
శవాన్ని పీక్కుతిన్న ఎలుకలు
► జగిత్యాల ధర్మాసుపత్రిలో మరో దారుణం
► సిబ్బంది నిర్లక్ష్యంపై బంధువుల ఆందోళన
జగిత్యాల :
మొన్న...
డ్యూటీ డాక్టర్ ఫోన్‌లో చెబితే నర్సులు ఓ నిండు గర్భిణీకి ఆపరేషన్ చేశారు.. కళ్లు తెరవ కుండానే నవజాత శిశువు కన్నుమూసింది!
నేడు...
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకు న్నాడు.. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్తే చనిపోయాడని నిర్ధారించిన వైద్యులు శవాన్ని మార్చురీకి తరలించారు.. తెల్లారి బంధువులు వెళ్లి చూసేసరికి ఆ శవాన్ని ఎలుకలు పీక్కుతిన్నాయి!!
...జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వా సుపత్రిలో దారుణాలివీ. మనుషుల ప్రాణాల కే కాదు.. ఇక్కడ శవాలకు కూడా రక్షణ లేకుండా పోతోందని రోగులు మండిపడుతు న్నారు. తాజాగా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో మార్చురీలో ఉంచిన మృతదేహాన్ని ఎలుకలు ఛిద్రం చేయడం కలకలం రేపింది. శవాన్ని అంతా పొడిచి పీక్కుతినడంతో ముఖం గుర్తు పట్టకుండా మారిపోయింది. సిబ్బంది నిర్లక్ష్యా న్ని నిరసిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
ఇంత నిర్లక్ష్యమా..?
జగిత్యాలలోని అమీనాబాద్‌కు చెందిన షేక్ అర్షద్‌పాషా(36) స్థానిక చల్‌గల్‌లోని మామిడి మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య ఆయేషా, ముగ్గురు కొడుకులున్నారు. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో అర్షద్ రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసు కున్నాడు. గమనించిన కుటుంబీకులు, చుట్టు పక్కల వారు అర్షద్‌ను జిల్లాస్పత్రికి తీసుకెళ్లారు.
అయితే అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. రాత్రి సమయం కావడంతో పోస్టుమార్టం చేయ లేదు. దీంతో వైద్య సిబ్బంది.. అర్షద్ బంధు వులను సంప్రదించి మృతదేహాన్ని ఆస్పత్రి లోని మార్చురీకి తరలించారు. రాత్రంతా ఆస్ప త్రిలోనే వేచి ఉన్న బంధువులు ఆదివారం ఉదయం పోస్టుమార్టం విభాగం నిర్వాహకుడు తాళం తీయగానే.. ఆయన తోపాటు లోపలికి వెళ్లి చూశారు. అర్షద్ ముఖం, కాలు, చేతులపై గాయాలు చూసి ఆందోళన చెందారు. చివరికి మృతదేహాన్ని ఎలుకలు పీక్కుతిన్నట్లు వారు నిర్ధారణకు వచ్చారు.
బంధువుల ఆందోళన
ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి నిరసనగా మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. జగిత్యాల అర్బన్ తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి, సీఐ ప్రకాశ్ ఆస్పత్రికి వచ్చి వారితో మాట్లాడారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించి మృతదేహాన్ని తీసుకెళ్లారు.
చర్యలు తీసుకుంటాం..
వంద పడకల ఆస్పత్రిలో రోగుల సంఖ్య రెండింతలు పెరిగింది. అందుకే అప్పుడప్పుడు.. అనుకోకుండా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఏమాత్రం లేదు. శవాన్ని ఎలుకలు కొరికిన ఘటనపై విచారణ జరిపిన బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అశోక్‌కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్