ఖమ్మం: సమగ్ర కుటుంబ సర్వేతో జిల్లాలోని పలు పట్టణాల రహదారులు నిర్మానుష్యంగా మారాయి. సర్వేలో పాల్గొనేందుకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో కర్ఫ్యూను తలపించేలా జిల్లా అంతటా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. రాజకీయ పక్షాలు, ఇతర సంఘాల బంద్‌కు పిలుపు నిచ్చిన సందర్భాల్లో కూడా కొన్నిచోట్ల బంద్ పాటిస్తే మరికొన్ని చోట్ల రద్దీగా ఉండేది.
కానీ మంగళవారం మాత్రం సకల జనులు సర్వేలో నిమగ్నం కావడంతో పిలుపు లేకుండానే బంద్‌ను తలపించింది. బస్సులు, ఆటోలు, ట్రాలీలు.. ఇలా ఏ ఒక్క వాహనం కూడా రోడ్డెక్కలేదు. ప్రజలు కూడా ఇల్లు వదిలి బయటకు రాలేదు. దీంతో నిత్యం జనసందోహంతో కిటకిటలాడే ప్రధాన వీధులు, వాణిజ్యచ వ్యాపార కూడళ్లు బోసిబోయాయి.
ముమ్మర ప్రచారం...
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వే విజయవం అయ్యేందుకు గత కొంతకాలంగా ముమ్మర ప్రచారం చేసింది. రెండు రోజుల ముందే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. లక్షలాది కుంటుంబాలను సర్వే చేసేందుకు వేలాది మంది ఎన్యూమనేటర్లు అవసరం కావడంతో ప్రభుత్వ సిబ్బందితో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా డ్యూటీలు వేశారు. ఇక సొంత గ్రామాల్లో సర్వేలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. చాలా కాలం తర్వాత అందరూ కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేవు.
తెరుచుకోని వ్యాపార, వాణిజ్య కేంద్రాలు..
ప్రజలందరు సర్వే పనుల్లో నిమగ్నమై ఉండటంతో సకలం బంద్ అయింది. వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు దుకాణాలు మూసి వేసి సిబ్బందిని సర్వేలో పాల్గొనేందుకు పంపించారు. దీనికి తోడు వ్యాపారవేత్తలు, ఉద్యోగులు కూడా సర్వేకోసం తమ తమ ప్రాంతాలకు వెళ్లారు. దీంతో ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, ఇల్లెందు, మధిర, మణుగూరు, పాల్వంచ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. బస్టాండ్లు వెలవెల బోయాయి. దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు, సినిమా థియేటర్లు, బ్యాంకులు తెరుచుకోలేదు. నిత్యం జనసంద్రంగా ఉండే ఖమ్మం నగరంలోని గాంధీచౌక్, మయూరిసెంటర్, తెలంగాణ తల్లి విగ్రహం ప్రాంతం, జడ్పీసెంటర్, ఇతర ప్రధాన కూడళ్లలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
నిర్మానుష్యం
Published Wed, Aug 20 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM
Advertisement
Advertisement