కల్తీతో కడతేరుతున్న బతుకులు | spurious, non duty paid liquor causing deaths of common people | Sakshi
Sakshi News home page

కల్తీతో కడతేరుతున్న బతుకులు

Published Mon, Dec 7 2015 4:02 PM | Last Updated on Sat, Jun 2 2018 5:00 PM

కల్తీతో కడతేరుతున్న బతుకులు - Sakshi

కల్తీతో కడతేరుతున్న బతుకులు

ఫార్స్‌గా తయారైన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం
 
సాక్షి, హైదరాబాద్‌
మద్యం వ్యాపారుల స్వార్ధం అమాయకుల ఉసురు తీస్తోంది. మొన్న అనంతపురం.. నేడు విజయవాడలో కల్తీ మద్యం తాగి దినసరి కూలీలు మృత్యువాత పడుతున్నారు. కల్తీ మద్యం అరికట్టాల్సిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంటు విభాగం మామూళ్ల మత్తులో జోగుతోంది.
 
ఇతర రాష్ట్రాల నుంచి ఎన్డీపీ లిక్కర్ భారీగా దిగుమతి అవుతున్నా.. స్టేట్ టాస్క్‌ఫోర్సు విభాగం (ఎస్టీఎఫ్) చేష్టలుడిగి చూస్తోంది. మరోవైపు చెక్‌పోస్టుల్లో 'నిఘా' నిద్దరోతోంది. ఎక్సైజ్ అధికారులు మామూళ్ల 'మత్తు'లో జోగుతున్నారు. ఫలితంగా సుంకం చెల్లించని మద్యం (నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్) రాష్ట్రంలో ఏరులై పారుతోంది.
 
కర్ణాటక, తమిళనాడు, యానాంల నుంచి సరఫరా అవుతున్న ఎన్డీపీ మద్యం విక్రయాలు రాష్ట్రంలో జోరుగా సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తరలిరాకుండా ఉండేందుకు ఎక్సైజ్ శాఖ 39 చెక్‌పోస్టుల్ని ఏర్పాటు చేసింది. వీటిలో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కొత్తగా 14 చెక్‌పోస్టుల్ని ఏర్పాటుచేసింది. అయినా.. తెలంగాణ నుంచే భారీగా సుంకం చెల్లించని మద్యం ఏపీకి దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో అబ్కారీ చెక్‌పోస్టులు పేరుకే ఏర్పాటయ్యాయే తప్ప ఇక్కడ మొక్కుబడిగానే విధులు నిర్వహిస్తున్నారు.
 
రాష్ట్రంలోకి అక్రమ మద్యం ప్రవేశిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖకు పూర్తి సమాచారమున్నా, కేసులు నమోదు, వాహనాల సీజ్ మాత్రం అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అక్రమ మద్యంపై నమోదైన కేసులు, ఎన్ని వాహనాలు సీజ్ చేశారనే సమాచారం కూడా ఆ శాఖ వద్ద లేదంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది.
 
యానాం నుంచి ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు, తమిళనాడు నుంచి చిత్తూరు, నెల్లూరు, కర్ణాటక నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలకు అక్రమ మద్యాన్ని సిండికేట్లు దిగుమతి చేసుకుంటున్నారు. మద్యం డిమాండ్‌ను బట్టి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మద్యం సరఫరా అవుతుంది. ఈ సరఫరాకు ట్రూ ట్రాన్స్‌పోర్టు పర్మిట్లు కేటాయిస్తారు. వీటిని అంతరాష్ట్ర చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేస్తారు. ఏపీలో ఐదు అంతరాష్ట్ర చెక్‌పోస్టులున్నాయి. వీటిని ట్రాన్స్‌పోర్టు, కమర్షియల్ ట్యాక్స్ తదితర శాఖలతో కలిసి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులుగా నిర్వహిస్తున్నారు. ఈ ట్రూ ట్రాన్స్‌పోర్టు పర్మిట్లను అడ్డుపెట్టుకుని మద్యం మాఫియా ఎన్డీపీ మద్యం దిగుమతి చేసుకుంటోంది.
 
ఇవన్నీ తెలిసినా ఎక్సైజ్ అధికారులు నెలవారీ మామూళ్లతో చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేపట్టడం లేదని విమర్శలున్నాయి. ఎక్సైజ్ శాఖ సమీక్షల్లో చెక్‌పోస్టుల్ని బలోపేతం చేసి అక్రమ మద్యం అడ్డుకుంటామని సర్కారు బీరాలు పలుకుతున్నా.. కార్యాచరణకు నోచుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement