సాక్షి, హైదరాబాద్ : వెనుకబడిన తరగతుల్లో మరో 18 కులాలు చేర్చే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. సంచార జాతులు, ఆశ్రిత కులాలను బీసీల్లో చేర్చే అంశంపై రాష్ట్ర బీసీ కమిషన్ ఇదివరకే బహిరంగ విచారణతో పాటు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి నివేదిక రూపొందించింది. ఇందులో ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందకుండా కేవలం ఇతర కులాలపై ఆశ్రయం పొందుతున్నవే ఎక్కువగా ఉన్నాయి. గత నెల 28తో గడువు ముగిసే క్రమంలో చివరిరోజున బీసీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వాస్తవానికి 30 కులాలను బీసీ కేటగిరీలో చేర్చాలనే డిమాండ్‌తో క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వానికి వినతులు వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం అధ్యయనంచేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర బీసీ కమిషన్‌ను ఆదేశించింది. దీంతో బీసీ కమిషన్ ఆమేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ క్రమంలో పూర్తిస్థాయి వివరాలు, ఆధారాలతో బహిరంగ విచారణకు రావాలని ఆదేశించిన నేపథ్యంలో కేవలం 19 కులాలకు చెందిన ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. వీటిలో 18 కులాలకు సంబంధించి వివరాలు పక్కాగా ఉన్నట్లు తెలిసింది. కులాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆర్థికస్థితి, విద్య, ఉద్యోగాలు, జీవన ప్రమాణాలను బీసీ కమిషన్ లోతుగా అధ్యయనం చేసింది. బృందాలుగా ఏర్పడి జిల్లాల వారీగా పర్యటనలు చేసింది. ఈక్రమంలో 18 కులాలను బీసీ జాబితాలో చేర్చేందుకు అర్హత ఉన్నట్లు నిర్ధారించింది. ఇందులో కొన్ని బీసీ ఏ కేటగిరీలో, మరికొన్ని బీసీ డీ కేటగిరీలో చేర్చే అవకాశముంది. బీసీ కమిషన్ కాలపరిమితి ముగిసే చివరి రోజున పరిశీలన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం బీసీ కమిషన్ నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఈ నివేదికను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ రెండో వారంలోగా పరిశీలన ప్రక్రియ పూర్తవుతుందని, వెనువెంటనే నూతన కులాల చేర్పుపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెలువర్చే అవకాశముందని సమాచారం.
ప్రతిపాదించిన కులాలివే..
గంజికుంటి, ఎనూటి, రామజోగి, అరవకోమటి, బాగోతుల, గౌడజెట్టి, పటంవారు, గోవిలి, సొన్నాయిల, అద్దపువారు, అహిర్ యాదవ, సారోళ్లు, బౌల్ కమ్మర, తేరచీరాల, కుల్ల కడగి, ఓడ్, కాకిపగడాల, తోలుబొమ్మలవారు.
Comments
Please login to add a commentAdd a comment