గం‘జాయింట్’గా కొడదామా?
‘హాయ్ మామా.. బాగా గ్యాప్ వచ్చింది. జాయింట్ కొడదాం పద..’.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మాటలివి..‘ఏం స్ట్రెస్రా బాబూ ఇది. టార్గెట్లతో తలపగిలిపోతోంది. చలో బయటికి వెళ్లి కాస్త స్కోర్ చేసొద్దాం’.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సంభాషణ ఇది.... వాళ్లు ఏదో టీ తాగడానికో, టిఫిన్ చేయడానికో వెళ్లడం లేదు. గంజాయి తాగేందుకు వెళదామని కోడ్ భాషలో చెప్పుకొంటున్నారు. ఇక్కడా, అక్కడా అని కాదు హైదరాబాద్ మహా నగరంలో చాలా చోట్ల ఈ గంజాయి కల్చర్ కనబడుతోంది. కొందరిలో ఇదో సోషల్ స్టేటస్‌గా మారింది. నగరంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వివిధ పోలీసు విభాగాల మధ్య కొరవడిన సమన్వయాన్ని గంజాయి విక్రేతలు ఆసరాగా తీసుకుని, మరింతగా రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.సాక్షి, హైదరాబాద్: గంజాయి మహమ్మారి రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ మత్తుకు బానిస అవుతున్న వారి జాబితా క్రమంగా పెరుగుతోంది. గతంలో కొన్నివర్గాలకే పరిమితమైన గంజాయి.. ఇప్పుడు స్కూళ్లు, కాలేజీల విద్యార్థుల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దాకా పాకింది. పెద్ద పెద్ద ఆస్పత్రుల వైద్యులు సైతం గంజాయి మత్తుకు బానిస అవుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. ఆరు నెలల క్రితం హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి చెందిన కొందరు వైద్యులు గంజాయి వాడుతున్నట్టు తెలియడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో మందలించి వదిలేయడం గమనార్హం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై యుద్ధం ప్రకటించింది. మత్తు దందాలపై ఉక్కుపాదం మోపాలని పోలీస్, ఎక్సైజ్, టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు బహిరంగంగానే ఆదేశాలు జారీ చేశారు. కానీ వివిధ విభాగాల మధ్య తగిన సమన్వయం లేకపోవడం, కొందరు అధికారులు దీనిని సీరియస్‌గా తీసుకోకపోవడం, గంజాయి సరఫరా దారులు కొత్తకొత్త మార్గాలు అనుసరిస్తూ, వినియోగదారులనే విక్రేతలుగా మారుస్తుండటం వంటివి గంజాయి దందా యథేచ్ఛగా సాగిపోవడానికి దారితీస్తున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా గంజాయి వాడుతున్న వారి సంఖ్య 10లక్షల వరకు ఉందని అంచనా వేస్తున్నారు. దందాలోకి దిగుతున్న విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీల్లో గంజాయి వాడకం క్రమంగా పెరుగుతోంది. తొలుత ఒకరిద్దరితో మొదలయ్యే ఈ వ్యసనం స్నేహితుల మధ్య విస్తరిస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో కొందరు బెట్టింగ్‌లకు, జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం గంజాయి విక్రేతలుగా మారుతున్నారు. అలాంటి వారిని కట్టడి చేయడం పోలీసులు, దర్యాప్తు ఏజెన్సీలకు ఒకింత తలనొప్పిగా మారింది. ఈజీ మనీకి గంజాయి మార్గం! చాలా మంది కష్టపడకుండా డబ్బులు వస్తుండటంతో (ఈజీ మనీ) గంజాయి అమ్మకాలకు దిగుతున్నారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల (ఏఓబీ)కు వెళితే ఏడెనిమిది వేల రూపాయలకే రెండు కిలోల గంజాయి దొరుకుతుంది. దాన్ని హైదరాబాద్ వరకు తెస్తే.. ఆ రెండు కిలోల ప్యాకెట్ రూ.15 వేలకు కొంటారు. అదే ఒక్కో కిలో గంజాయిని 10 గ్రాముల చొప్పున 100 ప్యాకెట్లు చేసి.. ఒక్కో ప్యాకెట్‌ను రూ.300 చొప్పున అమ్ముతారు. అంటే కిలోకు రూ.30 వేలు వస్తాయి. రెండు కిలోల గంజాయి ప్యాకెట్‌ను రూ.15 వేలు పెట్టి కొంటే.. దాన్ని విక్రయించడం ద్వారా..రూ.45 వేలు మిగిలించుకుంటారు. ఇలా ఈజీ మనీ కోసం కొందరు గంజాయి అమ్మకంలోకి దిగుతున్నారు. నియంత్రణపై హడావుడికే పరిమితం హైదరాబాద్‌లో గంజాయికి ప్రధానంగా ధూల్‌పేట్, నానక్‌రామ్‌గూడ, సీతాఫల్మండి, ఫతేనగర్ హబ్‌లుగా ఉండేవి. ఇప్పుడు చాలా ప్రాంతాలు అడ్డాలుగా మారాయి. అంగోరి భాయ్, గాంజా కిశోర్, సునీతభాయ్, ముఖేశ్‌సింగ్, దీపు, సట్టా కిశోర్, రౌడీ గోపాల్, రౌడీ విశాల్ వంటి 25 మంది వరకు గంజాయి విక్రేతలు ఉన్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. వారు 30, 40 కిలోల చొప్పున గంజాయి తెప్పించి.. రిటైల్‌గా విక్రయించేవారికి సరఫరా చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు సంస్థలకు సమాచారం అందుతున్నా పైపైన హడావుడికే పరిమితం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. గంజాయి కట్టడిలో టీజీ నార్కోటిక్స్ బ్యూరో, స్థానిక పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వంటి విభాగాల మధ్య సమన్వయ లోపం కూడా గంజాయి స్మగ్లర్లకు కలిసి వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏఓబీ టు నార్త్ ఇండియా.. వయా తెలంగాణ! ఏఓబీ (ఆంధ్రా– ఒడిశా బార్డర్), ఛత్తీస్‌గఢ్, వైజాగ్ తదితర ప్రాంతాల్లో పండించే గంజాయిని.. ఉత్తర భారతదేశంతోపాటు ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు తెలంగాణ కారిడార్‌గా మారిందనే విమర్శలు ఉన్నాయి. స్మగ్లర్లు రైలు, రోడ్డు మార్గాల్లో పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లోనూ రవాణా చేస్తున్నారు. టీజీ నార్కోటిక్స్ బ్యూరో, ఎక్సైజ్, స్థానిక పోలీసులు, డీఆర్ఐ అధికారుల తనిఖీల్లో తరచూ గంజాయి పట్టుబడుతోంది. ఇలా పట్టుబడుతున్నది స్వల్పమేనని, అంతకు ఎన్నో రెట్లు తరలుతోందని సమాచారం. ఇక వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లోనూ గంజాయి ఏజెంట్లు నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నారని.. వారి ద్వారా స్థానికంగా గంజాయి అమ్మకాలు జరుపుతూనే ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారని తెలిసింది. డ్రగ్స్‌పై ఫోకస్ పెరగడంతో గంజాయి వైపు.. కొకైన్, ఎల్ఎస్డీ వంటి సింథటిక్ డ్రగ్స్ అమ్మకాలపై టీజీ నార్కోటిక్స్ బ్యూరో, పోలీస్, ఎక్సైజ్ ఫోకస్ పెరగడంతో.. చాలా మంది తక్కువ ధరకు, వెంటనే అందుబాటులో ఉండే గంజాయివైపు దృష్టి పెడుతున్నారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఎక్కువగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని లేబర్ కాలనీలు, రాజీవ్ గృహకల్ప, సైదాబాద్‌లోని సింగరేణి కాలనీ, ధూల్‌పేట్, జీడిమెట్ల, చింతల్, సూరారం కాలనీ, దుండిగల్ సహా పలు పారిశ్రామిక ప్రాంతాల్లో గంజాయి వాడకం విస్తృతంగా పెరిగింది. గోల్కొండ, లక్ష్మీనగర్, ఎల్‌బీనగర్‌లతోపాటు హాస్టళ్లు ఎక్కువగా ఉన్న అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్, నెక్లెస్‌రోడ్, ఇతర పార్కులు వంటి చోట్ల గంజాయి విక్రయాలు సాగుతున్నట్టు తెలిసింది. శిక్షల భయం లేకపోవడంతో.. గంజాయి కేసులలో నిందితులపై శిక్షలు సరిగా లేకపోవడంతో వారిలో భయం ఉండటం లేదన్న వాదనలు ఉన్నాయి. కిలోకుపైన గంజాయి పట్టుబడితేనే దాన్ని కమర్షియల్ క్వాంటిటీగా గుర్తిస్తారు. ఆ కేసులలోనే కఠిన శిక్షలుంటాయి. ఈ క్రమంలోనే గంజాయి సప్లయర్లు చిన్నచిన్న ప్యాకెట్లలో విడివిడిగా సరఫరా చేస్తున్నారు. వారు పట్టుబడినా బలమైన కేసులు ఉండటం లేదు. సరైన దర్యాప్తు లేని కారణంగా కూడా చాలా వరకు కేసులు వీగిపోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. పోలీసులకు చిక్కిన గంజాయి విక్రేతలు.. బెయిల్‌పై వచ్చాక మళ్లీ దందా మొదలుపెడుతున్నారు. ఇలా మళ్లీ మళ్లీ నేరం చేస్తున్నవారిపై పీడీ యాక్ట్ తరహాలో.. ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్ సైకోట్రోపిక్’ చట్టాన్ని నమోదు చేస్తున్నారు. దీనితో రెండేళ్ల వరకు బెయిల్ లభించే అవకాశం ఉండదు. అంతేగాక స్థానిక కోర్టుల అనుమతితో ‘స్మగ్లింగ్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్ (సఫెమా)’ ప్రయోగించేందుకూ పోలీసులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ యాక్ట్ ప్రకారం.. దోషులుగా తేలినవారి ఆస్తులను జప్తు చేయవచ్చు. గతేడాది నమోదైన నాలుగు కేసుల్లో నిందితులకు చెందిన రూ.8 కోట్లు విలువైన ఆస్తులను టీన్యాబ్ జప్తు చేసింది. గంజాయి చాక్లెట్లు... రాజస్థాన్, ఒడిశా నుంచి గాంజా, బంగ్ చాక్లెట్లు హైదరాబాద్ వస్తున్నాయి. కూరగాయలు, పండ్ల రవాణా వాహనాల్లో వాటిని తరలిస్తున్నారు. ఒక్కో చాక్లెట్‌ను రూ.40 నుంచి రూ.50కి అమ్ముతున్నారు. ఇటీవలే రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ టీమ్ 5 కిలోల బరువు గల 2,000 గాంజా బంగ్ చాక్లెట్స్ స్వా«దీనం చేసుకుంది. నాలుగు కేసులు రిజిస్టర్ చేసింది.