మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడిస్తున్న వివేకానందరెడ్డి
సాక్షి, హైదరాబాద్: బ్రెజిల్ నుంచి సముద్ర మార్గం ద్వారా ముంబైకి అటునుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన సూత్రధారి డివైన్ ఎబూకా ఎట్టకేలకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ హైదరాబాద్ బృందానికి చిక్కాడు. ఈ మేరకు సోమ వారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆబ్కారీ శాఖ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హైదరాబాద్ డివిజన్ సి.వివేకానందరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ కార్యకలాపాలు నిర్వహిస్తూ.. హైదరాబాద్‌లో కొకైన్ విక్రయించే ప్రధాన సూత్రధారి (ముఠా నాయకుడు) నైజీరియా దేశానికి చెందిన డివైన్ ఎబూకా సుజును నానల్ నగర్‌లోని ఓ ఇంట్లో ఉండగా పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ హైదరాబాద్ బృందం పట్టుకుంది. ఎబుకాతోపాటు అతడి ప్రియురాలు ఐవరీ కోస్ట్ దేశానికి చెందిన టోరి అమినాట అనే మహిళను కూడా అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.7.42 లక్షల విలువైన 106 గ్రాముల కొౖకైన్ , రూ.70 వేల నగదు, 4 సెల్‌ఫోన్లు, డ్రగ్స్ రవాణాకు ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఒక్కరు చిక్కడంతో క్లూ..
పది రోజుల క్రితం నానల్ నగర్‌లోని ఎసర్ పెట్రోల్ పంపు వద్ద టాంజానియా దేశానికి చెందిన జాన్‌పాల్ 3 గ్రాముల కొకైన్‌తో ఎన్‌ఫోర్స్‌మెంట్ హైదరాబాద్ బృందానికి పట్టుబడ్డాడు. ఇతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందంమొత్తం కూపీ లాగారు. జాన్‌పాల్ ఇచ్చిన సమాచారంతో జూన్ 24వ తేదీన గోల్కొండ ఖాదర్‌బాగ్‌లోని ఓ ఇంటిపై దాడులు చేయగా ఐవరీ కోస్ట్ పౌరుడు జాడీ పాస్కల్, ఒకోరో ఉచెన్నా శామ్యూల్‌తోపాటు ఎబూకా సోదరుడు చిమ గుడ్‌లక్‌లను పట్టుకున్నారు. ఆ సమయంలో వారి నుంచి రికార్డు స్థాయిలో రూ.17.78 లక్షల విలువైన 254 గ్రాముల కొకైన్, నగదు రూ.3.20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత 2 రోజులకు సైనిక్‌పురిలో ఉంటున్న ఘనా పౌరుడు నెల్సన్ శామ్యూల్ స్మిత్, రిపబ్లిక్ ఆఫ్ జాప్రి దేశానికి చెందిన మార్క్ 4 గ్రాముల కొకైన్‌తో పట్టుబడ్డారు. పట్టుబడిన ఒక్కొక్కరి నుంచి పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఈ ముఠా బెంగళూరు కేంద్రంగా దందా కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.
అంతా చిక్కడంతో తానే రంగంలోకి..
డివైన్ ఎబూకా టీం సభ్యులంతా పట్టుబడటంతో హైదరాబాద్‌లోని వినియోగదారులకు కొకైన్ విక్రయించడం ఇబ్బందిగా మారింది. దీంతో చివరకు ఎబూకానే రంగంలోకి దిగాడు. బెంగళూరు నుంచి అతని గర్ల్‌ఫ్రెండ్ టోరి అమినాటతో కలసి హైదరాబాద్‌కు వచ్చి నానల్ నగర్‌లో ఉంటున్నాడు. ముందే ఇతడిపై నిఘా పెట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఎబూకా అతడి, గర్ల్‌ఫ్రెండ్‌ను పట్టుకున్నారు. వీరి నుంచి 106 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
బ్రెజిల్ నుంచి హైదరాబాద్‌కు
ఎబూకాను ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం విచా రించగా ఈ దందా మొత్తం బ్రెజిల్ కేం ద్రంగా కొనసాగుతున్నట్లు గుర్తించింది. బ్రెజిల్‌లో ఉంటున్న నైజీరియన్ పౌరుడు చూస్ సముద్రమార్గం ద్వారా ముంబైకి కొకైన్ స్మగ్లింగ్ చేస్తున్నాడు. అటునుంచి థాగా అనే వ్యక్తి బెంగళూరుకు కొకైన్ సరఫరా చేస్తుండగా దానిని డివైన్ ఎబూకా తన అనుచరులతో కలసి హైదరాబాద్‌కు చేరవేస్తుంటాడు. హైదరాబాద్‌లో వినియోగదారులకు 6 నుంచి 7 వేల రూపాయలకు విక్రయిస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. నెలకు పైగా నిఘా పెట్టి కొకైన్ ముఠాకు చెక్ పెట్టిన బృందాన్ని సి.వివేకానందరెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment