ప్రతీకాత్మక చిత్రం
ఆటోనగర్ (విజయవాడ తూర్పు)/సత్తెనపల్లి: ఓ కొరియర్ సంస్థ ఉద్యోగి తెలియక చేసిన పొరపాటుతో డ్రగ్స్ గుట్టురట్టయ్యింది. విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి తెలివిగా అతని ఆధార్ కార్డుకు బదులు కొరియర్ సంస్థ ఉద్యోగి ఆధార్ కార్డు కాపీ జత చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. విజయవాడ సెంట్రల్ ఏసీపీ షేక్ ఖాదర్‌బాషా ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 31న పచ్చళ్లు, దుస్తుల పార్శిళ్లను ఆస్ట్రేలియాకు పంపాలంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడుకు చెందిన కొండవీటి సాయిగోపి విజయవాడ భారతీనగర్‌లోని డీఎస్‌టీ కొరియర్‌కు వచ్చాడు.
నిబంధనల ప్రకారం కొరియర్ పార్శిల్ పంపే వ్యక్తి ఆధార్ కార్డు కాపీ జత చేయడం తప్పనిసరి. తన ఆధార్ కార్డు నంబరు ముద్రణ సరిగా లేదని, కొరియర్ సంస్థలో పనిచేస్తున్న గుత్తుల తేజ ఆధార్ కార్డు జత చేయమని సాయిగోపి కోరాడు. దీంతో తేజ తన ఆధార్ కార్డు కాపీని జత చేసి అస్ట్రేలియాకు పార్శిల్ పంపించాడు. ఈ పార్శిల్ ఆస్ట్రేలియాకు బదులుగా పొరపాటున కెనడా చేరింది. అక్కడ కవర్‌పై సరైన స్టిక్కరింగ్ లేకపోవడంతో దానిని బెంగళూరుకు తిప్పి పంపించారు. బెంగళూరు కస్టమ్స్ అధికారులు ఆ పార్శిల్‌ను తనిఖీ చేయగా.. అందులో 4,496 గ్రాముల నిషేధిత ‘ఎఫెండ్రిన్’ అనే తెలుపు రంగు డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో బెంగళూరులో నిలిచిపోయిన ఈ పార్శిల్‌ను తీసుకురమ్మని గుత్తుల తేజను విజయవాడ డీఎస్‌టీ కొరియర్ నిర్వాహకులు ఏప్రిల్ 27న అక్కడకు పంపించారు. అక్కడ తేజను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించి ఏప్రిల్ 30న అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని తేజ విజయవాడ ప్రసాదంపాడులో ఉంటున్న తన బావ కరుణాకర్‌కు తెలియజేశాడు. దీనిపై విజయవాడ పటమట పోలీస్ ఇన్‌స్పెక్టర్ సురేష్‌రెడ్డితో కలిసి దర్యాప్తు చేపట్టినట్లు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ డివిజన్ ఏసీపీ ఖాదర్‌బాషా చెప్పారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు
కాగా, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడుకు చెందిన కొండవీటి సాయిగోపిని విజయవాడ పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అతడిని విజయవాడ తీసుకెళ్లారు. సాయిగోపిని అదుపులోకి తీసుకునే విషయంలో విజయవాడ పోలీసులకు తాము సహకరించామని సత్తెనపల్లి రూరల్ సీఐ రామిశెట్టి ఉమేష్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment