పరిమితిలో ఉమ్మడి జిల్లాలో ఎక్సైజ్ శాఖ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 158 దుకాణాలకు
1,541 దరఖాస్తులు రాగా వీటి ద్వారా రూ.7.70 కోట్ల ఆదాయం అదనంగా ఎక్సైజ్ శాఖకు వచ్చింది. రెండేళ్ల లైసెన్స్ ఫీజుల ద్వారా రూ.132 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే కాకుండా ఈ రెండేళ్లలో ఆగస్టు వరకు రూ.1,666 కోట్ల మద్యం అమ్మకాలు జరగడం గమనార్హం. గతంలో మద్యం పాలసీ ఏడాదిపాటు మాత్రమే నిర్వహించే వారు. 2014–15 సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా రూ.593.99 కోట్లు రాగా, ప్రతీ ఏడాది ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2015–16 సంవత్సరంలో రూ.794.09 కోట్లు, 2016–17(ఆగస్టు వరకు) రూ.872.35 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 2014 సంవత్సరంతో పోలిస్గే మూడేళ్లలో రూ.280 కోట్ల ఆదాయం పెరిగింది.
రూ.7.70 కోట్ల ఆదాయం..
2015–16లో కొత్త మద్యం పాలసీ అమల్లో భాగంగా డీలర్లను ఎంపిక చేసే క్రమంలోనూ ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 158 దుకాణాలకు 1,541 దరఖాస్తులు రావడం, దరఖాస్తుదారుడికి ఫీజు తిరిగి ఇచ్చే వీలులేకపోవడంతో ప్రభుత్వానికి భారీగా దాయం సమకూరింది. ఫలితంగా దరఖాస్తుల ద్వారా రూ.7.70 కోట్ల ఆదాయం అదనంగా సర్కారు ఖజానాలో చేరింది. ప్రస్తుతం ఈ ఏడాది కొత్త మద్యం పాలసీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉమ్మడి జిల్లాలో 160 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ ఏడాది దరఖాస్తు ఫీజు రూ.లక్షకు పెంచడంతో గత పాలసీ కంటే ఈ ఏడాది మరింత ఆదాయం వచ్చింది. దరఖాస్తుల ద్వారా చేసుకున్న ఫీజును తిరిగి ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఆ మొత్తం ఎక్సైజ్ శాఖ ఖాతాలోనే జమ కానుంది. మంగళవారం చివరి రోజు ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు వెల్లువెత్తడంతో రూ.18.15 కోట్ల ఆదాయం వచ్చింది.
మద్యం అమ్మకాలు..
ఉమ్మడి జిల్లాలో 158 మద్యం దుకాణాలు ఉండగా గత రెండేళ్లలో విక్రయాలు విపరీతంగా పెరిగాయి. 2015–16లో 18,09,713 ఐఎంఎల్ కేసులు(పెట్టెలు) అమ్ముడుపోగా, బీర్లు 16,07,964 కేసులు అమ్ముడు పోయాయి. వీటి ద్వారా రూ.794.09 కోట్ల ఆదాయం వచ్చింది. 2016–17 సంవత్సరంలో 18,82,657 ఐంఎల్ కేసులు, 17,05,645 కేసులు అమ్ముడుపోగా వీటి ద్వారా రూ.872.35 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ లెక్కన చూస్తే గతేడాది కంటే ఈ ఏడాది మద్యం అమ్మకాల కేసులతోపాటు ఆదాయం పెరిగింది. 2014–15 సంవత్సరంలో 12,86,955 ఐఎంఎల్ కేసులు, 14,15,766 బీర్ల కేసులు అమ్ముడుపోగా, వీటి ద్వారా రూ.593.99 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే గత మూడేళ్లలో అమ్మకాలు ఏడాదికేడాది పెరుగుతూ వస్తున్నాయి.