ఆంధ్రానేతల బూట్లునాకి మంత్రిని కాలే!
- శాసనసభలో మంత్రి జగదీశ్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
- కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డితో వాగ్వాదం.. అదుపుతప్పిన మంత్రి
- భగ్గుమన్న కాంగ్రెస్, పోడియం ఎదుట బైఠాయించి నిరసన
- గందరగోళంతో సభ పలుమార్లు వాయిదా
- విచారం వ్యక్తం చేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి
- అయినా శాంతించని కాంగ్రెస్ సభ్యులు
- సీఎం జోక్యం చేసుకోవాలంటూ సీఎల్పీనేత జానారెడ్డి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ‘ఆంధ్రా నేతల బూట్లు నాకి మంత్రిని కాలేదు.. ’ అంటూ కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డిని ఉద్దేశించి మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బుధవారం శాసనసభను కుదిపేశాయి. జగదీశ్‌రెడ్డి క్షమాపణ చెప్పాలం టూ కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టడంతో సభా కార్యకలాపాలు నిలిచిపోయాయి. వివాదాస్పద వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ ప్రకటించినా.. వారు వెనక్కి తగ్గలేదు. పైగా తన వ్యాఖ్యలు అభ్యంతరకరమైతే ఉపసంహరించుకుంటున్నానంటూ జగదీశ్‌రెడ్డి ముక్తసరిగా పేర్కొనడంతో కాంగ్రెస్ సభ్యులు మరింతగా ఆగ్రహానికి గురయ్యారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దే ఆందోళనకు దిగారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. చివరకు సీఎం కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పారు.
జరిగిందేమిటి..?
మహబూబ్‌నగర్ జిల్లాలో థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు అంశంలో ప్రశ్నలకు మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానం ఇస్తుండగా.. కాంగ్రెస్ సభ్యులు మైక్‌తో సంబంధం లేకుండా ప్రశ్నలు అడిగారు. దీంతో మంత్రి అసహనానికి గురయ్యారు. థర్మల్ ప్రాజెక్టును తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్నా... కొన్ని ప్రత్యేక పరిస్థితులతో దామరచెర్లలో ఏర్పాటుకు నిర్ణయించినట్లు చెప్పారు. అయితే ప్రాజెక్టు ఏర్పాటుకు మహబూబ్‌నగర్ అనుకూలంగానే ఉంటుందని డీకేఅరుణ పేర్కొన్నారు. దీనిపై జగదీశ్‌రెడ్డి బదులిస్తూ.. ‘ఆ జిల్లాలో ఏవి అవసరమో అవి పెడతాం. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు..’’ అని చెప్పారు. ఈ దశలో కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి లేచి.. ‘మంత్రికి అనుభవం లేనందున సమాధానం సరిగ్గా చెప్పడం లేద’ని అన్నారు దీంతో జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘నేను సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో గెలిచి మంత్రిని అయ్యాను. ఆంధ్రా నాయకుల చెప్పులు నాకి, వైఎస్సార్ బూట్లు నాకి మంత్రిని కాలేదు..’’ అని వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
జగదీశ్‌పై చర్యల తీసుకోవాల్సిందే..
మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చారు. జగదీశ్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభ్యులు తమ సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని, చిన్నారెడ్డికి మాట్లాడేందుకు అవకాశమిస్తామని స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి హరీశ్‌రావు చెప్పినా.. వెనక్కి తగ్గలేదు. స్పందించిన జగదీశ్‌రెడ్డి.. తన వ్యాఖ్యల్లో అభ్యంతరకర మాటలుంటే రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. అభ్యంతరకర పదాలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయినా కాంగ్రెస్ సభ్యులు పట్టువీడకపోవడంతో ఉదయం 10.30కు స్పీకర్ టీబ్రేక్ ప్రకటించారు. మళ్లీ 11.40కు సభ మొదలైంది. కాంగ్రెస్ సభ్యులు మళ్లీ పోడి యం వద్దకు వచ్చి నిరసన ప్రారంభించారు. అవినీతి మంత్రి జగదీశ్‌రెడ్డిని బహిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో సీబీఐ కేసుల చరిత్ర కాంగ్రెస్‌దేనంటూ మంత్రి హరీశ్ వ్యాఖ్యానించడంతో.. పరిస్థితి మళ్లీ అదుపుతప్పి, సభ వాయిదా పడింది.
మళ్లీ అదే సీన్..
12.15కు సభ తిరిగి ప్రారంభమైనా పరిస్థితి మారలేదు. మంత్రి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీపక్ష నేత లక్ష్మణ్, సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్ కోరారు. సభను హుందాగా నడిపేందుకు అన్ని పక్షాలు సహకరించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కానీ మంత్రి జగదీశ్‌రెడ్డి లేచి చిన్నారెడ్డిపై ఎదురుదాడికి దిగారు. ‘నన్ను తప్పుపట్టడం నాకు అవమానం కాదా? నాకు ఎమ్మెల్యేగా, మంత్రిగా అనుభవం లేకున్నా.. ఉద్యమ నేతగా ప్రజల మధ్య గడిపాను’ అని పేర్కొన్నారు. తన మాటల్లో అభ్యంతరకర పదాలుంటే ఉప సం హరించుకుంటున్నానని ప్రకటించారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలు తప్పోకాదో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాని వ్యాఖ్యానించారు. ఈ దశలో స్పీకర్ పలుఅంశాలపై చర్చను ప్రారంభిం చారు. తమను పట్టించుకోకుండా సభను నడపటంపై కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో... సభ మళ్లీ వాయిదా పడింది.
ముఖ్యమంత్రి రావాల్సిందే..
1.30కి సభ తిరిగి మొదలయ్యాక సీఎల్పీ నేత జానారెడ్డి సభలోకి వచ్చి మాట్లాడడానికి ఉపక్రమించటంతో కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్ద నుంచి వెళ్లి తమ స్థానాల్లో కూర్చున్నారు. సభలో ఏం జరిగిందో, ఎవరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారో తెలియాలంటే రికార్డులను పరిశీలించాలని, కెమెరా ఫుటేజ్‌లు చూడాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. సభ అదుపులోకి రావాలంటే ముఖ్యమంత్రిని పిలిపించాలని కోరారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానని జగదీశ్‌రెడ్డి మరోసారి చెప్పారు. కానీ సీఎం రావాల్సిందేనని కాంగ్రెస్ సభ్యులు గట్టిగా నిలదీయడంతో 2 గంటల సమయంలో మరోసారి సభ వాయిదా పడింది.
నేను క్షమాపణ చెబుతున్నా..: కేసీఆర్
సాయంత్రం సభ ప్రారంభమయ్యాక సీఎం వచ్చారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా సభను నిర్వహిస్తున్నారని, సభ్యులను అవమానపరిచేలా మాట్లాడ్డం సరికాదని పేర్కొన్నారు. కొందరు సభ్యులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. మొక్కుబడిగా క్షమాపణ చెప్పి, తర్వాతరోజు మళ్లీ అదే రీతిన ప్రవర్తిస్తున్నారని చెప్పారు.ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ.. తాను ఆంధ్రా పాలకుల బూట్లు నాకితే మంత్రి పదవి వచ్చిందో.. సోనియా స్వయానా తనను మంత్రి పదవికి సిఫార్సు చేశారో మంత్రి జగదీశ్‌రెడ్డి తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. దీంతో సీఎం కేసీఆర్ కలుగజేసుకొని చిన్నారెడ్డికి మంత్రి పదవి రావాల్సింది కాబట్టి వచ్చిందని, అందులో ఎటువంటి సందేహం లేదని సీఎం పేర్కొన్నారు. ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలను సంయమనంతో ఎదుర్కోవాలేగానీ, నువ్వెంత అంటే.. నువ్వెంతనే ధోరణి వద్దని తమ మంత్రులందరికీ చెప్పానన్నారు. జరిగిన దానిపై తాను క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. దీంతో వివాదానికి తెరపడింది.