ఖమ్మంలో కూడా.. | Also, Khammam .. | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో కూడా..

Published Sun, Jan 25 2015 6:10 AM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM

Also, Khammam ..

  • అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం
  •  ప్రధాన నగ రాలకు దీటుగా ఖమ్మం అభివృద్ధికి కసరత్తు
  •  కనిష్టంగా 10 కిలోమీటర్లు విస్తరించనున్న పరిధి
  •  భవన నిర్మాణాల్లో అడ్డగోలు అనుమతులకు ఇక చెక్..
  • సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ఖమ్మం నగరానికి మరిన్ని కొత్త హంగులు కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. గ్రేడ్-1 మున్సిపాలిటీ నుంచి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా... ఆ తర్వాత నగర కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన ఖమ్మం కంఠాన మరో అదనపు ఆభరణం జత కానుంది. ప్రధాన నగరాలకు దీటుగా అన్ని రంగాల్లో ఖమ్మాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఖమ్మం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా)ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇప్పటికే  కార్పొరేషన్ హోదాలో నలుమూలలా విస్తరించిన నగరానికి తోడు కుడా ఏర్పాటుతో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది.

    తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌లలో మాత్రమే ఉన్న అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఖమ్మంలోనూ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండటంతో నగర ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. రెండు రోజుల క్రితం ప్రాథమికంగా సమావేశమైన జిల్లా ఉన్నతాధికారులు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ రూపురేఖలు, విధి విధానాలు, దాని పరిధిని ఎంత మేరకు విస్తరించాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

    రాబోయే 20 సంవత్సరాల్లో ఖమ్మం నగరం దాదాపు 10 కిలోమీటర్లకు పైగా విస్తరిస్తుందన్న అంచనాలతో ఖమ్మం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నగరంలో ఏ ప్రాంతం నుంచి ఎంత మేరకు అర్బన్ అథారిటీని విస్తరింపచేయాలి, ఎన్ని కిలోమీటర్ల దూరాన్ని దీని పరిధిలోకి తీసుకురావాలి అనే అంశాలపై జియోగ్రాఫికల్ సర్వేకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఖమ్మం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పడితే దాని పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో రోడ్లు, వాణిజ్య సముదాయాలు, భవనాల నిర్మాణాలకు అథారిటీ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.

    పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో రహదారుల విస్తరణ చేపట్టకపోవడం, అందుకు పరిస్థితులు అనుకూలించకపోవడం, నగర నడిబొడ్డుతోపాటు శివార్లలోనూ నిబంధనలకు విరుద్ధంగా వందలాది అపార్ట్‌మెంట్‌లు ఏర్పడటం, వాటికి సరైన రహదారులు, లే అవుట్‌ల వంటి చట్టబద్ధమైన అనుమతులు లేకపోవడంతో కార్పొరేషన్‌కు ఆయా ప్రాంతాలలో వసతులు కల్పించడం తలకు మించిన భారంగా పరిణమించింది.

    ఖమ్మం నగర పాలక సంస్థలో విలీనం కాకముందు ఖానాపురం హవేలీ గ్రామ పంచాయతీ పరిధిలోని 1200 అపార్ట్‌మెంట్‌లు నిర్మించడం, వాటిలో అనేక అపార్ట్‌మెంట్‌లకు నిబంధనల మేరకు అనుమతులు లేకపోవడం వంటి అంశాలను మున్సిపల్, రెవెన్యూ అధికారులు గుర్తించారు. భవిష్యత్తులోనూ ఈ పరిస్థితి తలెత్తకుండా అథారిటీ పరిధిలోకి వచ్చే ప్రతి గ్రామంలో నిబంధనలకు అనుగుణంగా ఉండే భవనాల నిర్మాణానికి మాత్రమే అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది.

    అయితే ఖమ్మం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఖమ్మం నగర పాలక సంస్థ సరిహద్దు ప్రాంతాల నుంచి 10 కిలోమీటర్ల పరిధికి పరిమితం చేయాలా..? 15 కిలోమీటర్ల వరకు విస్తరింపచేయాలా..? అనే అంశంపై సాంకేతికంగా సర్వే నిర్వహించి, వాటిలో వచ్చిన ఫలితాల ఆధారంగా విస్తరణ ఉంటుంది. ప్రస్తుతం ఖమ్మం నగరం 95 పాయింట్ స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఈ అథారిటీ ఏర్పడితే పాండురంగాపురం వరకు నగర పాలక సంస్థ పరిధిలో ఉండగా, అక్కడినుంచి 10 కిలోమీటర్లు అర్బన్ అథారిటీ పరిధిని విస్తరింపచేస్తే దాదాపు మంచుకొండ, బూడిదంపాడు వరకు కుడా పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.

    ఇప్పుడున్న నగర పాలక సంస్థ పరిధి కాక కొత్తగా ఖమ్మం డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి మరో 26 గ్రామాలు చేరే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేశారు. 15 కిలోమీటర్లు అయితే పండితాపురం వరకు, అలాగే హైదరాబాద్ ప్రధాన రహదారిలో అయితే జీళ్లచెర్వు వరకు, కోదాడ రహదారి వైపు  గోకినేపల్లి, గువ్వలగూడెం వరకు, బోనకల్లు రహదారి వైపు జగన్నాధపురం ఆపై గ్రామాల వరకు, వరంగల్ రహదారివైపు దాదాపు తిరుమలాయపాలెం వరకు, వైరా రోడ్డులో కొణిజర్ల వరకు అర్బన్ అథారిటీ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.

    అయితే ‘కుడా’ పరిధిలోకి ఈ గ్రామాలు వచ్చినా అక్కడ గ్రామ పంచాయతీల పాలన మాత్రం యథావిధిగానే కొనసాగుతుంది. గ్రామాల్లో ప్రధాన రహదారుల నిర్మాణం, వాణిజ్య భవనాల సముదాయానికి అనుమతులు, గృహ నిర్మాణాల అనుమతులు మాత్రం నూతనంగా ఏర్పడే కుడాయే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దీని పరిధిని ఎంతమేరకు పరిమితం చేయాలనే అంశాన్ని జియోగ్రఫికల్ సర్వే మాత్రమే తేల్చనుంది. ఈ సర్వే బాధ్యతను జిల్లా డిస్ట్రిక్ట్ టౌన్ కంట్రీ ప్లానింగ్ ( డీటీసీపీ) అధికారులకు అప్పగించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement