పోలీసుల అదుపులో నలుగురు నైజీరియన్లు
యువదర్శకుడు, యువనిర్మాత కీలకపాత్ర
బంజారాహిల్స్: డ్రగ్స్‌ముఠా గుట్టు రట్టయ్యింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురు నైజీరియన్లతో పాటు ఒక యువ దర్శకుడు, యువ నిర్మాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్ జోన్ డీసీపీ ఎ. వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన ఏనుగు సుశాంత్‌రెడ్డి(28) ‘సూపర్‌స్టార్ కిడ్నాప్’ అనే సినిమాతో చిత్రపరిశ్రమలో కాలుమోపాడు. ఈ క్రమంలో డ్రగ్స్‌కు అలవాటుపడిన అతను యువ నిర్మాత, సినిమా డిస్ట్రిబ్యూటర్, ఆర్‌కె. మీడియా నిర్వాహకులు పనస రవికుమార్(35)తో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఈ నేపథ్యంలో మూడురోజుల క్రితం ఇద్దరూ కలిసి ఫిలింనగర్‌లో నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కొంత కాలంగా డ్రగ్స్ కొనుగోలు చేస్తూ తాము తీసుకోవడమే కాకుండా సినిమా పరిశ్రమలో మరికొందరికి సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడించారు. వారి సమాచారం ఆధారంగా నైజీరియాకు చెందిన సోలా అలియాస్ సుల్తాన్(29), శ్యాంసన్ ఎబూపా(24), ఉజోర్ ప్రామిస్(29), అటోబ్ బోషా కెల్విన్(33)లను అరెస్టు చేశారు. వీరి నుంచి 90 గ్రాముల కొకైన్, 40 ప్యాకెట్ల గంజాయి, ఆరు సెల్‌ఫోన్లు, రెండు వేయింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరైన సోలా గతంలో పలుమార్లు సినీ ప్రముఖులకు కొకైన్ సప్లయ్ చేస్తూ పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు.
వీరు గోవా, ముంబై నుంచి డ్రగ్స్‌ను తీసుకొస్తూ నగరంలో విక్రయిస్తున్నారన్నారు. ఉజోర్ ప్రామిస్‌కు వీసా గడువు ముగిసినా నగరంలోనే ఉంటూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. పరారీలో ఉన్న విక్టర్, ప్యాట్రిక్ అనే మరో ఇద్దరు నైజీరియన్ల గాలిస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. నిందితులు నిజాం కళాశాల విద్యార్థులుగా చెలామణీ అవుతూ నగరంలో తిష్టవేసినట్లు ఆయన వివరించారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ 1985, ఫారెనర్స్ యాక్ట్ 1946 కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారంతో డ్రగ్స్‌ముఠాను పట్టుకున్నందుకు సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐ మహేందర్‌రెడ్డికి రివార్డులు అందజేయనున్నట్లు డీసీపీ ప్రకటించారు.
డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
Published Wed, Feb 25 2015 11:54 PM | Last Updated on Wed, Oct 17 2018 5:28 PM
Advertisement
Advertisement