
పన్ను మొత్తం చెల్లించాల్సిందే
ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: పన్ను చెల్లింపుపై హైకోర్టును ఆశ్రయించిన ప్రైవేటు ఆపరేటర్లకు చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే పిటిషనర్ల వాహనాలన్నీ తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన అంతర్ రాష్ట్ర పన్నును ఆ రాష్ట్ర రవాణాశాఖ వద్ద డిపాజిట్ చేయాల్సిందేనని తేల్చిచెప్పింది. ఇందుకు పది రోజుల గడువిచ్చింది. ఇలా డిపాజిట్ చేసిన మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో జమ చేసి, జాగ్రత్తగా ఉంచాలంటూ తెలంగాణ రవాణా శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఆ మొత్తాల్ని అలాగే ఉంచాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పన్నులపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ని ర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రైవేటు ఆపరేటర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని విచారించిన ధర్మాసనం..పన్ను చెల్లింపునకు హామీ పత్రా లివ్వాలని, కోర్టు తుది తీర్పునకు లోబడే పన్ను బకాయిలను చెల్లిస్తామని అందులో పే ర్కొనాలంటూ తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. అయితే వాటిని సవరిస్తూ ధర్మాసనం శుక్రవారం పూర్తిస్థాయి మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది ఈ. మనోహర్ త్రైమాసిక పన్నును డిపాజిట్ చేసేందుకు 10 రోజుల గడువు కావాలని కోరారు. దీనికి కోర్టు అంగీకరిస్తూ... తుది విచారణను వాయిదా వేసింది.