Supply of drugs
-
డ్రగ్స్‌ను పట్టించిన ‘ఆధార్’
ఆటోనగర్ (విజయవాడ తూర్పు)/సత్తెనపల్లి: ఓ కొరియర్ సంస్థ ఉద్యోగి తెలియక చేసిన పొరపాటుతో డ్రగ్స్ గుట్టురట్టయ్యింది. విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి తెలివిగా అతని ఆధార్ కార్డుకు బదులు కొరియర్ సంస్థ ఉద్యోగి ఆధార్ కార్డు కాపీ జత చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. విజయవాడ సెంట్రల్ ఏసీపీ షేక్ ఖాదర్‌బాషా ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 31న పచ్చళ్లు, దుస్తుల పార్శిళ్లను ఆస్ట్రేలియాకు పంపాలంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడుకు చెందిన కొండవీటి సాయిగోపి విజయవాడ భారతీనగర్‌లోని డీఎస్టీ కొరియర్‌కు వచ్చాడు. నిబంధనల ప్రకారం కొరియర్ పార్శిల్ పంపే వ్యక్తి ఆధార్ కార్డు కాపీ జత చేయడం తప్పనిసరి. తన ఆధార్ కార్డు నంబరు ముద్రణ సరిగా లేదని, కొరియర్ సంస్థలో పనిచేస్తున్న గుత్తుల తేజ ఆధార్ కార్డు జత చేయమని సాయిగోపి కోరాడు. దీంతో తేజ తన ఆధార్ కార్డు కాపీని జత చేసి అస్ట్రేలియాకు పార్శిల్ పంపించాడు. ఈ పార్శిల్ ఆస్ట్రేలియాకు బదులుగా పొరపాటున కెనడా చేరింది. అక్కడ కవర్‌పై సరైన స్టిక్కరింగ్ లేకపోవడంతో దానిని బెంగళూరుకు తిప్పి పంపించారు. బెంగళూరు కస్టమ్స్ అధికారులు ఆ పార్శిల్‌ను తనిఖీ చేయగా.. అందులో 4,496 గ్రాముల నిషేధిత ‘ఎఫెండ్రిన్’ అనే తెలుపు రంగు డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో నిలిచిపోయిన ఈ పార్శిల్‌ను తీసుకురమ్మని గుత్తుల తేజను విజయవాడ డీఎస్టీ కొరియర్ నిర్వాహకులు ఏప్రిల్ 27న అక్కడకు పంపించారు. అక్కడ తేజను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించి ఏప్రిల్ 30న అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని తేజ విజయవాడ ప్రసాదంపాడులో ఉంటున్న తన బావ కరుణాకర్‌కు తెలియజేశాడు. దీనిపై విజయవాడ పటమట పోలీస్ ఇన్స్పెక్టర్ సురేష్‌రెడ్డితో కలిసి దర్యాప్తు చేపట్టినట్లు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ డివిజన్ ఏసీపీ ఖాదర్‌బాషా చెప్పారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు కాగా, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడుకు చెందిన కొండవీటి సాయిగోపిని విజయవాడ పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అతడిని విజయవాడ తీసుకెళ్లారు. సాయిగోపిని అదుపులోకి తీసుకునే విషయంలో విజయవాడ పోలీసులకు తాము సహకరించామని సత్తెనపల్లి రూరల్ సీఐ రామిశెట్టి ఉమేష్ చెప్పారు. -
పాతతరం మందులకు స్వస్తి
సాక్షి, అమరావతి: రోగాల తీరు మారిపోయింది. ఎన్ని మందులు వాడినా కొన్నిరకాల వైరస్‌లను నివారించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో రోగాలను తగ్గించేందుకు అధునాతన మందులు అందుబాటులోకొచ్చాయి. కానీ.. ప్రభుత్వాస్పత్రులకు మందులను సరఫరా చేసే మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఎంఎస్ఐడీసీ) జాబితాలో మాత్రం 1995 నాటి మందులే ఉన్నాయి. వాటివల్ల చాలా రోగాలు తగ్గటం లేదు. దీంతో ఏసీ ఎంఎస్ఐడీసీ జాబితా నుంచి పాత తరం మందులను తొలగించి కొత్త మందులను చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తును కూడా పూర్తి చేసింది. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ మందులతోపాటు కొన్ని రకాల యాంటీ బయోటిక్స్‌ను కొత్త జాబితాలో చేర్చుతున్నారు. రెండు నెలలుగా వివిధ వైద్య విభాగాల నిపుణులు పలు దఫాలుగా సమావేశమై చర్చించిన అనంతరం కొత్త మందులు తీసుకోవాలని నిర్ణయించారు. మొత్తం 440 రకాల కొత్త మందులను నూతన జాబితాలో చేర్చుతున్నారు. ఈ అంశంపై ఈనెల 21, 22 తేదీల్లో ఏపీ ఎంఎస్ఐడీసీ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించి.. ఏయే మందులు తీసుకోవాలో నిర్ణయించారు. నాలుగైదు రోజుల్లో జాబితాను సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత ఈ జాబితాను ప్రభుత్వం ఉత్తర్వుల రూపంలో ఇస్తుంది. ఇదిలావుండగా.. 2018–19 సంవత్సరంలో మందుల కోసం రూ.160 కోట్లు బడ్జెట్ ఇవ్వగా.. కేవలం రూ.30 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ ఏడాది వినియోగం ప్రాతిపదికన నిధులు కేటాయించడంతో అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కొత్త మందుల జాబితాపై వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ.. రోగాలకు పనిచేయని మందులు జాబితాలో ఉన్నా ఉపయోగం లేదని, అందుకే వాటిని తొలగించి కొత్త మందులను ఎంపిక చేశామన్నారు. కుక్క కాటు (ఏఆర్వీ) మందుల కొరతను నివారించేందుకు తొలిసారిగా ఏపీ ఎంఎస్ఐడీసీ ఆ మందులను జిల్లాలకు విమానంలో తరలించించిందన్నారు. ప్రణాళికా బద్ధంగా మందులను ఎంపిక చేసి జాబితా ఇస్తే సకాలంలో సరఫరా చేసేందుకు కృషి చేస్తామని ఎండీ హామీ ఇచ్చారన్నారు. -
డ్రగ్స్ సూత్రధారి ఎబూకా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బ్రెజిల్ నుంచి సముద్ర మార్గం ద్వారా ముంబైకి అటునుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన సూత్రధారి డివైన్ ఎబూకా ఎట్టకేలకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ బృందానికి చిక్కాడు. ఈ మేరకు సోమ వారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆబ్కారీ శాఖ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హైదరాబాద్ డివిజన్ సి.వివేకానందరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ కార్యకలాపాలు నిర్వహిస్తూ.. హైదరాబాద్‌లో కొకైన్ విక్రయించే ప్రధాన సూత్రధారి (ముఠా నాయకుడు) నైజీరియా దేశానికి చెందిన డివైన్ ఎబూకా సుజును నానల్ నగర్‌లోని ఓ ఇంట్లో ఉండగా పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ బృందం పట్టుకుంది. ఎబుకాతోపాటు అతడి ప్రియురాలు ఐవరీ కోస్ట్ దేశానికి చెందిన టోరి అమినాట అనే మహిళను కూడా అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.7.42 లక్షల విలువైన 106 గ్రాముల కొౖకైన్ , రూ.70 వేల నగదు, 4 సెల్ఫోన్లు, డ్రగ్స్ రవాణాకు ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కరు చిక్కడంతో క్లూ.. పది రోజుల క్రితం నానల్ నగర్‌లోని ఎసర్ పెట్రోల్ పంపు వద్ద టాంజానియా దేశానికి చెందిన జాన్‌పాల్ 3 గ్రాముల కొకైన్‌తో ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ బృందానికి పట్టుబడ్డాడు. ఇతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ బృందంమొత్తం కూపీ లాగారు. జాన్‌పాల్ ఇచ్చిన సమాచారంతో జూన్ 24వ తేదీన గోల్కొండ ఖాదర్‌బాగ్‌లోని ఓ ఇంటిపై దాడులు చేయగా ఐవరీ కోస్ట్ పౌరుడు జాడీ పాస్కల్, ఒకోరో ఉచెన్నా శామ్యూల్‌తోపాటు ఎబూకా సోదరుడు చిమ గుడ్లక్లను పట్టుకున్నారు. ఆ సమయంలో వారి నుంచి రికార్డు స్థాయిలో రూ.17.78 లక్షల విలువైన 254 గ్రాముల కొకైన్, నగదు రూ.3.20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత 2 రోజులకు సైనిక్‌పురిలో ఉంటున్న ఘనా పౌరుడు నెల్సన్ శామ్యూల్ స్మిత్, రిపబ్లిక్ ఆఫ్ జాప్రి దేశానికి చెందిన మార్క్ 4 గ్రాముల కొకైన్‌తో పట్టుబడ్డారు. పట్టుబడిన ఒక్కొక్కరి నుంచి పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరించిన ఎన్ఫోర్స్మెంట్ బృందం ఈ ముఠా బెంగళూరు కేంద్రంగా దందా కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. అంతా చిక్కడంతో తానే రంగంలోకి.. డివైన్ ఎబూకా టీం సభ్యులంతా పట్టుబడటంతో హైదరాబాద్‌లోని వినియోగదారులకు కొకైన్ విక్రయించడం ఇబ్బందిగా మారింది. దీంతో చివరకు ఎబూకానే రంగంలోకి దిగాడు. బెంగళూరు నుంచి అతని గర్ల్‌ఫ్రెండ్ టోరి అమినాటతో కలసి హైదరాబాద్‌కు వచ్చి నానల్ నగర్లో ఉంటున్నాడు. ముందే ఇతడిపై నిఘా పెట్టిన ఎన్ఫోర్స్మెంట్ బృందం ఎబూకా అతడి, గర్ల్‌ఫ్రెండ్‌ను పట్టుకున్నారు. వీరి నుంచి 106 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్రెజిల్ నుంచి హైదరాబాద్‌కు ఎబూకాను ఎన్ఫోర్స్మెంట్ బృందం విచా రించగా ఈ దందా మొత్తం బ్రెజిల్ కేం ద్రంగా కొనసాగుతున్నట్లు గుర్తించింది. బ్రెజిల్లో ఉంటున్న నైజీరియన్ పౌరుడు చూస్ సముద్రమార్గం ద్వారా ముంబైకి కొకైన్ స్మగ్లింగ్ చేస్తున్నాడు. అటునుంచి థాగా అనే వ్యక్తి బెంగళూరుకు కొకైన్ సరఫరా చేస్తుండగా దానిని డివైన్ ఎబూకా తన అనుచరులతో కలసి హైదరాబాద్‌కు చేరవేస్తుంటాడు. హైదరాబాద్‌లో వినియోగదారులకు 6 నుంచి 7 వేల రూపాయలకు విక్రయిస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. నెలకు పైగా నిఘా పెట్టి కొకైన్ ముఠాకు చెక్ పెట్టిన బృందాన్ని సి.వివేకానందరెడ్డి అభినందించారు. -
డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
పోలీసుల అదుపులో నలుగురు నైజీరియన్లు యువదర్శకుడు, యువనిర్మాత కీలకపాత్ర బంజారాహిల్స్: డ్రగ్స్‌ముఠా గుట్టు రట్టయ్యింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురు నైజీరియన్లతో పాటు ఒక యువ దర్శకుడు, యువ నిర్మాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్ జోన్ డీసీపీ ఎ. వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన ఏనుగు సుశాంత్‌రెడ్డి(28) ‘సూపర్‌స్టార్ కిడ్నాప్’ అనే సినిమాతో చిత్రపరిశ్రమలో కాలుమోపాడు. ఈ క్రమంలో డ్రగ్స్‌కు అలవాటుపడిన అతను యువ నిర్మాత, సినిమా డిస్ట్రిబ్యూటర్, ఆర్కె. మీడియా నిర్వాహకులు పనస రవికుమార్(35)తో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఈ నేపథ్యంలో మూడురోజుల క్రితం ఇద్దరూ కలిసి ఫిలింనగర్లో నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కొంత కాలంగా డ్రగ్స్ కొనుగోలు చేస్తూ తాము తీసుకోవడమే కాకుండా సినిమా పరిశ్రమలో మరికొందరికి సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడించారు. వారి సమాచారం ఆధారంగా నైజీరియాకు చెందిన సోలా అలియాస్ సుల్తాన్(29), శ్యాంసన్ ఎబూపా(24), ఉజోర్ ప్రామిస్(29), అటోబ్ బోషా కెల్విన్(33)లను అరెస్టు చేశారు. వీరి నుంచి 90 గ్రాముల కొకైన్, 40 ప్యాకెట్ల గంజాయి, ఆరు సెల్ఫోన్లు, రెండు వేయింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరైన సోలా గతంలో పలుమార్లు సినీ ప్రముఖులకు కొకైన్ సప్లయ్ చేస్తూ పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. వీరు గోవా, ముంబై నుంచి డ్రగ్స్‌ను తీసుకొస్తూ నగరంలో విక్రయిస్తున్నారన్నారు. ఉజోర్ ప్రామిస్‌కు వీసా గడువు ముగిసినా నగరంలోనే ఉంటూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. పరారీలో ఉన్న విక్టర్, ప్యాట్రిక్ అనే మరో ఇద్దరు నైజీరియన్ల గాలిస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. నిందితులు నిజాం కళాశాల విద్యార్థులుగా చెలామణీ అవుతూ నగరంలో తిష్టవేసినట్లు ఆయన వివరించారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ 1985, ఫారెనర్స్ యాక్ట్ 1946 కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారంతో డ్రగ్స్ముఠాను పట్టుకున్నందుకు సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్ఐ మహేందర్‌రెడ్డికి రివార్డులు అందజేయనున్నట్లు డీసీపీ ప్రకటించారు.