Andhra Pradesh Excise Department
-
కల్తీతో కడతేరుతున్న బతుకులు
ఫార్స్‌గా తయారైన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సాక్షి, హైదరాబాద్ మద్యం వ్యాపారుల స్వార్ధం అమాయకుల ఉసురు తీస్తోంది. మొన్న అనంతపురం.. నేడు విజయవాడలో కల్తీ మద్యం తాగి దినసరి కూలీలు మృత్యువాత పడుతున్నారు. కల్తీ మద్యం అరికట్టాల్సిన ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంటు విభాగం మామూళ్ల మత్తులో జోగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎన్డీపీ లిక్కర్ భారీగా దిగుమతి అవుతున్నా.. స్టేట్ టాస్క్ఫోర్సు విభాగం (ఎస్టీఎఫ్) చేష్టలుడిగి చూస్తోంది. మరోవైపు చెక్‌పోస్టుల్లో 'నిఘా' నిద్దరోతోంది. ఎక్సైజ్ అధికారులు మామూళ్ల 'మత్తు'లో జోగుతున్నారు. ఫలితంగా సుంకం చెల్లించని మద్యం (నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్) రాష్ట్రంలో ఏరులై పారుతోంది. కర్ణాటక, తమిళనాడు, యానాంల నుంచి సరఫరా అవుతున్న ఎన్డీపీ మద్యం విక్రయాలు రాష్ట్రంలో జోరుగా సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తరలిరాకుండా ఉండేందుకు ఎక్సైజ్ శాఖ 39 చెక్‌పోస్టుల్ని ఏర్పాటు చేసింది. వీటిలో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కొత్తగా 14 చెక్‌పోస్టుల్ని ఏర్పాటుచేసింది. అయినా.. తెలంగాణ నుంచే భారీగా సుంకం చెల్లించని మద్యం ఏపీకి దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో అబ్కారీ చెక్‌పోస్టులు పేరుకే ఏర్పాటయ్యాయే తప్ప ఇక్కడ మొక్కుబడిగానే విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోకి అక్రమ మద్యం ప్రవేశిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖకు పూర్తి సమాచారమున్నా, కేసులు నమోదు, వాహనాల సీజ్ మాత్రం అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అక్రమ మద్యంపై నమోదైన కేసులు, ఎన్ని వాహనాలు సీజ్ చేశారనే సమాచారం కూడా ఆ శాఖ వద్ద లేదంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. యానాం నుంచి ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు, తమిళనాడు నుంచి చిత్తూరు, నెల్లూరు, కర్ణాటక నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలకు అక్రమ మద్యాన్ని సిండికేట్లు దిగుమతి చేసుకుంటున్నారు. మద్యం డిమాండ్‌ను బట్టి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మద్యం సరఫరా అవుతుంది. ఈ సరఫరాకు ట్రూ ట్రాన్స్‌పోర్టు పర్మిట్లు కేటాయిస్తారు. వీటిని అంతరాష్ట్ర చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేస్తారు. ఏపీలో ఐదు అంతరాష్ట్ర చెక్‌పోస్టులున్నాయి. వీటిని ట్రాన్స్‌పోర్టు, కమర్షియల్ ట్యాక్స్ తదితర శాఖలతో కలిసి ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులుగా నిర్వహిస్తున్నారు. ఈ ట్రూ ట్రాన్స్‌పోర్టు పర్మిట్లను అడ్డుపెట్టుకుని మద్యం మాఫియా ఎన్డీపీ మద్యం దిగుమతి చేసుకుంటోంది. ఇవన్నీ తెలిసినా ఎక్సైజ్ అధికారులు నెలవారీ మామూళ్లతో చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేపట్టడం లేదని విమర్శలున్నాయి. ఎక్సైజ్ శాఖ సమీక్షల్లో చెక్‌పోస్టుల్ని బలోపేతం చేసి అక్రమ మద్యం అడ్డుకుంటామని సర్కారు బీరాలు పలుకుతున్నా.. కార్యాచరణకు నోచుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఎక్సైజ్ శాఖలో సిమ్ కార్డుల రగడ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో సిమ్ కార్డుల రగడ రాజుకుంటోంది. డిపార్ట్మెంటుకు సంబంధించి కామన్ యూజర్ గ్రూప్ (సీయూజీ) సిమ్ కార్డులను ఎక్సైజ్ మంత్రి పేషీ మొత్తానికి ఇవ్వాలంటూ ప్రతిపాదనలు పెట్టడం.. ఇది కుదరదంటూ ఎక్సైజ్ శాఖ తేల్చి చెప్పడమే ఇందుకు కారణం. మంత్రి పేషీ సిబ్బందితో పాటు గన్మెన్లకు సిమ్ కార్డులు ఇవ్వాలంటూ పేషీ నుంచి ఫైల్ సర్క్యులేట్ చేశారు. మొత్తం తొమ్మిది మంది పేర్ల జాబితా ఫైల్ ఎక్సైజ్ శాఖకు చేరింది. ఒక్క మంత్రికే సిమ్ కార్డు ఇచ్చే విధానం ఉందని, ఆయన పేషీ సిబ్బందికి ఇచ్చే విధానం లేదని అధికారులు తేల్చిచెప్పారు. -
త్వరలో నూతన మద్యం విధానం: కొల్లు రవీంద్ర
గుంటూరు: త్వరలో బీసీ కమిషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఏపీ ఎక్సైజ్ , చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శనివారం గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మంగళగిరి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చేనేత రుణాలు ఎన్ని కోట్లున్నా రద్దు చేస్తామన్నారు. ఏపీ రాజధానిపై అందరి ఆమోదంతోనే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. త్వరలో నూతన మద్యం విధానాన్ని ప్రకటిస్తామని కొల్లు రవీంద్ర చెప్పారు. అంతకుముందు శ్రీలక్ష్మీగణపతి హోమం నిర్వహించారు. శ్రీగంగా భ్రమరాంబ, మల్లేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
‘ముంపు’లో హడావిడి
భద్రాచలం : ముంపు మండలాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎక్సైజ్‌శాఖ అధికారులు బుధవారం హడావిడి చేశారు. జూన్ 2 నుంచే ముంపులో ఉన్న మద్యం దుకాణాలు తమకు కేటాయించారని చెబుతున్న సదరు శాఖాధికారులు.. తాజాగా మరో అడుగు ముందుకేసి చెక్‌పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎక్సైజ్ సీఐ చిరంజీవి చిట్టిబాబు నేతృత్వంలోనే సుమారు 20 మంది సిబ్బంది ముంపు మండలాల్లో పర్యటించారు. చింతూరు మండలంలోని చట్టి వద్ద గతంలో ఉన్న చోటనే చెక్‌పోస్టు ఏర్పాటు చేసి, ఒక సీఐ, ఎస్సై, ఒక హెడ్‌కానిస్టేబుల్, ఎనిమిది మంది కానిస్టేబుళ్లను అక్కడ నియమించారు. వీరంతా బుధవారమే ఇక్కడ విధుల్లో చేరారు. చెక్‌పోస్టులు పక్కాగా ఏర్పాటు చేసుకొని విస్తృతంగా తనిఖీలు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేశారు. కూనవరం మండలంలోనూ మరో చెక్‌పోస్టు ఏర్పాటుకు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అయితే అక్కడి కంటే భద్రాచలం మండలం నెల్లిపాక వద్దనే చెక్‌పోస్టు ఏర్పాటుకు అనువుగా ఉంటుందని భావించి.. ఇక్కడ కూడా పరిశీలించారు. నెల్లిపాక సెంటర్లోని పెట్రోల్ బంక్ పక్కనున్న చిన్నపాటి తాటాకుల గుడిసెలో తాత్కాలికంగా చెక్‌పోస్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే దీన్ని ఇక్కడే ఉంచాలా.. మరెక్కడికైనా మార్చాలా అనేది కొద్ది రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. అయితే ప్రస్తుతానికి నెల్లిపాకలో ఒక ఎస్సై, ఒక హెడ్‌కానిస్టేబుల్, ఆరుగురు కానిస్టేబుళ్లు విధుల్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. సామగ్రి తెచ్చుకున్న అధికారులు... చెక్‌పోస్టులను ఏర్పాటు చేసేందుకు వచ్చిన ఎక్సైజ్ అధికారులు రంపచోడవరం నుంచే కుర్చీలు, ఇతర సామగ్రి వెంట తెచ్చుకున్నారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము వచ్చామని, చెక్‌పోస్టుల ఏర్పాటుకు తగిన భవనాలు లేకపోతే చిన్నపాటి గుడిసెల్లో అయినా నిర్వహిస్తామని ఎక్సైజ్ సీఐ చిరంజీవి చిట్టిబాబు తెలిపారు. బుధవారం నుంచే విధులు కేటాయించటంతో కొందరు సిబ్బంది అసంతృప్తికి లోనయ్యారు. కొత్త ప్రదేశంలో విధులు నిర్వహించటం కొంత ఇబ్బందే అయినా, ఇక్కడే ఉండి తీరాలని సీఐ వారికి సూచించారు. రాచమర్యాదలు చేసిన భద్రాచలం అధికారులు... ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన ముంపు ప్రాంతాలైన నెల్లిపాక, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాలతో తమకు సంబంధం లేదని భద్రాచలం ఎక్సైజ్ సీఐ రాంకిషన్ ప్రకటించారు. అయితే రంపచోడవరం నుంచి వచ్చిన ఎక్సైజ్ అధికారులకు ఆయన దగ్గరుండి మరీ రాచమర్యాదులు చేయటం పట్ల పలువరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముంపు మండలాల బదలాయింపుపై భద్రాచలం కేంద్రంగా ఓవైపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతుంటే.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన(భద్రాచలం) ఎక్సైజ్ శాఖ అధికారులు ఆంధ్ర వారికి రాచమర్యాదులు చేయడమేంటని స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు. అక్రమ మద్యం అమ్మకాలకు అడ్డు కట్ట ఏదీ... భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మద్యం దుకాణాల లెసైన్సుల గడువు ముగసింది. దీంతో అక్రమ మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించకుండా నెల్లిపాక వెళ్లి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులతో మంతనాలు జరపడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా నెల్లిపాక హోటల్లో సుమారు రెండు గంటల పాటు గడిపిన సీఐ రాంకిషన్‌ను ఫొటో తీసేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ సమయంలో సీఐ, ఎస్సై స్థాయి అధికారులకు నెల్లిపాకలో ఏం పని అనేది ఉన్నతాధికారుల పరిశీలనలో వెల్లడి కావాల్సి ఉంది. సొంతపనులపై వచ్చాం : సీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన అధికారులతో ఎటువంటి అప్పగింతలు చేయలేదని భద్రాచలం ఎక్సైజ్ సీఐ రాంకిషన్ తెలిపారు. తాము సొంతపనులు నిమిత్తమే ఇక్కడి వచ్చామని చెప్పారు. -
ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీ ఖరారు
హైదరాబాద్: నూతన ఎక్సైజ్ పాలసీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. మద్యం దుకాణాల నుంచి వసూలు చేయాల్సిన రుసుమును జనాభా ప్రాతిపదికన ఎక్సైజ్ శాఖ ఖరారు చేసింది. సంవత్సరం కాలవ్యవధితో ఈ ఫీజులు అమల్లో ఉంటాయి. 10 వేల లోపు జనాభా ప్రాంతంలో ఉన్న షాపు ఫీజు రూ. 32.50 లక్షలు 10 నుంచి 50 వేల లోపు జనాభా షాపు ఫీజు రూ. 36 లక్షలు 50 వేల నుంచి 2 లక్షల జనాభా షాపు ఫీజు రూ.45 లక్షలు 3 నుంచి 5 లక్షల జనాభా షాపు ఫీజు రూ. 50 లక్షలు 5 నుంచి 20 లక్షల జనాభా షాపు ఫీజు రూ. 64 లక్షలు 50 వేల జనాభా ఉన్న బార్‌కు ఫీజు రూ. 25 లక్షలు 5 లక్షల లోపు జనాభా ఉన్న బార్‌కు ఫీజు రూ. 38 లక్షలు 5 నుంచి 25 లక్షల జనాభా ఉన్న బార్‌కు ఫీజు రూ.41 లక్షలు