లేడీ డాన్ సంగీత ఉచ్చులో బడా ‘బాబు’లు
హైదరాబాద్ : నైజీరియన్ డ్రగ్స్ ముఠా కేసులో అరెస్ట్ అయిన లేడీ డాన్ సంగీత పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. మూడు రోజుల పాటు జరిగిన ఈ విచారణలో అనేక విషయాలు వెలుగు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంగీతకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆమె ఓ వైపు డ్రగ్స్ విక్రయిస్తూనే మరోవైపు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది.
అలాగే తన మాట వినకపోతే యువతుల న్యూడ్ ఫోటోలను చూపించి బ్లాక్ మెయిల్ పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రియుడు జాన్‌తో కలిసి సంగీత నగర శివారులోని ఇంజనీరింగ్ విద్యార్థులకు డ్రగ్స్ సప్లయి చేసేది. బంజారాహిల్స్‌కు చెందిన పలువురి ప్రముఖుల పిల్లలు ఆమె ఉచ్చులో ఉన్నట్లు విచారణలో వెలుగు చూశాయి. ఇందుకు సంబంధించి ఆరుగురిని ప్రశ్నించిన పోలీసులు, వారి రక్త నమూనాలును సేకరించారు.
కాగా విజయవాడకు చెందిన పాలపర్తి సంగీతకు పెళ్లయిన ఆరు నెలలకే భర్త చనిపోయాడు. అనంతరం విజయవాడలోని ఓ కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్న సమయంలో ఆమెకు ఫేస్‌బుక్‌లో సూడాన్‌కు చెందిన ఓ అమ్మాయి పరిచయమైంది. కొంతకాలానికి సంగీత హైదరాబాద్‌కు మకాం మార్చగా.. ఆ సూడాన్ స్నేహితురాలి ద్వారా నైజీరియాకు చెందిన ఒజుకు కాస్మోస్, అతడి స్నేహితులతో పరిచయమైంది.
ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి నుంచి వారితో కలసి డ్రగ్స్ అక్రమ రవాణాలో భాగస్వామిగా మారింది. రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని బండ్లగూడ సన్‌సిటీలో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని ఒజుకు కాస్మోస్‌తో కలసి ఉంటోంది. కాస్మోస్ గాబ్రిల్ అనే స్నేహితుడి సహాయంతో కొకైన్, బ్రౌన్‌షుగర్, అంఫిటమైన్ టాబ్లెట్‌లను తీసుకొచ్చి... తన స్నేహితులు జాన్ ఒకొరి, సిరిల్, హెన్రీ, సంగీతలతో కలసి హైదరాబాద్‌లో సరఫరా చేస్తున్నాడు.
సంగీత పేరు మీద బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు తీసుకుని వినియోగిస్తున్నాడు. జాన్, సిరిల్‌లు నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. కొందరు నైజీరియన్లు డ్రగ్స్ విక్రయిస్తున్నారనే సమాచారంతో రాచకొండ ఎస్‌వోటీ, ఎల్‌బీ నగర్ పోలీసులు నిఘాపెట్టారు. ఈ క్రమంలోనే గతనెల 23న ఎల్‌బీనగర్ బస్టాపులో సంగీతను, జాన్‌ను అదుపులోకి తీసుకుని.. మూడు గ్రాముల కొకైన్, 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం సంగీత వెల్లడించిన వివరాల మేరకు.. సన్‌సిటీలోని నివాసంలో దాడి చేసి కాస్మోస్‌ను అరెస్టు చేసి, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కాస్మోస్ ఇచ్చిన సమాచారంతో మేడ్చల్ జిల్లా యాప్రాల్‌లోని తిరు అపార్ట్‌మెంట్‌లో, సిరిల్ అనే ముఠా సభ్యుడి నివాసంలో కార్డన్ సెర్చ్ చేపట్టి మరో ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.