భద్రాచలం : ముంపు మండలాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎక్సైజ్‌శాఖ అధికారులు బుధవారం హడావిడి చేశారు. జూన్ 2 నుంచే ముంపులో ఉన్న మద్యం దుకాణాలు తమకు కేటాయించారని చెబుతున్న సదరు శాఖాధికారులు.. తాజాగా మరో అడుగు ముందుకేసి చెక్‌పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎక్సైజ్ సీఐ చిరంజీవి చిట్టిబాబు నేతృత్వంలోనే సుమారు 20 మంది సిబ్బంది ముంపు మండలాల్లో పర్యటించారు. చింతూరు మండలంలోని చట్టి వద్ద గతంలో ఉన్న చోటనే చెక్‌పోస్టు ఏర్పాటు చేసి, ఒక సీఐ, ఎస్సై, ఒక హెడ్‌కానిస్టేబుల్, ఎనిమిది మంది కానిస్టేబుళ్లను అక్కడ నియమించారు.
వీరంతా బుధవారమే ఇక్కడ విధుల్లో చేరారు. చెక్‌పోస్టులు పక్కాగా ఏర్పాటు చేసుకొని విస్తృతంగా తనిఖీలు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేశారు. కూనవరం మండలంలోనూ మరో చెక్‌పోస్టు ఏర్పాటుకు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అయితే అక్కడి కంటే భద్రాచలం మండలం నెల్లిపాక వద్దనే చెక్‌పోస్టు ఏర్పాటుకు అనువుగా ఉంటుందని భావించి.. ఇక్కడ కూడా పరిశీలించారు. నెల్లిపాక సెంటర్‌లోని పెట్రోల్ బంక్ పక్కనున్న చిన్నపాటి తాటాకుల గుడిసెలో తాత్కాలికంగా చెక్‌పోస్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే దీన్ని ఇక్కడే ఉంచాలా.. మరెక్కడికైనా మార్చాలా అనేది కొద్ది రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. అయితే ప్రస్తుతానికి నెల్లిపాకలో ఒక ఎస్సై, ఒక హెడ్‌కానిస్టేబుల్, ఆరుగురు కానిస్టేబుళ్లు విధుల్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు.
సామగ్రి తెచ్చుకున్న అధికారులు...
చెక్‌పోస్టులను ఏర్పాటు చేసేందుకు వచ్చిన ఎక్సైజ్ అధికారులు రంపచోడవరం నుంచే కుర్చీలు, ఇతర సామగ్రి వెంట తెచ్చుకున్నారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము వచ్చామని, చెక్‌పోస్టుల ఏర్పాటుకు తగిన భవనాలు లేకపోతే చిన్నపాటి గుడిసెల్లో అయినా నిర్వహిస్తామని ఎక్సైజ్ సీఐ చిరంజీవి చిట్టిబాబు తెలిపారు. బుధవారం నుంచే విధులు కేటాయించటంతో కొందరు సిబ్బంది అసంతృప్తికి లోనయ్యారు. కొత్త ప్రదేశంలో విధులు నిర్వహించటం కొంత ఇబ్బందే అయినా, ఇక్కడే ఉండి తీరాలని సీఐ వారికి సూచించారు.
రాచమర్యాదలు చేసిన భద్రాచలం అధికారులు...
ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన ముంపు ప్రాంతాలైన నెల్లిపాక, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాలతో తమకు సంబంధం లేదని భద్రాచలం ఎక్సైజ్ సీఐ రాంకిషన్ ప్రకటించారు. అయితే రంపచోడవరం నుంచి వచ్చిన ఎక్సైజ్ అధికారులకు ఆయన దగ్గరుండి మరీ రాచమర్యాదులు చేయటం పట్ల పలువరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముంపు మండలాల బదలాయింపుపై భద్రాచలం కేంద్రంగా ఓవైపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతుంటే.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన(భద్రాచలం) ఎక్సైజ్ శాఖ అధికారులు ఆంధ్ర వారికి రాచమర్యాదులు చేయడమేంటని స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు.
అక్రమ మద్యం అమ్మకాలకు అడ్డు కట్ట ఏదీ...
భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మద్యం దుకాణాల లెసైన్సుల గడువు ముగసింది. దీంతో అక్రమ మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించకుండా నెల్లిపాక వెళ్లి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులతో మంతనాలు జరపడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా నెల్లిపాక హోటల్‌లో సుమారు రెండు గంటల పాటు గడిపిన సీఐ రాంకిషన్‌ను ఫొటో తీసేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ సమయంలో సీఐ, ఎస్సై స్థాయి అధికారులకు నెల్లిపాకలో ఏం పని అనేది ఉన్నతాధికారుల పరిశీలనలో వెల్లడి కావాల్సి ఉంది.
సొంతపనులపై వచ్చాం : సీఐ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన అధికారులతో ఎటువంటి అప్పగింతలు చేయలేదని భద్రాచలం ఎక్సైజ్ సీఐ రాంకిషన్ తెలిపారు. తాము సొంతపనులు నిమిత్తమే ఇక్కడి వచ్చామని చెప్పారు.
‘ముంపు’లో హడావిడి
Published Thu, Jul 3 2014 2:24 AM | Last Updated on Sat, Jun 2 2018 5:00 PM
Advertisement
Advertisement