దేవాపూర్ రేంజ్ పరిధిలో గుర్తించిన చిరుత అడుగు
వేమనపల్లి : వేమనపల్లి, ఒడ్డుగూడెం అటవీ సెక్షన్ పరిధుల్లో సోమవారం నుంచి మాంసాహార వన్యప్రాణుల జంతు గణన ప్రారంభమైంది. కుశ్నపల్లి అటవీ రేంజ్ అధికారి అప్పలకొండ నేతృత్వంలో సెక్షన్ అధికారులు జ్ఞానేశ్వర్, మధూకర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. వేమనపల్లి సెక్షన్ 3 అటవీబీట్‌లు, ఒడ్డుగూడెం 4 బీట్‌లలోని 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏయే జంతువులు సంచరించాయనే కోణంలో వివరాలు తెలుసుకున్నారు. వాటి పాదముద్రలు, పెంటికలు, మూత్ర విసర్జన చేసిన చోటును పరిశీలించారు. చిరుతపులి, తోడేళ్లు, నక్కలు, అడవికుక్కల ఆనవాళ్లు లభ్యమవుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. మూడు రోజుల పాటు మాంసాహార జంతువుల గణన చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. గణనలో బీట్ అధికారులు అనిల్, మధూకర్, బేస్ క్యాంప్, స్ట్రైకింగ్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
దేవాపూర్ రేంజ్ పరిధిలో..
కాసిపేట : మండలంలోని దేవాపూర్ అటవీ రేంజ్ పరిధిలోనూ జంతు గణన ప్రారంభమైంది. సెక్షన్ అధికారి ప్రమోద్‌కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన గణనలో చిరుతపులి అడుగులు గుర్తించినట్లు తెలిపారు. అడుగులను పెగ్‌మార్క్ చేసి పీవోపీ తీసినట్లు పేర్కొన్నారు. గణనను రేంజ్ అధికారి అనిత పర్యవేక్షించారు. గఢ్‌పూర్ ఎఫ్‌ఎస్‌వో అస్మా, బీట్ అధికారులు, అటవీ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
నెన్నెల: జంతు గణనలో భాగంగా మండలంలోని రంగపేట బీట్ పరిధిలో నర్సరీ వెనకాల పులి అడుగులు గుర్తించినట్లు కుశ్నపల్లి రేంజర్ అప్పలకొండ తెలిపారు. కుశ్నపల్లి రేంజ్ పరిధిలో బృందాలుగా ఏర్పడి జంతు గణన చేపట్టారు. చెక్‌డ్యాంలు, చెరువులు, నీటి వనరులు, వాగుల వద్ద జంతువులకు సంబంధించిన పాదముద్రలను, పెంట ఆధారాలను సేకరించినట్లు రేంజర్ వెల్లడించారు. మొదటి రోజు సర్వేలో డిప్యూటీ రేంజర్ రమాదేవి, సెక్షన్ అధికారులు పాటేకర్, గౌరి శంకర్, మల్లయ్య, జ్ఞానేశ్వర్, బీట్ అధికారులు కామరాజు, రమేశ్, అశోక్, స్ట్రైక్‌ఫోర్స్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment